Wednesday, December 28, 2011

ఇటీవల కొన్నవి

ఖరసంవత్సర కార్తికకృష్ణపక్ష మార్గశిరశుక్లపక్షములలో భాగ్యనగరము తిరుపతియు చుట్టివచ్చినప్పుడు నేను కొన్న పుస్తకాల, శ్రవ్యకాల చిట్టా ఇదిగో.

------

౧. నాంపల్లిలోని తెలుగువిశ్వవిద్యాలయం వారి పుస్తకవిక్రయవిభాగంలో కొన్నవి
- నన్నయ్యభారతి మూడవ సంపుటి. నన్నయ శైలి, భారత కృతిపతిత్వం మున్నగు అంశాలపై ఇరవైకి పైగా వ్యాసాలున్న పుస్తకం. అధికశాతం భారతిలో అచ్చైనవని తెలుస్తోంది. పుస్తకం చదవడం పూర్తయ్యింది. సాహిత్యాభిమానులందఱు చదువవలసిన సంపుటిగా తోచింది. మళ్ళీ వచ్చినప్పుడు మొదటి రెండు పుస్తకాలు దొరకబుచ్చుకోవాలి
- ఆంధ్రమహాభారత పీఠికలు. తెలుగువిశ్వవిద్యాలయం వారు ప్రచురించిన మహాభారతపర్వాలకు పలువురు పండితులు పీఠికలు వ్రాసారు. ఆది పర్వానికి విశ్వనాథవారు వ్రాసిన పీఠిక - అదొక్కటి చాలు పుస్తకం కొనుక్కోవడానికి. సభాపర్వం పీఠిక దివాకర్లవేంకటావధాని గారిది. విశ్వనాథవారి వ్యాసం చదివాక అది అంతగా రుచించలేదు, కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఎత్తుకోవాలి.

- మనువసుప్రకాశిక. విమర్శాగ్రేసరులు కాశీభట్ల బ్రహ్మయ్యగారి పుస్తకము. విమర్శ ప్రతివిమర్శ పరంపరగా నాలుగుదీర్ఘవ్యాసాలు వెలువడ్డాయని, అందులో ఈ పుస్తకము రెండవదిని పీఠిక చదివితే తెలిసింది. విమర్శ వ్రాయడము నేర్వాలంటే కాశీభట్లవారి వ్యాసము చదివితీరవలసిందే.

౨. తిరుమల తిరుపతి దేవస్థానము వారి పుస్తకవిక్రయశాలలో

- చిలకమర్తిగారి అవిమారక మను నాటకము, భారతకథామంజరి, కృపాంభోనిధి యను భగవత్ స్తుతిశతకము, మూలముతో కూడిన భల్లటశతకము. సన్న పుస్తకాలు, నాలుగు కలిపి రెండువందల పుటలు మించవేమో.

- సప్తపది అను వైదికవివాహసంస్కారమును విశదీకరించు కరదీపిక, రఘునాథాచార్యకృతము.

- అన్నమయ్యపదసౌరభము, ప్రథమ, ద్వితీయ, చతుర్థభాగాలు. నేదునూరి కృష్ణమూర్తిగారు తా కూర్చిన అన్నమయ్యకీర్తనలు స్వరతాత్పర్యసహితములుగా ప్రకటించినారు. తృతీయభాగము దొరుకలేదు.

- వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా ఆయన కుమారుడు పూర్తిచేసిన పూలవిందు అనబడే పుస్తకము.

(ఇవి కాక షట్శతసంకీర్తన వైజయంతి అను శ్రవ్యకమాల యొకటి. ౬౦౦ల కృతులు వినడానికి సయమం పడుతుంది, విన్నంత మేరకు ఉద్దండులైన గాయికాగాయకుల గాత్రాలే వినబడ్డాయి )

౩. వావిళ్ళ వారి వద్దకొన్నవి

- శ్రీజయదేవకృత గీతగోవిందకావ్యము. ఆంధ్రటీకాతాత్పర్యసహితము. ఇరువదినాలుగు అష్టపదులు కల కావ్యము.

- శ్రీకాళిదాసకృత కుమారసంభవము. ఆంధ్రటీకాతాత్పర్యసహితము. చక్కటి అచ్చుతో చూడముచ్చటగా నున్న పుస్తకము.

ఇవి కాక చిన్న, బుల్లి పాతపుస్తకాలు పదిదాక దొరికాయి. ఒక్కొకటి పదిరూపాయలకు మించని వెల.

౧. నన్నిచోడుని వస్తుకవిత - తుమ్మలపల్లిరామలింగేశ్వరరావుగా
రి రచించినది
౨. అక్కనమాదన్నల చరిత్ర - వేదుల వేంకటరాయశాస్త్రి గారు వ్రాసి ప్రచురించినది. రెండవసారి చదువవలెననిపించు రీతిగా తీర్చిదిద్దబడినది. ౧౯౫౧లో తెలుగుభాషాసమితివారి బహుమతి పొందిన పుస్తకము.
౩. నీలాసుందరీపరిణయము. కూచిమంచి తిమ్మకవిప్రణీతము.
౪. రాజయోగసారము. తరిగొండవెంకమాంబకృత ద్విపదకావ్యము.
౫. ధనాభిరామము. నూతనకవిబిరుదాంకిత సూరనకవికృతకావ్యము.
౬. రామరాజీయము. గుస్తావ్ ఓపర్టను వానిచే కూర్పబడినది. వెంకయ్యగారు రచించినది. కవివివరాలు తెలియడంలేదు.
౭. ధర్మనిర్ణయం. తుమ్మలపల్లిరామలింగేశ్వరావుగారి నవల
౮. మనోహరి అను సాంఘికనవల, రచయిత బరంపురం ప్లీడరుగారని గుర్తున్నది, పేరు స్ఫురించుటలేదు. పుస్తకము భాగ్యనగరంలో వదిలి వచ్చాను.
౯. రేచుక్క పగటిచుక్కకథ
౧౦. మైరావణ చరితము

చవరి రెండు ఇరవైపుటలు మించని పుస్తికలు. అక్కథ లాంధ్రదేశములో బహూళప్రచారములో ఉండడమూ, పలుప్రతులు తప్పులతడకలై ఉండడమూ చూసి, వావిళ్ళవారు సంస్కరించిన ప్రతులు ప్రకటించారు. చదవదగ్గ పుస్తకాలు.

