Friday, September 18, 2009

కందత్రికము

శ్రీమదాంధ్రభాగవత ప్రధమ స్కంధములోని ఈ మూడు కందాలు చూడండి - ఒకదాన్ని పోలి ఇంకోటి భలే ఉన్నాయి కదూ.

మొదటిది శౌనకాది మునులు నితాంత కురుణోపేతుడైన సూతుణ్ణి పురాణపంక్తు లితిహాస శ్రేణులు ధర్మశాస్త్రముల సూక్ష్మాలని తెలుపమని ప్రస్తుతించడము

మన్నాఁడవు చిరకాలము,
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి,
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్

రెండవది, శ్రీకృష్ణ పరమాత్ముడు కురుయుధ్ధానంతరము తన ప్రియపురంబైన ద్వారకానగరానికి చేరినంతనే జనులు భగవత్పాదాబ్జములను బ్రహ్మపూజ్యములుగా భావించి పూజించిన పిదప పలికిన పలుకులు

ఉన్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్
మన్నారము ధనికులమై
కన్నారము తావ కాంఘ్రికమలములు హరీ

మూడవది తీర్థయాత్రలకు వెళ్ళి మైత్రేయాదులను కలిసి కర్మయోగ సూక్ష్మాలు తెలుసుకొని, హస్తినకు తిరిగి వచ్చిన విదురుణ్ణి ధర్మరాజు కుశలప్రశ్నలు వేస్తున్న సందర్భము.

మన్నారా, ద్వారకలో
నున్నారా యదువు లంబుజోదరు కరుణన్
గన్నారా లోకులచే
విన్నారా మీరు వారి విధమెట్టిదియో

Monday, September 14, 2009

అమెరికాలో చిదంబరం

మన చిదంబరం పాపం అమెరికాలో ఒళ్ళూ పై (మై పై అనవచ్చా?) తెలియని ఉద్వేగానికి లోనైయ్యాడు. కేంద్ర ప్రభుత్వం పంపిన గూఢచర్య నివేదికలని రాష్ట్రాలు ఖాతరు చెయ్యకూడ దంటాడేమిటి, వీడి బొంద? ఈ విషయమై ఓ వ్యావహారికోత్పలమాల, కందము అందుకోండి.

సెంటరు వాళ్ళు చచ్చిచెడి సీక్రెటు టెర్రరుసెల్సు గూర్చి రా
ఇంటలిజెన్సు డాసియరు లెందుకు స్టేటుకి పంపడం? యమ
ర్జంటుగ దాన్ని నమ్మి తగు చర్యలు ఠక్కున తీసుకొంటె, చి
న్మెంటలు* డంతలో తెలివి మీఱి అబధ్ధములేల వాగడం?

పంపినది తప్పు కాదా?
పంపిన దాన్ననుసరించి పగవాళ్ళని పై
కంపితె న్యాయం కాదా?
దుంపతెగ ఇదేమి వింత దొబ్బుడు? ఛీఛీ!!


చిత్ + mental = చిన్మెంటలు

Sunday, September 13, 2009

సీసము

ఫ్యూచర్లు ఫార్వళ్ళ వ్యూహరచన లాప్ష
నులు కమోడిటి లోటిసిలను పట్టి
స్వాప్షన్లు, కూపన్లు, కాప్షన్ల కొనుగోళ్ళు
వరిసోయ వణిజుల వర్తకముల
డెరివేటివులు పట్టి దరినున్న విత్తపు
రిస్కుల పట్టి, ప్రైస్డిస్కవరిల
పట్టి, తెగిడి కుస్తి పట్టిన తరుణాన
వేడెక్కి పోయింది మాడు మాడి

దెబ్బతిన్నబుఱ్ఱ, దీని దుంప తెగ, పా
త స్థితిగతులను బడి సుస్థిమిత మతిగ
కావడానికున్న త్రోవ యొకటె, హిట్ద
బాటిలందురట్టి పధ్ధతిని జనులు

==

డెరివేటివ్సు గురించి కూలంకషంగా చదువుతున్న నాకు బ్రేకు తీసుకోవాలనిపించి, 'కుప్పెతాడన' మెలాగూ అలవాటు లేదు కాబట్టి, (సీసా పట్టలేను కాబట్టి) సీసంతో సరిపెట్టుకున్నాను.

కుప్పె: glass bottle

Saturday, September 12, 2009

మద్భావజాలావిష్కృతి

శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్

శ్రీమదాంధ్రభాగవతములో ఆది మఱియు ఆవర్తనీయమైన పద్యముతో నా కొత్త గూటికి శుభారంభము

చేస్తున్నాను.

ఈ గూటిన నాకు నచ్చిన పద్యగద్యాలు, పుస్తకాలు, నా అనుభవాలు వాటికి నా ప్రతిస్పందనలు - ఒహటేమిటి - మనసుకి నచ్చినది ఆవిషృతము చేయడానికి పూనుకుంటున్నాను.