Showing posts with label సమస్యలు. Show all posts
Showing posts with label సమస్యలు. Show all posts

Tuesday, August 13, 2019

పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

కందిశంకరయ్యగారు నేడు ఇచ్చిన సమస్య

పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

నా పూరణ

దివ్వెల పండుగ వచ్చెను
నవ్వులు చల్లగ చిలికెను నలుదిశలందున్
జువ్వలు రేగెన్ కాకర
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్

Sunday, August 11, 2019

దత్తపది - కాక తాత పాప మామ

కాక, తాత, పాప, మామ - రామాయణార్థంతో స్వేచ్ఛాఛందంలో పద్యం. శంకరాభరణం బ్లాగులో నేటి దత్తపది.

స్థితప్రజ్ఞుఁడు రాముఁడు

సీ. కైక కోరికవల్ల కాకపోయెను వేడ్క , కడ కేఁగ వలసెను కానలకును
తాతతాతది యవతారమె చూడంగ, తాతవేలుపు వ్రాత తప్పలేదు
శాప మేనాటిదో పాపమవ్విధమున, నేలపట్టి నడచెఁ గాలిబాట
మామక మనుకున్న కామితభోగముల్, చేజారిపోయెను చిటికెలోన

తే. ఇన్ని కష్టముల్ జనియించె నిన కులునకు
నైన నావంత కోపమ్ముఁ బూన డతఁడు
కొండకోనల తిరుగాడుచుండి కూడ
చిరునగవు మోమున నొకింత చెరుగ దెపుడు

తాతతాత - విష్ణువు
తాతవేలుపు - బ్రహ్మ
మామకము - నాది

Friday, August 9, 2019

కలిమి తొలంగినప్పుడె సుఖమ్ము లభించు మానవాళికిన్

నేడు ఆకాశవాణిలో ప్రసారం చేసిన సమస్య - దానికి నా పూరణ

చ. తలకొనుదెంచు లాభములు తప్పుడుచేతల ధాన్యరాశులున్
చిలువలు పల్వలై పెరిగి చేతికి నల్ల ధనంబు చిక్కగా
నెలకొను బాధలెన్నియొ వినిర్మలమౌ గతి నెంచిపోవ యా
కలిమి తొలంగినప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్

Thursday, August 8, 2019

లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

నేడు శ్రావణ శుక్రవారము. ఆ సందర్భముగా కంది శంకరయ్యగారు ఇచ్చిన సమస్య ఇది.

లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

నా పూరణ.

సులభముగా దేవి కరుణ
కలుగుట కొక్క విధ మరయగ స్థిరము భువిపై
వెలిగెను, శ్రావణ మం దే 
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్?

మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

కంది శంకరయ్యగారు నేడు ఇచ్చిన సమస్య ఇది

మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్


నా పూరణ
భూతేశుని ఫాలాక్షుని
యా తెల్లనిదొర పశుపతి యసమాక్షుని సం
ప్రీతుని నాట్యకళాని
ర్మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

భూతేశుడు, ఫాలాక్షుడు, తెల్లనిదొర, పశుపతి, అసమాక్షుడు - ఇవి శివునికి పేర్లు.  ఆయననే నటరాజు అంటారు కదా, అదే రీతిలో నాట్యకళానిర్మాత అని సంబోధించాను. 


Tuesday, August 6, 2019

మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

శంకరాభరణం బ్లాగులో నేటి సమస్య ఇది

మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

నా పూరణ

ఈడు పదునెనిమిది కలుగ
యాడపడుచు బెండ్లి జరిగె నటుపై జరిగెన్
మూఁడేడుల సంసారము
మూఁడేఁడుల పిల్లకొక్క పుత్రుఁడు గలిఁగెన్

Monday, August 5, 2019

కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

రాజ్యాంగాధికరణము ౩౭౦ రద్దు చేసిన మోదీ ప్రభుత్వం. దానిపై కంది శంకరయ్య గారి సమస్య

కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

నా పూరణ -

కం. కల్లల సమయం బుడిగెను
తెల్లముగా ప్రజకుఁ నేడు దెలిసెను దేశం
బెల్లను కలయుట కించుక
కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ 

కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి

శంకరాభరణం బ్లాగులో నేడు కందిశంకరయ్యగారు ఇచ్చిన సమస్య

కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి


నా పూరణ

రామలక్ష్మణు లెందఱొ రక్కసులను
నేలకున్ దెచ్చి పదపడి నేలపట్టి  
కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
బ్రహ్మహత్యకున్ వాటిల్లు పాపమునకు

Saturday, August 3, 2019

కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

కంది శంకరయ్యగారు నేడు ఇచ్చిన సమస్య

కలము విడిచి మేటి కవిగ వెలిఁగె


నా పూరణ

బాధకు నిలయమని భవబంధమ్ములన్
విడిచి యరిగె తానె వేమయోగి
తెలిపె జగతికెల్ల తేటతెల్లముగ స
కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

Saturday, July 27, 2019

తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్య

తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

నా పూరణ

తొమ్మండ్రుండిరి యన్నలు
దమ్ములు నొక నింట నొకడు తగిలెను యమపా
శమ్మున పరివారమ్మున
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

తొమ్మండుగరన్నదమ్ములు, అందులో ఒక్కడు యమపాశానికి తగులుకొన్నాడు. మిగిలినది ఎనమండుగురన్నదమ్ములు. ఇద్దరు తలిదండ్రులతో కలగలిపి పరివారంలో ఉన్నది పదిమంది. అదీ అర్థం.

Friday, July 26, 2019

తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్య ఇది

తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్


నా పూరణ

కం. తప్పుడు త్రోవలఁ బోవుచు 
తప్పొప్పులు తెలియక కలఁతపడెడి వారే
తిప్పల బడయని విధముగ
తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్య ఇది. దానికి నా పూరణ

వేసవి యందున వేడికి
గాసిలపడి దీర్ప త్వరితగతి దాహంబున్
బోసిన మజ్జిగ నురుగుల
మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

Sunday, September 17, 2017

బే యని గౌరవము

ఈ రోజు రసధునిలో, ఛందస్సులో రవిప్రసాద్ గారు ఇచ్చిన సమస్య ఇది

బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

సమస్యని ఇవ్వడంలో కూడా ఆయన చక్కటి ప్రతిభను కనబరచినారు. బే ను బు+ఏ గా విడిదీసినప్పుడు కూడా కవీశ్వరుని అనే పదము కవి+ఈశ్వరుని అని విడుతుంది కనుక యతి చెల్లేవిధంగా, అలా కాకుండా బే ను బే గానే విడిచి పూరించిన వారికి కూడా అఖండయతి చెల్లే రీతిలో ఉన్నది.

ఇక నేను పూరించినది ఇది.

రాయలవారికొల్వుకుఁ పరాయిగవచ్చినవాడె యందఱిన్
వ్రాయసకారులెవ్వరని పందెమువేయఁగ బృవ్వుతోడ బా
బాయనిచెప్పివాని తలవంచగ లింగడ వీవు కారణం
బే యని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

రాయవవారి కొలువుకు పరాయిదేశం నుండి ఒక కవి రావడం, నేను మీరేది చెపితే అది వ్రాయగలను, నాకు ధీటుగా నిలిచే వ్రాయసకారులు ఎవ్వరైనా ఉన్నారాయని అడిగినప్పుడు - ఎంతటి సంక్లిష్టమైన పదబంధాలు, పద్యాలు ఇచ్చినా చటుక్కున వ్రాసిపడేసిన ఆ కవిని బృవ్వటబాబా అనే పద్యాన్ని చదివి తికమకపెట్టిన తెనాలిరామలింగడి కథ జగద్విదితమే. ఆ కథనే నేను పద్యములో వాడుకున్నాను.

బే ను కారణంబే అని వ్రాసుకున్న పిమ్మట మిగతా ఇతివృత్తతాన్ని ఎంచుకోవడం ఒక్కటే మిగిలిన పని. అక్కడ నాకు మనకు ప్రియుడైన వికటకవి సహకరించినాడు.

Tuesday, August 29, 2017

బుద్ధలేని వాడె బుద్ధు డనగ

ఈ వారం ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య - బుద్ధలేని వాడె బుద్ధు డనగ.