ఇవికాక, ఆంధ్రభారతం అరణ్యపర్వం (వావిళ్ళవారిది) దారిప్రక్కన దొరికితే కొన్నాను. సింగపూరులో ఒక ప్రతి ఎలాగూ ఉన్నది, అందువల్ల భాగ్యనగరములోని వదిలి వచ్చాను.

Friday, November 11, 2011

భారతావతరణము - ౨

చిన్న లెక్క. విప్పగలరేమో చూడండి. పద్యం అర్థమైతే లెక్కతేల్చడం క్షణంలోపని, చూడండి.
చినమల్లనగారు గణితసారసంగ్రహమను పుస్తకము వ్రాయబూనుట, వేములవాడ భీమనను అప్పుడప్పుడు ఛందోవిషయములను గూర్చి ప్రశ్నించుట - ఇది పూర్వరంగము.

చెలికి షడంశమున్ ప్రియకు శేషములోపల పంచమాంశమున్
బొలుపుగ దానిశేషమున బోదకు నాల్గవపాలు నిచ్చి యం
దుల తనపాలు దాఁగొనియె తొమ్మిది జేనలు రాజహంస మీ
నలినమృణాళ మెంత సుజనస్తుత, మా కెఱగంగఁ జెప్పుమా

(జేన అంటే జాన. పతంగులకి దారం కట్టండానికి వాడే కొలమానం గుర్తుతెచ్చుకోండి చాలు)

ఇంతకీ నలినమృణాళము (తామరతూడు) పొడవెంత.

Wednesday, November 9, 2011

భారతావతరణము - ౧

క్రితంవారం భాగ్యనగరానికి వచ్చినప్పుడు బాలాజీభవనములో క్రొత్తగా తెరిచిన పుస్తకశాలను దర్శించాను. దివాకర్లవేంకటావధానిగారి భారతావతరణమనే చిఱుపుస్తకాన్ని కొన్నాను.

నన్నయ్యగారికి భారతాన్ని ఆంధ్రీకరించాలనే ప్రేరణ ఎలాగు కలిగిందో చెప్పే ౨౫పుటల బుల్లిపొత్తమది.

విశేషమేమిటంటే ఇందులో నన్నయభట్టుగారు, నారాయణభట్టుగారు, క్షేమేంద్రుడు, వేములవాడ భీమన మొదలగువారు ఒక్కసభలో చేరియున్న సందర్భాన్ని వేంకటావధానిగారు సృష్టించారు.

పుస్తకం ఆసాంతం చదువలేదు కానీ మొదటి పద్యాలు తమాషాగా తోచినాయి.

ఉదా. రూపకములో నన్నయ్యగారు చెప్పినది

రాజకళావిభూషణుఁడు రాజమనోహరు న్యరాజతే
జోజయశాలి శౌర్యుని విశుధ్ధయశశ్శరదిందుచంద్రికా
రాజిత సర్వలో నపరాజితభూరిభుజాకృపాణ ధా
రాజల శాంతశాత్రవపరాగుని, రాజరాజనరేంద్రుఁ బ్రోచుతన్

వేములవాడభీమన చెప్పినది

శ్రీమదుమామహేశు లతిచిత్రవిలాసులు దారు మున్ వియో
గామిత చింతనొండొరులకై సగమౌటలు నిచ్చఁ దెల్పు కాం
క్షా మహిమంబుచే చెరిసగంబుగ నొక్క యొడల్ ధరించు స
త్ర్పేమపు దంపతుల్ సదయదృష్టుల రాజరాజనరేంద్రుఁబ్రోచుతన్

కథలో వేములవాడభీమన చెప్పినది ఆరవ పద్యము - నిజానికి అది చదివేదాకా వేంకటావధానిగారు ప్రసిధ్ధమైన పద్యాలను తీసుకొని ఇంచుక మార్చినట్టు స్ఫురించలేదు. సౌలభ్యంకోసం ఆయా మార్పులను రంగద్ది చూపాను.

ఇక మీకొక చిన్న ప్రశ్న. శ్రీమదుమామహేశుల పద్యము ఏ కావ్యములోనిది, కవి ఎవఱు.

Tuesday, October 18, 2011

శరశరసమరైకశూర - SaraSarasamaraika Soora

కుంతలవరాళి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి కూర్చిన కృతి శరశరసమరైక శూర.

పల్లవి - శర శర సమరైక శూర,| శరధిమదవిదార
అనుపల్లవి - సురరిపుబల మను తూల|గిరుల కనల సమమౌ శ్రీరామ
చరణము - తొలిజేసిన పాపవనకుఠార, మా|కలనైన సేయగలేని
బలువిలును విఱిచి వెలసిన శ్రీరఘు|కులవర బ్రోవుము, త్యాగరాజనుత

తాత్పర్యం ఇది..

