Monday, March 20, 2017

జీవితంలో చరము

ఒక చరము (సెల్ఫోను) చేతి కందితే అంతకన్నా మహాప్రసాదం లేదు, పెద్దలకూ పిన్నలకూ నేడు.

తే. ఆటల మయిదానము చేతి కందివచ్చె
నురకలు పరుగులు తెరల నొదిగిపోయె
కనులు చేతివ్రేళ్లు విడిచి కదుల వేవి
జగము నింపుకొనె దనలో చరము భళిర


మరింత చెప్పాలంటే, వెలుగునీడలు అనే పాతచిత్రంలోని ఈ క్రిందిపాటను ఒకసారి గుర్తుచేసుకోండి. అదే బాణీలో ఈ సాహిత్యాన్ని పాడుకోండి. 



హాస్యానుకరణ పల్లవి -
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 1. జాలము, ముఖపుస్తకములతో కాలహరణమేగా
చదువలన్ని చంకలునాకే తుది పద్ధతులేగా
ఓ ఓ ఓ ఓ
చివరి కింక వివరములన్నీ క్షవరముతో తెలియునుగా
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 2. విలువలేని వ్యాఖ్యానములూ వెఱ్ఱివాద మేలా
నిజము లేని వార్తలగనులే నెగడి త్రవ్వనేలా, ఓ ఓ ఓ ఓ
పూట కొక్క చేటుని, పోగుచేయు టెందుకో
మనవారికి దినచర్యలో చరము విడువలేని వెధ వలవాటై పట్టుకున్నది

చరణము 3. అగాథమే అంతర్జాలం, ఆచితూచి అడుగేస్తే
మోసాల వలలను త్రుంచే, ముదమున్నదిలే
ఉచితముగా వచ్చే వన్నీ, ఊరకనే పోవును
కీడెంచి మేలెంచాలి అదియే క్షేమతరం

మనవారికి దినచర్యలో చరము....

No comments:

Post a Comment