దీనిని మందుగా గొతమబుద్ధునికి జ్ఞానోదయం కాకముందు ఆయన అనుభవించిన సుఖాలను ఒకప్రక్క, వాటిని విడిచిన వెళ్లిన వైనం మఱొక ప్రక్క వ్రాద్దామని ఆలోచిస్తూ  - అప్పటికే రాజ్యలక్ష్మితో మొదలుపెడదామా, లేక వంశపారంపర్యముగా వచ్చిన సంపదతో మొదలుపెడదామా అని సతమతమవుతున్న నాకు అంగుళిమాలుని పేరు గురుతువచ్చింది. నెమ్మదిగా వ్రేలు తరిగి మాలచేసేవానికి వేలిచ్చి ముందుకు తీసుకపోయి జ్ఞానబోధచేసిన బుద్ధుడే మనసులో మెదిలాడు.

అలా ఈ పద్యం పుట్టింది. అదీ సంగతి.

సీ. గణ్యులు వినుతించు పుణ్యపథము వీడి పెడత్రోవలఁ వెడలి పెచ్చరిల్లి
రహదారుల నిలచి యహరహ మధికమౌ హింసకు పాల్పడి యీసడించి
తెరువరులను బట్టి పరలోకమున కంపి వ్రేలొక గుఱుతుగా మాలఁ జేర్చి
నరకమార్గముల వినాశకుం డంగుళిమాలుడై బ్రతుకు నమ్మారకుండు

ఆ.వె. మారకుండ వదల కూరకుండని స్వార్థ 
బుద్ధిలేనివాడె బుద్ధుడనగ
జెలగె వసుధలోన చేరబిల్చి ఖలుజ
న్మంబునటుల సార్థకంబుజేసె

అహరహము - అంటే ఎల్లప్పుడూ
తెరువరి - అంటే ప్రయాణికుడు. చిన్నయసూరి వ్రాసిన పంచతంత్రకథ తొల్లియొక తెరువరి అనే వాక్యంతోనే ప్రారంభమవుతుందని లీలగా జ్ఞాపకం
మారకుండు - అంటే హింసకుపాల్పడేవాడు

మఱియొక్క విషయమూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను వ్రాసే పద్యాలకు ప్రేరణగా, ఆలోచనలకు ఊతగా నిలిచినవాటిలో ధనికొండవారి సమస్యలది సింహభాగమే. అందువల్ల ఈ పద్యాన్ని ఆయనకే గౌరవంగా అంకితమిస్తున్నాను. ఆయన స్వీకరిస్తారని ఆశిస్తాను. 

Thursday, June 29, 2017

పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున

కందిశంకరయ్యగారు, ఈ విధంగా శెలవిచ్చారు. నిన్న.

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున"
(లేదా...)
"భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్"

నేను ఈ విధంగా పూరించాను

ఆ.వె. అయ్యవారు గృహము నందుఁ జేయఁ దొడఁగె
నంగరంగభోగ మతిశయిల్లఁ
గలికి యా ధరణిజకల్యాణ మా దేవి
పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున

ఉ. స్మార్త పురోహితుం డొకఁడు చక్కగ జేయ నుపక్రమించె స
ద్వర్తన మాచరించు విధి భార్యయు దోడుగ నిల్వ గేహమున్
మూర్తులఁ దెచ్చి పెండిలి సముద్భవభక్తి మహీజ చెల్వుడౌ
భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్

Sunday, April 2, 2017

శ్రీ యన కోప మాతనికి శ్రీలు గడించెను కోట్లుకోట్లుగన్

ధనికొండవారి సమస్య.

సమస్యను చదువగానే శ్రీ తో ఏది జోడిస్తే ధనవంతులకు నచ్చినిది వస్తుందా అని ఆలోచించగా, ఎక్కువగా సమయం పట్టలేదు మహాకవి శ్రీశ్రీ పేరు తట్టడానికి.

ఇంకేమి, మిగతాదంతా శ్రీశ్రీగారి భావాలను కాస్త వడకట్టి వ్రాసేస్తే సరిపోతుంది కదా.

అదే చేసాను ఈ పూరణలో, చూడండి. భావము సులభగ్రాహ్మమే.