పల్లవి - (కాకాసుర సంహారంలో) దర్భను బాణంగా వాడిన అసదృశ శూర, (వారధి నిర్మాణానికి ముందు) సముద్రుని మదాన్ని అణచిన వీరా, శ్రీరామా

అనుపల్లవి - రాక్షసుల బలము అగ్నివంటి నీ ముందు దూదికొండ వంటిది

చరణము - నీవు మా పాపములనబడే వనమును తెగనరికే గొడ్డలివంటి వాడివి, మా వంటివారెవఱూ సాహసింపజాలని గొప్పవిల్లును విఱిచిన రఘువంశోత్తమా, త్యాగరాజుచే నుతింపబడిన శ్రీరామా.

ఇందులో గమనించవలసిన విషయమొకటి ఉన్నది. చరణములో మొదటి పంక్తిని సాధారణంగా గాయకులు తొలిచేసిన పాపవన కుఠారమా అని పాడడం కద్దు. ఇది తప్పు.

మొదటి కారణం ప్రియమిత్రుడు రాఘవుడు చెప్పింది.
మా ను పూర్వపదంలో ఎందుకు కలపకూడదంటే, సంబోధన రఘుకులవర, శరశర, సమరైకశూర... ఇలాగే ఉంది కనుక. కుఠార అనే తీసుకోవాలి తప్పితే కుఠారమా అని తీసుకోకూడదు. కుఠారమా అనటం వల్ల ఇంకొక దోషమేమిటంటే పుంరూపానికి నపుంసకత్వం ఆపాదిస్తున్నట్టు.

రెండవ కారణమేమిటంటే, తప్పుడు విఱుపు చేసి కుఠారమా అని పాడితే తరువాత పంక్తి అసంపూర్ణంగా ఉంటుంది. ఏది ఏమైనా కుంతలవరాళిలో వినడానికి సొంపుగా, దరువులు వేస్తూ పాడకోవడానికి ఇంపుగా ఉండే కృతి ఇది.

==

(raagam: kuntalavaraali, taaLam: aadi)

pallavi - Sara Sara samaraikaSoora,| Saradhimadavidaara
anupallavi - suraripubala manu toola|girula kanala samamau Sree Rama
caraNam - tolijEsina paapavanakuThaara, maa|kalanaina sEyagalEni
baluvilunu virici velasina Sree Raghu|kulavara brOvumu, tyaagaraajanuta

1) Sara Sara samaraikaSoora,| Saradhimadavidaara

Sara - blade of grass (darbha)

Sara - arrow

samaraikasoora - warrior nonpareil

saradhimadavidaara - destroyer of samudra's pride/arrogance

Meaning: Rama, the destroyer of samudra's arrogance, you're like no other warrior the world knows. No other warrior can use a blade of grass as an arrow.

2) suraripubala manu toola|girula kanala samamau Sree Rama

i) sura-ripu-balamu + anu = sura-ripu-bala manu.

sura are gods

ripu is an enemy, so a suraripu is a raakshasa.

balamu is strength, anu is named

ii) toola-girulaku + anala = toola-girula-kanala (ukaarasandhi! ఉకారసంధి)

toola is cotton

girulu are mountains. girulaku is 'for mountains'

anala is fire

samamau is equivalence

Meaning: If the strength of demons is a mountain, when faced by your ferocious valor that is akin to fiery fire , it is like a cotton mountain.

3) tolijEsina paapavanakuThaara

toli is previously

cEsina is done

paapavana is sins comparable to a forest

kuThaara is an axe. A point to note is that kuThaara here is not a word by itself but relies on the earlier phrase 'paapavana'.

Meaning: If our sins were a forest, you'd be a hatchet. (Note: After kuThaara there should be small pause or break, it should not be sung as kuThaaramaa. As my dear friend Raaghava pointed out to me, that would be equivalent to choosing neutral gender similie for masculine gender. Secondly, it also leaves the next sentence in the song incomplete.)

4) maa|kalanaina sEyagalEni,
baluvilunu virici velasina Sree Raghu|kulavara brOvumu

maa kalanaina is even in our dreams

sEyagalEni is impossible

balu+vilunu is a huge bow (whcih is Siva-dhanussu)

virici is break

velasina is born

Sree Raghu+kula+vara is the exemplary one in Raghu's lineage

Meaning: Rama, the finest in Raghu's vamsa, you did something mere mortals cannot even begin to dream doing, you broke Siva's famed bow.

This kRti as with many others composed by The Great Saint has the familiar word play. A few to note are

1) Usage of Sara twice in the first line with different connotations

2) Usage of praasa - matching consonants in a pair of lines

SaraSara and Saradhi in the first line

suraripu and girulaku in the second line

toli and kala in the first line of caraNam

bala and kula in the second line of caraNam

Above all, this is a great kRti that pulls the listener into its inherent rhythm right from the start.



Saturday, October 15, 2011

Nightie, Nightgown

క. నక్తీ రేపావడ రే
నక్తకము శయనదుకూల నక్తాంబరముల్
యుక్తప్రయోగమం దుప
యుక్త పదములు నయిటియను హూణనుడుగుకున్

నక్తీ, రేపావడ (రాతిరి ధరియించనగు పావడ), రేనక్తకము (రాతిరి ధరియించనగు వస్త్రము), శయనదుకూలము (నిదురించునపుడు ధరియించనగు వస్త్రము), నక్తాంబరము (రాతిరి ధరియించనగు వస్త్రము) ఇత్యాదులు నైటి యను ఆంగ్ల నుడువునకు సరిపోవునట్లు ఉపయోగించవచ్చును.

