Sunday, December 6, 2009

సర్వమత సమానత్వము

క్రొత్త ఢిల్లిలో రాబోయే సంవత్సరములో కామన్వెల్తు ఆటలపోటీలు జరుగనున్నాయి. అందు నిమిత్తము, ఇప్పటినుండే ప్రభుత్వాధికారులు పట్టణ శుభ్రతమీద దృష్టి సారించడం ప్రారంభించారు. వచ్చే నెల నుండి పట్టణ కూడళ్ళలో పెద్ద పటాలు గట్రా పెట్టి రోడ్లను అపరిశుభ్రంగా ఉంచే వాళ్ళని జాగురూకులను చేయడానికి ప్రయత్నిస్తారుట. దాని కోసం మూడు పాత్రలను తయారుచేసుకున్నారు కూడాను. ఒకడు థూథూ కుమారు, మరొకడు కూడా కుమారు, ఇంకొకడు సూసూ కుమారు. థూథూ బాహ్యప్రదేశాలలో నిష్ఠీవనం చేసేవాళ్ళకి (అంటే ఉమ్మే వాళ్ళకి), కూడా చెత్తవేసే వాళ్ళకి, సూసూ మూత్రవిసర్జన చేసేవాళ్ళకి ప్రాతినిధ్య పాత్రలు. వీళ్ళని అడ్డుపెట్టుకుని ఇలాంటి చెత్తపనులు చేసేవాళ్ళమీద ఇదివరలో సైరసు ఎమ్టీవీ బక్రాలో చేసిన రభస తరహాది చేసి వారిని దారికి తీసుకురావాలనేది ప్రభుత్వాధికారుల ఊహ.

ఆలోచన బానే ఉంది కానీ దీన్లో - ప్రతిరోజు మన నాయకులు గొంతులు బొంగురుపోయేలా వాగుతూ మనకు నూరిపోయాలనుకునే సర్వమత సమానత్వము లోపించిందని నాకు అనిపిస్తోంది. అందరీ పేళ్ళూ కుమారులే కాక ఎంచక్కా ఒకణ్ణి థూథూ ఖాను, మరొకడిని కూడా కుమారు, ఇంకొకడిని సూసూ సాయ్యూలు అని పిలిచుంటే -అమరక్బరాంథోనీ లాగ -ఎంత ముచ్చటగా ఉండేది చెప్పండి? ప్చ.

Friday, December 4, 2009

బడాయి

ఒకాయన: మీరు ఇంగ్లీషు బానే మాట్టాడుతారులాగుంది
మన వాడు: (భేషజం ఒలకబోస్తూ) చిరాకు వచ్చినప్పుడు ఇంట్లో షిట్ అని తఱచుగా వాడతాను
ఒకాయన: షిట్టా? అంటే ఏంటండీ?
మన వాడు: ఇంగ్లీషు వాళ్ళు చిరాకు వచ్చినప్పుడు ఇంట్లో తఱచుగా వాడే మాట