ఉ. సాయముజేతు మందఱికి, సంపద లున్నవి పంచిపెట్టి నీ
నా యనుభేదభావముల నమ్మక ఎల్లరు సామ్యవాదస
ద్ధ్యేయము పెంపుజేయుఁ డని తెల్పుచుపాడిన విప్లవాగ్ని శ్రీ
శ్రీ యన కోప మాతనికి శ్రీలు గడించెను కోట్లుకోట్లుగన్

దత్తపది - మూడు, ఆరు, ఏడు, పది

ముఖపుస్తక ఛందోసమూహములో ధనికొండరవిప్రసాద్ గారు ఇచ్చిన దత్తపది ఇది. మూడు, ఆరు, ఎడు, పది - ఈ పదాలను సంఖ్యాపరంగా కాకుండా వేఱే అర్థాలు వచ్చేలాగ వ్రాయాలి. పురాణేతిహాసాలు నేపధ్యంగా ఉండాలి.

ఇదిగో నా పూరణ

 సీ. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు
గండ్రగొడ్డలి పడి క్షత్రియు లారుట, వంగిన వంశము లంగలార్చు
నోడింప పదునాలు గేడులు పట్టుట, రణభూమి రావణు రాణు లేడ్చు
తిమిరము సమయింప దివినుండి దిగునట, కలిని వీడుకొలుపఁ దిలకు డొకడు

తే. మొదటి పాదమున జెలఁగు మూడు గాను
ఆపయిన పదపడి వచ్చు నారు గాను
పిదప తెలియు నేడును పదియు వరుసఁ
దరచిచూచిన హరి యవతారసంఖ్య

వివరణ ఇదిగో.

సీసపద్యములో నాలుగు పాదములు, ఒక్కో పాదానికీ రెండు భాగాలు, క్రింద నాలుగు పాదాల ఎత్తుగీతి. వ్రాసుకోవడానికీ, చెప్పడానికీ ఎంత ఉన్నా ఇన్ని పాదాలలో తప్పక పూరించవచ్చు.

నేను ఎంచుకొన్న ఇతివృత్తం - విష్ణువు యొక్క దశావతారాలలో నాలుగు అవతారాలు. నాలుగు పాదాలు, నాలుగు పదాలు, నాలుగు అవతారాలు - సరిగ్గా సరిపోతాయి.

కాస్త చమత్కారంగా ఉంటుందని సీసములో మొదటి పాదము మూడవ అవతారము, రెండవ పాదము ఆరవ అవతారము, మూడవ పాదము ఏడవ అవతారము, చివరి పాదము పదవ అవతారము చెప్పబూనాను. అదే విషయం ఎత్తుగీతిలో వివరించాను కూడా.

సీసపద్యాల పాదాలు
౧. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు

ఘనుడు, అసుర కాలము - ఘనుడెవ్వరు, అసురుడెవ్వడు, ఈ ప్రశ్నలు ఉదయించవచ్చు. ఎలాగూ పద్యము హరి అవతారాలను గూర్చి కాబట్టి, అందులోనూ బ్రహ్మ (కంజుఁడు) కు వచ్చిన కష్ణము తీర్చిన అవతారమ మేమిటో చూస్తే, వరాహావతార మని తెలుస్తుంది. ఏవైఁనా అనుమానం మిగిలి ఉంటే ఎత్తుగీతిలో మొదటి పాదము అది కూడా తీరుస్తుంది.

ఇందులో మొదటి మూడు - కాలము మూడిందనే అర్థముతో, రెండవ మూడు సంధి వల్ల వచ్చినది. కష్టము + ఊడు, కష్టమూడు.

౨. పరశురామావతారము. క్షత్రియులు, ఆరుట లో అరు ఉన్నది. ఇక్కడ ఆరు అంటే ఓడిపోవడం లేక చనిపోవడం.  వంగిన వంశములు అంగలార్చు -రెండవ ఆరు చివరన వస్తుంది. అంగలార్చు అంటే బాధపడడం.