Eraser

క. చెఱిపెన తుడిపెన లిఖితా
క్షరక్షరము స్ఖలితహరము సంస్కృతిసాయం
కరమని రబ్బరని చెలగు
ఎరేజరును తెలుగున తగ నెఱుగదగు నిలన్

రబ్బరని కూడా అనబడు ఎ(ఇ)రేజరుని చెఱిపెన, తుడిపెన, లిఖితాక్షరక్షరము (వ్రాసిన అక్షరములను చెఱపివేసేది), స్ఖలితహరము (తప్పులను తుడిపివేసేది), సంస్కృతిసాయంకరము (లిఖిత వస్తువున సవరించుటలో సహాయపడునది) అని తెలుగున తెలియజేయవచ్చు.

Install

క. ఇరవుగొలుపు స్థాపింపును

స్థిరపఱపును తిరముజేయు తిరమిడు యంత్రాం

తరపు జొనుపంచును వ్యవ

హరింప చెల్లును తెలుగున నాంగ్లేస్టాలున్

ఇరవుగొలుపు (ఇరవుగొల్పు), స్థాపింపు (స్థాపించు), స్థిరపఱచు, తిరముజేయు, తిరమిడు, యంత్రాంతరపుజొనుపు (యంత్రాంతరాళపు జొనుపు) అని ఇన్స్టాలను ఆంగ్లపదమును తెలుగున వ్యవహరించ వచ్చు. ఇక్కడ అంగ్ల, ఇన్ట్సాల్ పదాలకు గుణసంధి కుదుర్చుట యుక్తమని అనిపించినది :-)

Penthouse

తే. పంచపాళి తాళ్వారము మించు యంక
ణంబు సింహాకణంబును నయముగ సరి
పోవు నున్నతంతస్తుల ఠీవియిండ్ల
కున్ వెలయి పెంటుహౌజులకున్ తెలుగున

పంచపాళి, తాళ్వారము, మించంకణము (మించు అంకణము), సింహాకణము , ఉన్నతంతస్తు ఇల్లు (లేక ఉత్కృష్టాంకణము) ఇత్యాదులు పెంట్ హౌజునకు తెలుగుపదములై సరిపోవును.

Office, workplace

క. పనితా వని కొలు వని కా
ర్యనిలయము కచేరి యనియు నరయగ బత్తెం
పునెల వని జీతతానమ
ని నుడువ నాఫీసు జెల్లు నిక్కము తెనుగున్

పనితావు, కొలువు, కార్యనిలయము (కార్యాలయము), కచేరి (కచ్చేరి - సంగీతపరమైన మఱొక అర్థముకూడా ఉన్నది), బత్తెంపునెలవు (భత్యము, బత్తెము దొరకు నెలవు), జీతతానము (జీతమిచ్చు చోటు) ఇత్యాదులుగా ఆఫీసును (వర్కప్లేసును) తెలుగున చెప్పిన చెల్లును.

Biscuits and Chocolates

క. బిక్కీలని బిస్కెటులను
చిక్కీలని చాక్లెటులను సీమయు కోకో
చక్కెర పాకంబనియున్
చక్కగ నుడువంగ నొప్పు చక్కని తెనుగున్

క. బీక్కీలని బిస్కతులని
చక్కెరచెక్కలును తీపిచక్కిలము లనీ
చెక్కలని పిండితీ పని
చక్కగ నుడువంగ నొప్పు చక్కని తెనుగున్


బిస్కెటులను బిక్కీలని (చిక్కీని పోలిన ఆంగ్లసమము), చక్కెరచెక్కలు, తీపిచెక్కలు, తీపిచక్కిలాలు, పిండితీపులు అని పిలువవచ్చు.

చాక్లెటును చిక్కీ, సీమపాకము, కోకోపాకము, చక్కెరపాకము అని పిలవవచ్చు. (చిక్కీ ఈపాటికే మన నోళ్ళలో నాని యున్నది కాబట్టి పదపరిధిని కాస్త విస్తరించి తీయగా చాక్లెటులకు కూడా వాడుకోవచ్చు.)

Escalator

క. మరయును జంత్రఁపు మెట్టులు
చరసోపానములు కదులు చక్కెక్కుడులున్
దొర లేటవంపు టెత్తెన
లెఱుఁగజను పరిపరివిధము లెస్కలెటరమున్

మరమెట్లు, జంత్రపు మెట్లు (యంత్రపు మెట్లు), చరసోపానములు, కదులు చక్కెక్కుడులు (లేక కదులెక్కుడులు), దొరలు యేటవాలు ఎత్తెన - ఇలా ఎన్నో విధాలుగా ఎక్కలేటరును గుర్తుపట్టవచ్చు.

నాయికా నాయకులు

In our poetic tradition, the following types of heroine were identified

Three types (trividha naayika)
1) swakeeya (స్వకీయ): one's own
2) parakeeya (పరకీయ): someone else's
3) saadhaaraNa (సాధారణ): ordinary

and then there are further eight types (ashTavidha naayika)
1) swaadheenapatika (స్వాధీనపతిక): one whose husband is subservient to her
2) vaasakasajjika (వాసకసజ్జిక): one who is awaiting her lover, and so has decorated the bedroom and also also herself
3) virahothkanThita (విరహోత్కంఠిత): one who is eagerly waiting for her lover (with viraham)
4) vipralabdha (విప్రలబ్ధ): one who cannot find her lover at the agreed spot and feels cheated and very sad
5) khandita (ఖండిత): one who is angry finding out that her lover has visited another lady before he came to her
6) kalahaantarita (కలహాంతరిత): one who has left her lover in a fit of anger, but is pining for him now
7) proshitabhartruka (ప్రోషితభర్తృక): one whose lover is away in distant countries
8) abhisaarika (అభిసారిక): one who is going to an assigned meeting spot for her lover. Abhisaarika reminds me of vasantasena walking in heavy rain towards a garden to meet chaarudatta in mrichchakaTika

