Saturday, November 28, 2009

రెండవ ఆర్య

ఆర్థికరంగంలో కాలం గడిపే వారికి డెరివేటివ్సు గురించి వేఱుగా చెప్పవలసిన అవసరంలేదు.మిగతా వారి కి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది , కాకపోతే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం వాటి గురించి చర్చించడం కాదు కాబట్టి కావలసినంత మేరకు చెప్పుకుని ముందుకు సాగుదాం. అసలు సరుకులకు ఉండవలసిన విపణులు ఉండనే ఉన్నాయి, వాటిని ఆధారంగా చేసుకొని సృజించబడే విపణులే డెరివేటివ్ విపణులు. వీటిలో అసలు సరుకులు కొనే సదుపాయం ఉండదు, కానీ వాటి ధరను కనిపెట్టి దాని బట్టి పత్ర క్రయవిక్రయము చేయడం జరుగుతుంది.

సరిగ్గా అలాంటివే డెరివేటివ్ సమీక్ష లంటే. ఇవి వ్రాయడానికి సినిమాచూసే అవసరం లేనే లేదు. పత్రికలు, అంతర్జాల గూళ్ళు కనిపెట్టుకు కూర్చుని వాటిలో ఇతరులు వ్రాసిన ఆణిముత్యాలను సేకరించి, ఆకళింపుచేసుకొని, కొంతసేపు బబ్బుని లేచి, మనమే గనక ఆ సినిమాకు బలై ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుంటూ వ్రాస్తే సరిపోతుంది. పలు కారణాల వల్ల కొన్ని సినిమాలు చూసే ధైర్యం మనకు కలగకపోవచ్చు, అలాంటప్పుడు వాటిమీద మనకు గల అభిప్రాయాల్ని స్వేఛ్ఛగా వ్రాసుకోగల స్వేఛ్ఛను డెరివేటివ్ సమీక్షలు ప్రసాదిస్తాయి. ఆర్థిక డెరివేటివ్సు లో లాగ ఇందులో కూడా ఓనర్షిప్పులేకుండానే షార్టుపొజిషన్ అనే ఒక వీలు కలిపించుకొని బండి లాగించేయచ్చు.

ఆ ప్రేరణతో వ్రాయబూనిన సమీక్షలలో మొదటిది - రెండవ ఆర్య సమీక్ష.

పత్రికలు, టీవీ వాహినుల పుణ్యమా అని ఆర్య అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అల్లు అర్జున్ అనబడే ప్లవంగముఖుని చిత్రమే. ఆ చిత్రం అంత గొప్పగా లేకపోయినా,కథానాయక దర్శకుల రాశి వాసికెక్కించాలని పైవాడు పూనుకోవడం వల్ల, నిర్మాతేతరులకు బాగానే డబ్బు కూడగట్టి పెట్టింది . అది అదనుగా చూసుకొని, ఇతర భాషలలో ప్రసిధ్ధి కెక్కిన ధారావాహిక చిత్రాలు తీసే పధ్ధతిలో, పులిని చూసి నక్క అన్న రీతిలో, వారిని చూసి మనతెలుగు ప్రేక్షకులకు వాతలు పెట్టేసాడు దర్శకుడు. తలలు పట్టుకుని జనం హాళ్ళనుంచి పరుగుల మీద బయటకు వస్తున్నారు.

అమ్మాయి పట్టించుకోకపోయినా , ముంబాయిలో భోజన డబ్బాలు సరఫరా చేసే వాడిలో ఉన్న దీక్షవంటిది పూని ఆ అమ్మాయి చుట్టూరా తిరుగుతూ తోకాడించే అబ్బాయిల ప్రేమ ఆర్యప్రేమ. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం లేదని బోధించే పధ్ధతిది. భగ్నప్రేమలో భగ్నాన్ని చూడని గుడ్డి ప్రేమ ఇది.

ఇక కథవిషయానికొస్తే, చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అబ్బాయికి అబ్బాయంటే ఆర్యప్రేమ, ఆ అబ్బాయిలిద్దరికీ అమ్మాయి మీద ప్రేమ, ఆ అమ్మాయి నాన్నకి డబ్బుమీద ప్రేమ, మరో అమ్మాయికి అబ్బాయిమీద ఆర్యప్రేమ ఉన్న అబ్బాయి మీద ఆర్యప్రేమ. ఇన్ని ప్రేమల్లో ఎవరి ప్రేమ సఫలం అవుతుందనేది కథకి అయువు పట్టు, ప్రేక్షకుల సహనానికి గొడ్డలిపెట్టు. మొదటి సగం అంతగా బాగుండక పోయినా, రెండవ సగం (పూర్తిగా చూడగలిగితే) చూసిన తరువాత ఫర్వాలేదనిపిస్తుంది. రెండవ సగం పూర్తిగా చూడలేక హాల్లోంచి పరుగెడితే ఇక చెప్పేదేముంది. ఈ రెండవ రకం వాళ్ళే ఎక్కువ మంది ఉండడంతో చిత్రానికి చెడ్డ పేరొస్తోందని నా నమ్మకం.