౩. రామావతారంలో రావణుణ్ణి సంహరించడానికి పట్టింది పదునాలుగు + ఏడులు అంటే సంవత్సరాలు. మొదటి ఏడు అక్కడ. రావణుఁడు మరణించడంతో ఆయన రాణులు ఎడవడం - అక్కడ రెండవ ఏడు. పై పాదాలలో పదాలలలాగే రెండూ సంఖ్యా పరంగా రాలేదు.

౪. ఇక చివరి పాదము, (పాపాపు) చీకటిని పారద్రోలడానికి - సమయింప దివినుండి..ఇందులో పది ఉన్నది. కలిని వీడుకొలుపన్, తిలకుఁడు - కలిసి వీడుకొలుపఁ దిలకుఁడు అయ్యింది.  మఱియొక పది వచ్చింది. రెండూ మళ్లీ సంఖ్యాపరంగా రాలేదు.

ఇక మిగిలినది ఎత్తుగీతి. దావి భావము సులభగ్రాహ్యమే.

అదండీ సంగతి.

శంకరాభరణం సమస్య - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఎన్నో రోజుల తరువాత శంకరాభరణం బ్లాగు సందర్శించాను. కంది శంకరయ్యగారు ఛందోప్రక్రియలకు చేస్తున్న సేవ లనల్ప మనితరసాధ్యమూను.

ఆయన ఇచ్చిన క్రొత్త సమస్య రెండు రకాలుగా ఉన్నది,

౧. మొదటిది కందములో - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్
౨. రెండవది ఉత్పలమాలలో - నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

రెంటికీ నా పూరణలు ఇవిగో

కం. నారాయణార్చనప్రియ
శారదగానప్రియ నుతసంచారనయా
చారప్రియ కలహప్రియ
నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఉ. ఆరయ నగ్నిసాక్షిగ మను వాడిన సాక్ష్యము లెవ్వి లేకనే
జేరిరి ప్రేయసీమణులు చెంతకు నోలి హితార్థలోకసం
చారిణి భక్తిరూపిణి విశారదరాగిణి భేదనాంగనల్
నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

ముందుగా పూరణకు నేనెంచుకున్న దారి. నారదమహాముని అంటే ఆజన్మబ్రహ్మచారి అనే విషయం విదితమే. దాని వల్ల మిగిలిన దారి, ఆయనకున్న లక్షణాలను పడతులుగా చెప్పడమే. అదే చేసాను.

మొదట కందపద్యం. నారాయణార్చనప్రియ - నారదుడు నారాయణార్చకుడు కదా.
శారదగానప్రియ - సరస్వతీదేవి ప్రసాదించిన గానకళకూడా నారదమహామునికి ఉన్నది.
నుత, సంచార, నయ, ఆచార, ప్రియ - అందిరిచే పొగడబడిన లోకసంచారమనే మంటి ఆచారమూ ఆయన సొత్తు
కలహప్రియ - నారదుల గూర్చి నేటి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గుణాన్ని గురించి వేఱే చెప్పనక్కరలేదు కదా.

ఇక ఉత్పలమాల.
ఆరయ - అంటే చూడగా (ఈ పదాన్ని పూరణల్లో పూరకంగా అంటే భావార్థాలపరంగా పెద్దతేడా తీసుకవచ్చేది కాకపోయినా గణాలు యతిప్రాసలు సరిపోవడానికి వాడే పదములాగ నేను తరచూ వాడుకుంటాను)
అగ్నిసాక్షిగా మనువు ఆడిన సాక్ష్యము లేవీ లేకనే
చేరిరి ప్రేయసీ మణులు ఆయన చెంతకు
ఓలి అంటి వరుసగా, ఈ పదము కూడా ఒక రకమైన పూరక పదమే కానీ ఇక్కడ వరుసగా పేర్లు చెపుతున్నాను కాబట్టి సరిపోతుంది.
హిత, అర్థ, లోక, సంచారిణి - లోక హితార్థము సంచారము చేయడం నారదమునికి అలవాటే
భక్తిరూపిణి - నారదుడంటేనే నారాయణుని మీద భక్తి
విశారదరాగిణి - పైన చెప్పునట్టు గానకళను ఈ విధంగా చెప్పాను
భేదన, అంగన - కలహప్రియలాగానే ఇదీనూ.