Then there are 4 types of Saadharana (ordinary) Nayakaas

1) dheerodaatta (ధీరోదాత్తుడు): Rama
2) dheerodhdhata (ధీరోధ్ధతుడు): example is Bheema from Mahabharatha
3) dheeralalita (ధీరలలితుఁడు): udayana from swapnavaasavadattam
4) dheerasaanta (ధీరశాంతుఁడు): chaarudatta from mrichchakaTikam


There are 4 types of Sringaara Naayakaas
1) anukoola (అనుకూలుడు): you can say his wife is 'swaadheenapatika'
2) dakshina (దక్షిణ): like Lord Krishna, who takes care of many naayikaas very well
3) dRishTa (దృష్ట): a hardy person
4) SaTha (శఠ): a mediocre person

Tuesday, September 6, 2011

Sir William Jones's mistake

మ. మన పూర్వీకుల వైభవంబు ధృతి సమ్మానాస్పదంబై మహిన్
మనుటల్ గ్రంథితమయ్యె, సంస్కృత పురాణంబుల్ మహోద్దండులౌ
ఘనవిద్వాంసులనీడ తెల్సికొని తత్గాథాత్మ లక్రైస్తవం
బనికల్లల్ సృజియించినట్టి దురితుల్ పాపాత్ము లాంగ్లేయులే

(తాత్పర్యము - మన పూర్వీకులు వైభవము, ధైర్యసాహసాలు, ఆదర్శప్రాయమైన వారి జీవితగాథలు పురాణాలలో గ్రంథస్థము చేయబడ్డవి. అట్టి పురాణ రహస్యాలు గొప్పవిద్వాంసుల వద్ద నేర్చుకొని, బైబిలు కథను చిన్నబుచ్చు ఆ గాథలను ఆకళింపుచేసుకొను శక్తిలేక, పురాణములను తూలనాడి, వాటి స్థానములో వట్టి బూటకపు చరిత్రను వ్రాసిపోయిన పాపాత్ములు అంగ్లేయులు)

బైబిలుకి సరిపడేటట్టు మన పురాణాంశాలను కుదించి భారతీయ చరిత్రను గందరగోళము చేసినవారిలో ప్రప్రథముడు సర్ విలియమ్ జోన్సు. కోట వెంకటాచలము గారి పుస్తకాలు చదివితే ఆంగ్లేయుల తప్పిదాలు తెలుస్తాయి. అ తప్పలు తెలుసుకోవలసిన అవసరము ప్రతి భారతీయునికీ ఉన్నది.

Monday, September 5, 2011

Andriod OS

ఉ. బాగుగ బాగుబాగని సెబాసని మెచ్చుచు దేవులాటకున్
వేగుకు సాంఘికాల్లికకు వెఱ్ఱిగ వాడిన భారతీయులన్
యే గతిలేని వారలని యెంచినదా వ్యతిరేకరూపమై
గూగులు భారతీఖతుల కూర్పక యాండ్రయిడోయసందునన్

నిన్ననే యాండ్రాయిడులో భారతీయ ఖతులకు సహకారము లేదని తెలిసింది. ఈ విషయంలో ఆపిలువాడిది పైచేయే, ఐఓఎస్ లో తెలుగు అక్షరాలు ఎంత ముద్దుగా కనిపిస్తాయో..

Saturday, September 3, 2011

చరిత్రోత్సాహకులకు కరదీపిక

భారతీయ ఇతిహాసమును గూర్చి తెలుసుకోవలెనన్న జిజ్ఞాస కలిగిన ప్రతియొక్కరూ ముందుగ చదువవలసిన పొత్తములు కోట వెంకటా చలము గారివి.

తే. పలు పురాణములు మథించి భారతీయ
కలిశక నృపతులచరితము లిఖియించి
మన్ననలు బడసిన తెలుగన్న కోట
వేంకటాచలుని నుతింతు వేయినోళ్ళ

http://www.scribd.com/doc/63837079/The-Plot-in-Indian-Chronology

Monday, August 15, 2011

అమ్మ చేతి మిఠాయి

ఉ. డస్సిన దేవతల్ తొలుత ఠావులు దప్పిన వారలయ్యు తే
జస్సు సుధారసంబులు రసాగ్రము లంటిన పొందినట్లు నే
నుస్సురుమంచు కొల్వు డిగి ఓపికలేమిడివాఁడి యుండ తా
లెస్సగ పెట్టె నమ్మ చిగిరించితి మైసురుపాకు ముక్కకున్

Sunday, July 17, 2011

అధికారి కోపము

ఉ. నాయకు డప్పుడప్పుడు తనంతట తానుగ రోషతాపకో
పాయుతుడై గుదగ్గిలు టపాసయి ప్రేలుటజూచినంత నథ
స్స్థాయులు దిద్దుకొందు రతితత్తరపాటున వర్తనంబులన్
చేయని తప్పులందఱికి చేసినవట్టులదోచు భీతితోన్

నాయకుడప్పుడప్పుడు - అధికారములోన ఉన్నవాడు కొన్నివేళలలో,
a leader at times

తనంతట తానుగ - ఏ కారణములేక,
for no reason and on his own volition
రోషతాపకోప + అయుతుడై - చిరాకు వేడిమి వల్ల జనించే కోపముతో,
gets angry and irritated
గుదగ్గిలు టపాసయి - ముడ్డిక్రింద అగ్గిరగిలిన టపాకాయలాగ,
like a bomb with its fuse lit on the backside
ప్రేలుటజూచినంత - పేలడం చూచిన తోడనే,
seeing him shout (literally, blasting out)
అథః +స్థాయులు - అతని క్రింద పనిచేసే వాళ్ళు (క్రింది స్థానాలలో ఉండే వాళ్ళు),
the subordinates
దిద్దుకొందురు - సరి చేసుకుంటారు,
rectify
అతితత్తరపాటుల - తికమకపడుచూ,
in confusion
వర్తనంబులన్ - తమ ప్రవర్తనను,
their behavior
చేయని తప్పులందఱికి - తాము చేయని తప్పులు కూడా అందఱికీ,
the mistakes uncommitted by any and all
చేసినవట్టుల - చేసామేమో అనే అనుమానము,
seem like committed to each
తోచు భీతితోన్ - కలిగించే భయము వలన,
due to fear