హోరు సంగీతపు పాటల జోరు, శ్వేతాజిన భామల అందాల ఒలకబోత,కొత్తరకం డాన్సులు, స్టైలు రాదరు దాను సబ్స్టెన్సు ఉంటే చిత్రాలు ఢంకా భజాయిస్తాయని నమ్మే వాళ్ళకి, మొదటిసారి ఓ వెలుగు వెలిగింది కదా అదే పేరుతో ఇంకో చిత్రం తీసేసి ప్రేక్షకుల కు కథమేత వేయకుండా పితికేద్దామని చూసే దర్శకులకు ఈ చిత్రం కనువిప్పు కలిగిస్తుందని నాకు అనిపిస్తోంది.

నా మాట విని ఈ చిత్రం ఆడుతున్న హాలు దరిదాపులకి కూడా వెళ్ళకండి. రెండు నెలలో ఎలాగూ టీవీలో ఉచితంగా వచ్చేస్తుంది, అప్పుడు టీవీ కట్టేసుకోవచ్చు.

Belt అంటే?

"నాన్నా నాన్నా చెప్పూ
దీన్నేమంటారు? నాకు తెల్సి మటుక్కూ
దీన్నందరు బెల్టంటా
ర్నాన్నా?" "కన్నా , తెలుగులొ నాకు మటుక్కూ

పట్టీ అని తెలుసునమ్మా"

Friday, November 27, 2009

Fork అంటే?

"నాన్నా నాన్నా చెప్పూ
దీన్నేమంటారు? నాకు తెల్సి మటుక్కూ
దీన్నందరు ఫోర్కంటా
ర్నాన్నా?" "కన్నా , తెలుగులొ నాకు మటుక్కూ

ముళ్ళచెమ్చా అనాలనిపిస్తోందమ్మా"

Tuesday, November 24, 2009

స్వర సంగమము

నవంబరు ఇరవై ఒకటవ తారీఖు, అంటే క్రితం శనివారం నాటి సాయంత్రం నాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచ్చేరి లో కూర్చునే మహద్భాగ్యం కలిగింది.అజయ చక్రవర్తిగారి తో సహా వచ్చి స్వరసంగమమనే పేరుతో, హిందుస్తానీ కర్ణాటకమనే విభేదాలు కొత్తగా మనము సృజించినవేనని ప్రాచీన పుస్తకాలలో లేవని చాటుతూ, భారతీయమను శైలిని - సింగపూరు ఎస్ప్లనేడు వేదిక నలంకరించి - పాడిన బాలమురళీకృష్ణ గారి ని వేళ్ళలెక్క అడుగుల దూరంలో కూర్చుని వినగలిగే భాగ్యమే భాగ్యము, అది నా సొంతమయ్యింది.

అసలు ఈ కార్యక్రమము క్రితం ఏడాది జరుగవలసిందే. టికెట్లు గట్రా అమ్మేసి, సర్వసన్నధ్ధాలు పూర్తి చేసుకున్న తరువాత అజయ చక్రవర్తి గారికి అనారోగ్యం కలగడం వల్ల చివరి నిముషంలో కచ్చేరిని నిలిపివేయవలసి వచ్చింది. సరిగ్గా ఏడాది తిరగ కుండానే కార్యక్రమ నిర్వాహకులు నిలిపివేయబడ్డ కాచ్చేరిని తిరగతెచ్చి ఉస్సూరన్న ఎందరో సంగీతప్రియుల ప్రాణాలకు హాయి కలిగించారు.

కచ్చేరిని మహతి రాగములోని గురుస్తుతి తో మొదలు పెట్టారు. మహతి రాగము కనిపెట్టింది బాలమురళీగారే. షడ్జమము, గాంధారము, పంచమము, నిషాదమను నాలుగు స్వరాలే గల రాగంలో వారు పాడిని గురుస్తు తి గొప్పగా ఉంది. తరువాత హంసధ్వనిలో అజయ చక్రవర్తి హిందీ కృతిని పాడుతూ, చివరలో దాన్ని వాతాపిగణపతింభజే తో కలిపి పాడి, కార్యక్రమానికి స్వరసంగమమనే పేరు సార్థకం చేసారు. తరువాత సామజవరగమన, అటుపై మృదంగము, తబ్లాల హోరాహోరీ జుగల్బంది, అది ముగియగానే బాలమురళీ వారి తిల్లానా, చివరగా బాల మురళీకృత గురుమంగళము - వెరసి రెండున్నర గంటల కర్ణపేయమైన సంగీతానుభవము, సభాసదుల పరవశము.

బాలమురళీకృష్ణ గారి ప్రియశిష్యుడు, పుత్త్రసమానుడైన అజయ చక్రవర్తి వంగ రాష్ట్రస్థుడైనప్పటికీ కర్ణాటక సంగీత సరళిని చక్కగా ఆకళింపు చేసుకొని పాడడము, తన ప్రియశిష్యులను అదే బాటలో నడిపించడము చూసి ముచ్చటేసింది. ఆయన శిష్యుడు కూడా అమోఘగాన కౌశల్యము ప్రదర్శించి సభని ఆకట్టుకున్నాడు.