ఆ విధంగా రెండు పద్యాలలోనూ నలుగురు పడతులను ఇరికించి పూరణను గట్టెక్కించాను.
 

దుర్యోధనుని వ్యథ

నేడు ముఖపుస్తకపు ఛందోసమూహములో ధనికొండ రవిప్రాసద్ గారు ఇచ్చిన వర్ణనాంశము, దుర్యోధనుని వ్యథ.

ఒకవేళ కర్ణుఁడు ఏ కారణము చేతనో పరాయి పక్షమైన పాండవులను చేరినట్లు దుర్యోధనునికి తెలిసనట్లైతే ఆతడి మనోగత మేవిధముగా ఉంటుందో చిత్రీకరించాలి. స్వేచ్ఛా ఛందము.


అంశాన్ని గూర్చి ఆలోచించగానే మొట్టమొదట తట్టినది, ద్రౌపదీ వృత్తాంతము. ద్రౌపది నల్లనిదైనా ఎంతో అందమైనదని జగద్విదితమే. ఆమె మేనిరంగు కారణంగానే కృష్ణ అనే పేరును కూడా పడసినది. మొదటి పాదము కూర్పగానే, తళుక్కమని ఒక ఆలోచన మెదిలింది.

కృష్ణ శబ్దముతో నలువురి పే ర్లున్నాయి మహాభారతంలో. కృష్ణ అంటే ద్రౌపది అనే చెప్పుకున్నాం. కృష్ణభగవానుడు ఉండనే ఉన్నాడు. శరీరఛాయ వలన ఆర్జునుడు కూడా కృష్ణుడే. ఇక మహాభారత సూత్రధారి వంటివాడు వ్యాసుఁడు, ఆయన పేరు కృష్ణద్వైపాయనుఁడు. ఆయన పేరులోనూ కృష్ణ శబ్దము ఉన్నది.  వీరిలో మువ్వురు పాండవపక్షాన ఉన్నవారే. వేదవ్యాసుఁడు ధర్మము వైపు ఉన్నవా డనుకోవడంలో ఎటువంటి సందేహానికి తావులేదు.

ఇదీ నేపధ్యం. ఇక పూరణ చూడండి.

సీ. అక్కటా వగలాడి కా కృష్ణ కారవ వరుఁడైన సుఖమంచు భ్రమసినాడొ
అంగదేశము చాల కా కృష్ణు మాయలం బడి లోభనమ్ముల సడలినాడొ
అలనాటి ఆడంగి యా కృష్ణు పాశుపతాస్త్రపు కథలకు నడలినాడొ
అడవులం జీవించు నా కృష్ణు నెచ్చటో కలసి నా కెదురేగ కదలినాడొ
 

తే. కృష్ణ శబ్దమ్ములోనున్న కితవ మేమొ
నలుపు చీకట్లు వ్యాపించెఁ నాల్గు దిశలఁ
కర్ణు డావల బోయనే కష్ట మొదవెఁ
గృష్ణ వర్ణాభిధానలు కీడు సలుప


కితవము అంటే చెడ్డది
అభిధానము అంటే పేరు
ఒదవు అంటే కలుగు.

అదండీ సంగతి.

Sunday, May 24, 2015

వ్యాసుఁడు

ఈ రోజు ఫేస్బుక్కులో ధనికొండ రవిప్రసాద్ గారు పూరించమని ఒక సమస్య నుంచారు.

వ్యాసుని వ్యాసు డందు రది భావ్యము గాదని నాకు దోచెడిన్.

దీనిని నేను పూరించిన విధానం పంచుకుందామని ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా వ్యాసుని గూర్చి చదువుదామని ఆంధ్రభారతి నిఘంటువు తెరిచి చూస్తే ప్రస్తుత మహాయుగానికి ముందు ౨౭ మహాయుగాలలో, స్వయంభువు డాదిగా ఇరువది యేడుగురు వ్యాసులు వెలసి యున్నారని తెలిసింది.

ఆ విషయం పూరణకు నాంది పలికింది.