A leader who is inexplicably angry and blasts his subordinates, will see them rectify their behavior in confusion as they fearfully search for faults in their own conduct.
(Thanks to author Tom Wolfe)

Friday, July 15, 2011

హారీ పోటరు గురితప్పింది

తే. పోట రభిమాని గాను నే పూర్వమెపుడు
కాని కడపొత్తమున స్నేపుకథకు కన్ను
చెమఱె నట్టి బాధ జనియింపమి చరమపు
చిత్రము గురితప్పినదని చెప్పదగును


Never been a Potter fan, but Snape's story in the last installment got me. The final movie fails on that count, so I count it a failure.

Sunday, July 10, 2011

నగుమోము గనలేని - nagumOmu ganalEni

nagumOmu ganalEni is an immensely popular kRti composed by SrI tyAgarAja swami in abheri rAgam beseeching his beloved Rama to show his smiling countenance.


He sings thus;

O Raghuvara Sri Rama, can you not save me from my pitiable state of not having seen your smiling countenance?


O The One that lifted govarthanagiri, do not your near and dear ones tell you the right thing to do? Even if they do not – can you not save me from my pitiable state of not having seen your smiling countenance?


Did garutmanta not make haste after hearing your command? Or did he say that the skies are too far away from the earth? O lord of the worlds, if you forsake me who can I turn to? I cannot bear the thought that you are vexed with me; can you not save me from my pitiable state of not having seen your smiling countenance?


In his kRtis Tyagaraja uses epithets of Lord Vishnu for Rama. That explains why he calls Rama, naga-rAja-dhara, an epithet Lord Krishna earned after lifting govarthanagiri. Here he also employs another technique of asking rhetorical questions to underscore his amazement that The God has not yet shown himself.


The first one is whether his retinue, the near and dear ones do not guide him the right way. Everyone knows that the Lord does not require any help much less guidance from his family when helping his bhaktakoTi. The second one is whether garutmanta does not abide by his master’s bidding and complains that the earth is too far from the Lord’s abode. gartumanta can neither go against his master’s wishes nor can his supremely potent strength find the distance between skies and earth non-negotiable. The point in the above questions is to bring across tyagaraya’s wonderment that Lord Rama has not yet manifested himself.


The beauty of the kRti is further enhanced by the praasa employed. In Telugu prosody, antyaanupraasa (literally rhyme-at-the-end) is just one of the many ways to add beauty to verses. In this case you will notice that the second letter of the first word in each line is ‘ga’ or its variant and that adds lyrical beauty to the rendition. The words are nagu, naga, ogi, khaga, gaganamu, jagamu, vaga.


Here is the complete sahityam with meanings for the phrases that make up the kRti.


పల్లవి pallavi

నగుమోము గనలేని నా జాలి తెలిసి, నను బ్రోవగరాదా శ్రీరఘువర నీ !!నగు !!
nagumOmu ganalEni naa jaali telisI, nanu brOvagaraadaa SrIraghuvara nI !!nagu!!


మొదటి చరణము - charaNam 1

నగరాజధర నీదు వరివారులెల్ల,
nagarAjadhara nIdu parivArulella


ఒగి బోధన జేసే వారలు గారే అటులుండుదురేని !!నగు !!
ogi bOdhana jEsE vAralu gArE aTuluMDudurEni !!nagu!!


రెండవ చరణము - charaNam 2

ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో
khagarAju nIyaanati vinivEga canalEdO


గగనానికి ఇలకు బహుదూరం బనినాడో
gaganAniki ilaku bahudUrambaninADO


జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు

jagamElE paramAtma evaritO moraliDudu


వగజూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ !!నగు !!

vagajUpaku tALanu nannElukOrA tyAgarAyanuta nI !!nagu!!


pallavi

నగుమోము - nagumOmu – smiling countenance

గనలేని / కనలేని - ganalEni / kanalEni - unable to see

నా జాలి తెలిసి - nA jAli telisi - knowing my pitiable state

నను బ్రోవగరాదా - nanu brOvagarAdA - can you not save me?

శ్రీరఘువర - O, raghuvara rAmA


charaNam 1

నగరాజధర - nagarAjadhara - one who has lifted the king of mountains (govarthanagiri)

నీదు వరివారులెల్ల - nIdu parivArulella - your near and dear ones
ఒగి - ogi - duly

బోధన జేసే వారలు గారే - bOdhana cEsE vAralu gArE - don’t they tell you the right thing to do

అటులుండుదురేని - aTuluMDudurEni - even if they do not

charaNam 2

ఖగరాజు - khagarAju - lord of birds, garutmanta

నీయానతి - nI yAnati - your command

విని - vini - hearing

వేగ చనలేదో - vEga canalEdO - didn’t come speedily
గగనానికి - gaganAniki - from the sky

ఇలకు - ilaku - to the earth

బహుదూరం బనినాడో -bahudUraMbaninADO - said it is too far
జగమేలే - jagamElE - who lords over the world

పరమాత్మ - paramAtma - The supreme being

ఎవరితో మొరలిడుదు - evaritO moraliDudu - who should I complain to?
వగజూపకు - vagajUpaku - please do not be vexed with me

