Saturday, February 8, 2014

నీ వింక నన్ బాధం బెట్టకు

కథ మొదలయ్యింది తిక్కనసోమయాజి వ్రాసిన ఉద్యోగపర్వములోని పద్యముతోనే.  దుర్యోధనుణ్ణి మాటిమాటికీ రాజ్యము సగపాలు పాండవులపాలు చేయమని ధృతరాష్టు్రడు కోరడం దానికి విసిగి దుర్యోధను డొక శార్దూలాన్ని అందుకోవడం - అదీ నేపధ్యం.  ఈ పాటికి నాకు నోటికి వచ్చేసిన ఆ పద్య మిదిగో.

శా. రాధేయుండును దుస్ససేనుఁడును బోరం బా్రపుగా పాండవ
క్రోధజ్వాలల నార్తు నొండొకడు నాకుం దోడె నీ వింక నన్
బాధం బెట్టకు వాఁడిసూదిమొన మోవంజాలి నంతైన నే
నీధాత్రీతల మీను వారలకు నా కేలింక సేగిం బడన్

నీ వింక నన్ బాధం బెట్టకు మనే మాటలు నా మనసులో నాటుకుపోయాయి. ఇంట్లో ఎవఱైనా కాస్త చిరాకు కలిగిస్తే నీవింక నన్ బాధం బెట్ట కని జవాబు చెప్పేయడం మొదలుపెట్టాను. మొదట్లో మా ఆవిడా అమ్మాయీ ఈ పోకడకు నవ్వినా, తిక్కనగారి ప్రయోగాని కున్న మహత్తు వల్ల, అల్లనల్లన వాళ్లూ ఆ మాటలు వాడడం మొదలు పెట్టేసారు.  తిక్కనగారు ఈ విధంగా మాకు చేసిన చిన్న ఉపకార మిది.  నిజంగా చిరాకుగా ఉన్నా ఆ మాట అనేసరికి కోపాలు కాస్త చల్లబడుతున్నాయి కూడాను.

ఇదీ మా ఇంటి వాడుక మాటల్లో స్థిరపడ్డ పదబంధ విశేషము.