అబ్బా ఎంత కష్టమైన సమస్యరా  అని ఇంట్లో అందఱితో చెప్పాను. అమ్మ వెంటనే, కాశీపట్టణాన్ని శపించినవాడు వ్యాసుఁడు కదా, అది వాడి ఏదైనా పూరణ సాధించవచ్చునేమో చూడమంది. ముందుగా, కోపము లేని వ్యాసుడని లోకులు అనుకుంటారు కానీ అది నిజము కాదనే అర్థముతో పూరించవచ్చునేమో అని ఆలోచింపసాగాను.

కాసేపట్లో గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు ఇవ్వాలి. మా అమ్మాయిని వెంటవేసుకొని నడిచాను. బుఱ్ఱలో నడుస్తున్నంత సేపూ సమస్యా పూరణమును గురించే ఆలోచన.

గ్రంథాలయంలో మా అమ్మాయిని తనపుస్తకాలవద్ద వదిలి, తీరికగా కూర్చుని చరము (మొబైన ఫోను) వాడుతూ పూరణ ప్రారంభించాను. గ్రాసము మొదటి పదము, దానికి తోడుగా భిక్షకుడని చేర్చాలి. గ్రాస తో వచ్చేది కాబట్టి, ఉత్పలమాల కాబట్టీ, ఆ పదం పైన జగణము (IUI) కావాలి. నిఘంటువులో భిక్షకునికి వేఱు పదాలేవేవి ఉన్నాయో వెతకగా, సంస్కృతపదమైన వినీపకుడు తగిలింది. ఇంకే, గ్రాస వినీపకుడు వచ్చేసింది. దానికి ఎదురుదెబ్బ తగిలించాలి కాబట్టి, సంధికలిసి దీర్ఘము రావాలి కాబట్టి, అపజయ పదాన్ని పట్టుకున్నాను. ఆ తరువాత మిగతావి తేలికగానే పూరించాను.

మధ్యలో, వ్యాసమహాముని భారత రచనను మదిలో ఉంటుకొని, అఖండవాక్ప్రవాహ అనే విశేషణాన్ని కూడ సిద్ధం చేసుకొని పెట్టాను. కానీ చివరకు అది వాడనే లేదు.

భూసురు, భానుతేజ సురపూజిత దివ్యపరాశరాత్మజున్ - ఈ పాదము మొత్తమూ గ్రంథాలయానికి నడుస్తున్నప్పుడే మనోఫలకముపై వ్రాసేసుకున్నాను.

దాంతో మూడు పాదాలు తయారైనాయి. అఖండవాక్ప్రవాహ విశేషణాన్ని వాడి మఱొక పాదము తయారు చేవవచ్చు, ప్రాసాక్షరయుక్తమైన పదం దొరకడం కొంచెం కష్టమవడం వల్ల, కాస్త శ్రమతో కూడిన పని.  చెప్పదలచుకొన్నది కూడా ఇమడడం కష్టమవుతుంది, ఎందుకంటే అఖండవాక్ప్రవాహము పాదము చివరలోనే అతుకుతుంది. అంటే పాదాంతము వఱకూ ప్రస్తుతమహాయుగవ్యాసుని గూర్చియే చెప్పాలి. అదే చేస్తే నాలుగు పాదాలు పూర్తయి, ఐదవ పాదము నాశ్రయింపవలసి రావచ్చు.

ఆలోచించి ఆ మార్గాన్ని విడిచి పెట్టి, సమస్యలో ఇచ్చిన పాదాన్ని మూడవది చేసి, సులువైన తెలుగులో నాలుగవ పాదాన్ని చకచకా పూరించేసాను. వ్యాసునిలో యకారము వడి అక్షరానికి, స్వయంభువులో రెండవ అక్షరానికి యతి కుదిరి పాదరచనా సౌలభ్యం చేకూరింది.

అలా పూరణ పూర్తయ్యింది. పూర్తి పద్యమిదిగో.

ఉ. గ్రాస వినీపకాపజయ కష్టవిజృంభిత శాపశస్త్రుడౌ
భూసురుఁ భానుతేజు సురపూజిత దివ్యపరాశరాత్మజున్
వ్యాసుని వ్యాసు డందు రది భావ్యము గాదని నాకు దోచెడిన్
వ్యాసులు పల్వు రుండగ స్వయంభువు వెంట మహాయుగంబులన్

అదండీ సంగతి.