తాళను - tALanu - I cannot bear it

నన్నేలుకోరా - nannElukOrA - please save me

త్యాగరాజనుత - tyAgarAjanuta - The One praised by tyAgarAja




Wednesday, July 6, 2011

Google plus

అల్లిక నెలవుగ పటుతరాధిపత్య
మును నెలకొలుపుకొను నెపమున సలిపె ప
లు జతనములొగి మున్ గూగులు ఫలదంబు
గాని వేవుబజ్జార్కుటుగా, నిలుచునొ
లేదొ స్నేహవలయముల జాదుకొన్న
కూడికగ ప్రజకెదుట తానూడిపడగ

Sunday, June 26, 2011

నగుమోము గనలేని నా జాలి

తే. త్యాగరాయకృతాభేరి రాగకీర్త
నమును మును పల్వురాలాపనముల వింటి
తొల్లి విన్నవన్ని కుఱుచదోచె నేడు
భానుమతి ప్రతిభాపాటవంబు ముందు


Friday, June 24, 2011

అలవైకుంఠపురంబులో (శ్రవ్యకము)

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోదియగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియనఁ గుయ్యాలించి సంరంభి యై

సిరికిం జెప్పడు శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁ డభ్రకపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాద ప్రోధ్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై


Friday, May 27, 2011

గొంతెమ్మ కోర్కెలు

ఉ. సత్పురుషుండు కావలె, కుశాగ్రమతిన్ చెలువొందు విజ్ఞుడే
తత్పరిపక్వ భాతి సహితామిత భూతి గడించి, పొందు మ
చ్చిత్పరిపూర్ణ ప్రేమము విచిత్ర చమత్కృత కృత్య పూర్ణుడై,
మత్పతియై తరించు నరమాన్యుడు క్ష్మాసురుడై జనించుచో

తాత్పర్యము. నాకు మంచి స్వభావము గల మగవాడు కావలెను. పదునైన బుధ్ధిబలము గలిగి, యట్టి పరపక్వ విజ్ఙతకు తోడుగా అమితములౌ సంపదలు గడించిన వాడైయుండవలెను. చతుర సరసుడై యుండిన వాడు, ఇతరుల గౌరవమునందిన వాడు, బ్రాహ్మణుడై పుట్టిన యెడల, నా యొక్క ప్రేమకు పాత్రుడై, నా పతియై తరియించు గాక.

తే. భరతఖండంబు పరదేశవాంఛ వీడి
శీతలావరణంబుల జీరలాడి
ఘర్మకణధారలోడ్చక కష్టమూని
పచ్చపత్రము గెలిచిన వాడె వలయు


తా. భారతదేశమును వీడి శీతల ప్రదేశాలలో తన గృహము నేర్పఱచుకొని చెమట లోడ్చు టక్కరలేని కష్టముల భరించి పచ్చపత్రము (గ్రీన్కార్డు) సాధించినవాడు కావలెను.

కం. సత్యవచో తేజమునన్
సత్య హరిశ్చంద్రుని సరిసామ్యతవలయున్
నిత్య నెల జవ్వని వనుచు
ప్రత్యహమున్నను పొగడు నిబధ్ధత నందున్

తా. అనుదినము నా అందచందములను పొగడుటలో సత్యహరశ్చంద్రుని పోలిన సత్యవ్రతుడు కావలెను.

సీ. దాక్షిణ్య నాయకత్వంబున కృష్ణుడె
కావలయు నెఱసఖ్యత నెఱపుచు
నా యొక తోడనె, పాయక నాతోడు
నిలువంగ వలె నయోనిజ నిజసఖుని
వలె తలిదండ్రుల పల్కుల వమ్ముజే
సిన గాని నా యానతిని వలదన
క, నరసింహుని పోలికన్నుండియును నాత్మ
గేహమున బిడాలదేహు మాడ్కి

ఆ. నణిగి మణిగి యుండి యడుగులకు మడుగు
లొత్త వలయు నది మహత్తర మను
భావమున, నల కలజనావనుడెదురైన
వరుని జేతు వేచి వత్సరంబు.

తా. కృష్ణుని పోలిన సరసుడు, పల్కాంతలను సమముగా చూచుకొను నేర్పరితనము కలవాడయ్యు నా యెడనే ప్రేమకలిగిన వాడై యుండవలెను. సీతను వీడని రాముని వలె యుండి, తలిదండ్రుల నైన యెదిరించవచ్చుగాని నా యాన మీఱరాదు. పరజనులకు నరసింహుని వలె అగుపించవలె గాని, నా ముంగిట పిల్లివలె వ్యవహరించ వలెను. అట్టి గొప్పవా డెదురైనచో వానిని యొక సంవత్సరము వేచి చూడుమని, ఆవల పెండ్లయాడుదును.

అదండీ సంగతి.

పెళ్ళి కుమార్తెలకు నచ్చు వరు డెటువంటి వాడై యుండవలెనో కనుగొనుటకు నేటి అంతర్జాల పెళ్ళిపేరమ్మగూళ్ళు చూచిన తెలియును. అధిక సందర్భములలో పెళ్ళి కాని వారికి కళ్ళు తిరగడము, పెళ్ళైనవారికి కడుపుబ్బ నవ్వు రావడము తథ్యము. మీ కొఱకై ఒక మచ్చుతునక ఇదిగో...

(సందీప్ గారి టపా నుండి తీసుకున్నది)

(From a telugumatrimony profile:)
I want to look for a person who is really
- more than caring, affectionate, honest, disciplined, respectful
- who value for people and a responsible person.
- Not the least to mention should be settled abroad,
- have work permit
- fair and handsome
- may be willing to wait for an year so that we can get some time to discuss things
- Should be jovial, fun-loving
- love travelling, straight forward, friendly, traditional, trendy
- a perfect "man"
- belonging to VV - VAIDIKI family only.
- Note: I dont prefer to have an age gap of >3 years.

