Tuesday, March 21, 2017

నేటి పత్రికలు

నేటి పత్రికలలో ఏది నమ్మాలో, ఏది నమ్మలేమో తెలియని పరిస్థితి.

సీ. ఏది సత్యమొ మరి ఏది అసత్యమో, తేలిచి చెప్పుట వీలుకాదు
మనవాడు పలికిన మాట విషమయిన ఆచరణీయము అమృత మదియె
ఆవలిప్రక్కవా రాడిన సూనృతము తెవులుగొనిన వీరి చెవుల బడదు
మానవతావాద మానవాలు మతవాదముల బడినదయి సమసిపోయె   
ఆ.  నిజము చాటుచు తమ నిష్పక్షపాతము
కవచమై వెలుంగ ఘనముగాను
నిలిచి సత్యమునకు నెలవులౌ పత్రికల్
కాలగర్భ మందు కలసిపోయె

అలనాటి ప్రఖ్యాత బాణీ ఒకటి ఉంది.  తోడికొడళ్లు చిత్రములోనిది. కారులో షికారు కెళ్లే...పాట. దానికి హాస్యానుకరణ, మన పత్రికల పరిస్థితి. నేటి పత్రికల కలము లెంత విషమయమైనవో కదా.



హాస్యానుకరణ పల్లవి : జోరుగా పుకారు లల్లే, చొప్పరాతల పత్రిక పేనా
తగ్గకుంటే టక్కరిపనులు, తన్నిపోదురే తాళగలవా?
కన్నుగానక కల్లలెన్నియొ, కళ్లుగప్పుచు వల్లెవేస్తే
వాటి కూళపు పాళి నీకు వచ్చి చేరెను తెలుసుకో..
జోరుగా పుకారు లల్లే, చొప్పరాతల పత్రికపేనా
మురుగుపడిన నీ సిరాను మార్చు, మురికి విరిగతే కదా నిఖార్సు

౧ చరణం : బలిసి నీతి వీడినావే, తులువ చేతల తొట్టి  పేనా
తెలివి నీకు లేకపోయె, ఖలుల చేతుల చిక్కి పేనా
చీడపట్టిన కలము నీవు ఎలా మారి నా వింత త్వరగా
తరలినావే త్రెళ్లువార్తల తపనపెరిగి ధర్మం బుడిగి
పరువుపోయెను పాత్రికేయుల చొరవతగ్గుట లేదొకో
తారులో వికారవర్ణము చేరి అబ్బెనె పత్రిక పేనా 
మురుగుపడిన నీ సిరాను మార్చు, మురికి విరిగతే కదా నిఖార్సు

౨ చరణం
గాలిలాగ తేలిపోయే కల్లబొల్లి కబురుల పేనా
అడుగుఅడుగన ఇంతవిజయం ఎలా వచ్చెనో చెప్పగలవా
తెలివిమాటల విధమూవివరణ దేశమంతా నమ్మినారే
బొంకమాటల బొక్కసమ్ములు నింప లేవిక తెలుసుకో
తారులో వికారవర్ణము చేరి అబ్బెనె పత్రిక పేనా 
మురుగుపడిన నీ సిరాను మార్చు, మురికి విరిగతే కదా నిఖార్సు

Monday, March 20, 2017

జీవితంలో చరము

ఒక చరము (సెల్ఫోను) చేతి కందితే అంతకన్నా మహాప్రసాదం లేదు, పెద్దలకూ పిన్నలకూ నేడు.

తే. ఆటల మయిదానము చేతి కందివచ్చె
నురకలు పరుగులు తెరల నొదిగిపోయె
కనులు చేతివ్రేళ్లు విడిచి కదుల వేవి
జగము నింపుకొనె దనలో చరము భళిర


మరింత చెప్పాలంటే, వెలుగునీడలు అనే పాతచిత్రంలోని ఈ క్రిందిపాటను ఒకసారి గుర్తుచేసుకోండి. అదే బాణీలో ఈ సాహిత్యాన్ని పాడుకోండి. 



హాస్యానుకరణ పల్లవి -
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 1. జాలము, ముఖపుస్తకములతో కాలహరణమేగా
చదువలన్ని చంకలునాకే తుది పద్ధతులేగా
ఓ ఓ ఓ ఓ
చివరి కింక వివరములన్నీ క్షవరముతో తెలియునుగా
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 2. విలువలేని వ్యాఖ్యానములూ వెఱ్ఱివాద మేలా
నిజము లేని వార్తలగనులే నెగడి త్రవ్వనేలా, ఓ ఓ ఓ ఓ
పూట కొక్క చేటుని, పోగుచేయు టెందుకో
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 3. అగాథమే అంతర్జాలం, ఆచితూచి అడుగేస్తే
మోసాల వలలను త్రుంచే, ముదమున్నదిలే
ఉచితముగా వచ్చే వన్నీ, ఊరకనే పోవును
కీడెంచి మేలెంచాలి అదియే క్షేమతరం

మనవారికి దినచర్యలో చరము....