Thanks

Thursday, April 21, 2011

పరిహాసమా?

ఆదిదంపతులకు మోదంబు కలిగింప
పాదపూజజేయు పారవశ్యు
మందగమను నాగమనమును గని నగు
చందమామ గన నసహ్యమయ్యె

Wednesday, April 20, 2011

ఐక్య రాజ్య సమితి

భూమినాక్రమించి పోరుకు తెగియించు
దిష్టి కళ్ళ పొరుగు దేశములను
చెనకి గెలువవలెను స్నేహముతో గాదు
జవహరు డిది తెలియ జాల కైక్య
రాజ్య సమితి కడకు రయ్యంచు బోయెను
నోటి దనుక వచ్చి దాటిబోయె
చేతికంద వచ్చి చేజాఱి బోయె కా
శ్మీరు పురవరంబు దూరమాయె
నైక్య రాజ్య సమితి కధికార మీయగా
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె

Tuesday, April 19, 2011

సమితింజయు డసదృశ పవనగతిన్

పుంజిగొని ముందుకుంజని
భంజితులై జనె నసురుల బలగంబులు ప్రా
భంజను రౌద్రాటొప ప్ర
భంజనమున జిక్కి సాలభంజికల బలెన్
అంత,
అంజన సూనుని రాబి
ల్చెన్ జాంబవతు పురిగొని సుషేణుడు సౌమి
త్రిన్ జీవితు జేయగ మృత
సంజీవని వేగ దెచ్చు సాయము జేయన్
అపుడు,
వెన్ జూడక సాగెన్ సమి
తింజయు డసదృశ పవనగతిన్ పెకలిచె న
ద్రిన్ జడియింప నసురులన్
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్

Sunday, April 17, 2011

అసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

ఎదురుచూపుల ఆత్రము కూడా సహ్యము కానిదే..

గాత్రము రాగతాళముల,గాన విశేషమహత్తునన్ ,బృహ
న్మైత్రి ఘటిల్లు చెన్నపురమందు వసంత సభాస్థలుల్ మహ
చ్చైత్ర శోభలన్ గన, నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
శ్రోత్ర రసాయనాగమము చూడ్కుల వత్తులు నిల్వరించుటల్

Thursday, April 14, 2011

మగని మోసగించు మగువ సాధ్వి

రిత్త నెయ్యమూని ప్రేమ మభినయించి
మగని మోసగించు మగువ సాధ్వి
యౌనె తత్ప్రవర్త నానువర్తనుడైన
నరుని సత్పురుషుడనంగ జనునె

Tuesday, April 12, 2011

శ్రీ రామ నవమి

సత్యవాక్పరిపాలనన్, మనుజాళి హృత్కమలంబులన్
నిత్యనిర్మల కాంతిరేఖల నింపు సద్విలసత్కృపన్,
భృత్యుకోటి రహింపగన్ సదభీష్ట సిధ్ధులొసంగుటన్,
స్తుత్యమాన సమానులెవ్వరు సూర్యవంశ నృపోత్తమా

శ్రీ రామ నవమి మహోత్సవమున మీకు సకలశుభములు కలుగు గాక

Saturday, April 9, 2011

నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు

నరుడు: హే భగవన్, ధన్యుణ్ణి. నీ పాదసన్నిధికి చేరు వఱకు భూలోకమున నిశ్చింతగ కాలము గడుపు రహస్యమును తెలియజేయుము తండ్రీ

(దేవ దేవా చరణ సన్నిధి నను జేర్చు, వరకు పాపపంకిల భువి వాసమెట్లు)

భగవంతుడు: ఓ వ్యాయామశాల స్థాపించవోయ్ నరుడా, కావలసినంత ధనమబ్బి, చీకూ చింతా లేని బ్రతుకు నీ స్వంతమగును.

(సరవి స్థాపింప వ్యాయామశాల యొకటి, ఒదవు సౌఖ్యముల్ ధనము నీకు ధరయందు )

నరుడు: (ప్రశ్నార్థక ముఖంతో అవాక్కై) ????

భగవంతుడు: (నరుడి తెల్లముఖాన్ని తేట తెల్లము చేయడానికి తేటగీతిలో)
కలియుగ నరులు భోజ్యపూజ్యు లుదర పరి
పోషకులు స్థూల కాయత్వ మొంది కుందు
చుండ పల్ జిమ్ము లుద్భవించు మనుజాళి
నిద్ర బధ్ధకము లొసంగు నీకు సిరులు

నరుడు మర్మము తెలుసుకుని వేగిరమే జిమ్మోనరుడయ్యెను.

(జిమ్ము: gym)

Monday, April 4, 2011

ఖరనామ సంవత్సర శుభాకాంక్షలు

అడలుగొలుపు బరువు మోయునపుడు పిల్ల
వాడు నిందజెందగ తిట్ట వలసి నపుడు,
క్రొత్తవత్సర దీవెనల్ గూర్చు నపుడు,
ఖరము తెలుగుల కుపయోగకరము గనుము

ఖరనామ వత్సరము మీలో నవ్వులు నింపాలని ఆశిస్తూ, శుభాకాంక్షలు.

Friday, April 1, 2011

రాతికి నాతిపైన ననురాగము పుట్టుట నైజమే గదా

దూతగ బంపె భూసురుని దోకొనిపోవ ప్రియోక్తలేఖనం
బే తడవాటు నోపని మృగేక్షణ చేకొనరార మాధవా
భీతిలియున్నగోమలిని వేగ విదర్భ యనంగ నమ్మురా
రాతికి నాతిపైన ననురాగము పుట్టుట నైజమే గదా