Tuesday, April 4, 2017

శ్రీరామనవమి పద్యాలు

హేవళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి.

ఇవిగో శ్రీ రాముని గొప్పదనం తెలుపుతూ నేను వ్రాసిన పద్యాలు

సీ. ఎనలేని సంపద లొనగూడి నట్లుండి, మాయమై పోయినన్ మథనపడడు
సిరులదేవతవంటి సీతమ్మ తోడుగా నడచిన చాలని నమ్మియుండి
వేవేల రక్కసుల్ వెనువెంట నిక్కట్లు వేగాన మూగినన్ వెతలబడ డ
నంత తేజు డనుజు డంతటన్ నీడగా నిలచిన మేలని నెమ్మదించి

తే. పోరు కుద్బలుఁ గెలువంగ పూనివచ్చె
శత్రుభీకర రుద్రుండు మిత్రు డనుచు
ననిమిషాంశపు పరివార మటులయుండ
పుడమియం దాత డవతార పురషుఁ డయ్యె

మ. పరికింపన్ సిరిరూపు సీతయన, శ్రీప్రాణేశ్వరుం డాతఁడే
అరయం దమ్ము డనంత రూపుడన, నయ్యక్షాని కం డాతఁడే
చిరజీవుం డనుమయ్య రుద్రుఁడన, నా శ్రేష్ఠాత్ము నిష్ఠాతఁడే
స్థిరపూజ్యుల్ పరివారమై చనుట జేజేపట్టె ముల్లోకముల్

వివరణ

చేతికందుతుందనుకున్న రాజ్యము కైకేయి కోరికల వలన మాయమైపోయింది. అయినా కలతచెందలేదు రామయ్య. సిరులదేవత (గృహలక్ష్మి లేక శ్రీమహాలక్ష్మి) వంటి భార్య తనవద్దనుంటే అదే అన్నిసంపదలకూ సరియని సరిపెట్టుకున్నాడు. శ్రీహరికి తోడుగానుండేది సంపదలకొమ్మ లక్షీదేవియే కదా.

ఎందఱో రాక్షసులు ముట్టడించి కష్టాలపాలుజేసినా బాధపడలేదు. అనంతమైన తేజము (లేక ఆదిశేషుని వంటి తేజము అని కూడా అనుకోవచ్చు) కలిగియున్న తమ్ముడు నీడగా ఉన్నాడనే నెమ్మదితో.  శ్రీహరి ఆదమఱచి పరుండేది ఆదిశేషుని నీడులోనే కదా. 

ఇక, బలవంతుడైన వాడిని (ఉద్బలుణ్ణి) పోరులో గెలవడానికి వెనుకాడలేదు, శత్రువులను చీల్చిచెండాడే రుద్రుడు (రౌద్రరూపుడు లేక శివుని అంశము గలవాడు) తనకు మిత్రుడై ఉన్నాడని.

ఇట్టి దైవాంశసంభూతులు పరివామై ఉండడం వల్లనే ఆ మహానుభావుడు అవతారపురుషుడయినాడు.

సిరులదేవతకూ, అనంత తేజమునకు, రుద్రుండు - ఈ మూడు పద లేక పదబంధాలకు గల రెండర్థాలు తెలియజేస్తోంది తఱువాత పద్యము.  అక్షము అంటే పాము (శేషుడు).  మత్తేభపద్యములో మిగతాభాగము సులభగ్రాహ్యమనే భావిస్తున్నాను.

నమస్సులు.

Sunday, April 2, 2017

దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు

అంతర్జాలము నుండి సంగ్రహించినది.  వ్రాసినవాఱెవఱో తెలియదు.

--



ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ..
మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
క. జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
డిల తిరుపతి వేంకటశా
స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

అదీ వారి పాండిత్యం!

శ్రీ యన కోప మాతనికి శ్రీలు గడించెను కోట్లుకోట్లుగన్

ధనికొండవారి సమస్య.

సమస్యను చదువగానే శ్రీ తో ఏది జోడిస్తే ధనవంతులకు నచ్చినిది వస్తుందా అని ఆలోచించగా, ఎక్కువగా సమయం పట్టలేదు మహాకవి శ్రీశ్రీ పేరు తట్టడానికి.

ఇంకేమి, మిగతాదంతా శ్రీశ్రీగారి భావాలను కాస్త వడకట్టి వ్రాసేస్తే సరిపోతుంది కదా.

అదే చేసాను ఈ పూరణలో, చూడండి. భావము సులభగ్రాహ్మమే.

ఉ. సాయముజేతు మందఱికి, సంపద లున్నవి పంచిపెట్టి నీ
నా యనుభేదభావముల నమ్మక ఎల్లరు సామ్యవాదస
ద్ధ్యేయము పెంపుజేయుఁ డని తెల్పుచుపాడిన విప్లవాగ్ని శ్రీ
శ్రీ యన కోప మాతనికి శ్రీలు గడించెను కోట్లుకోట్లుగన్

దత్తపది - మూడు, ఆరు, ఏడు, పది

ముఖపుస్తక ఛందోసమూహములో ధనికొండరవిప్రసాద్ గారు ఇచ్చిన దత్తపది ఇది. మూడు, ఆరు, ఎడు, పది - ఈ పదాలను సంఖ్యాపరంగా కాకుండా వేఱే అర్థాలు వచ్చేలాగ వ్రాయాలి. పురాణేతిహాసాలు నేపధ్యంగా ఉండాలి.

ఇదిగో నా పూరణ

 సీ. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు
గండ్రగొడ్డలి పడి క్షత్రియు లారుట, వంగిన వంశము లంగలార్చు
నోడింప పదునాలు గేడులు పట్టుట, రణభూమి రావణు రాణు లేడ్చు
తిమిరము సమయింప దివినుండి దిగునట, కలిని వీడుకొలుపఁ దిలకు డొకడు

తే. మొదటి పాదమున జెలఁగు మూడు గాను
ఆపయిన పదపడి వచ్చు నారు గాను
పిదప తెలియు నేడును పదియు వరుసఁ
దరచిచూచిన హరి యవతారసంఖ్య

వివరణ ఇదిగో.

సీసపద్యములో నాలుగు పాదములు, ఒక్కో పాదానికీ రెండు భాగాలు, క్రింద నాలుగు పాదాల ఎత్తుగీతి. వ్రాసుకోవడానికీ, చెప్పడానికీ ఎంత ఉన్నా ఇన్ని పాదాలలో తప్పక పూరించవచ్చు.

నేను ఎంచుకొన్న ఇతివృత్తం - విష్ణువు యొక్క దశావతారాలలో నాలుగు అవతారాలు. నాలుగు పాదాలు, నాలుగు పదాలు, నాలుగు అవతారాలు - సరిగ్గా సరిపోతాయి.

కాస్త చమత్కారంగా ఉంటుందని సీసములో మొదటి పాదము మూడవ అవతారము, రెండవ పాదము ఆరవ అవతారము, మూడవ పాదము ఏడవ అవతారము, చివరి పాదము పదవ అవతారము చెప్పబూనాను. అదే విషయం ఎత్తుగీతిలో వివరించాను కూడా.

సీసపద్యాల పాదాలు
౧. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు

ఘనుడు, అసుర కాలము - ఘనుడెవ్వరు, అసురుడెవ్వడు, ఈ ప్రశ్నలు ఉదయించవచ్చు. ఎలాగూ పద్యము హరి అవతారాలను గూర్చి కాబట్టి, అందులోనూ బ్రహ్మ (కంజుఁడు) కు వచ్చిన కష్ణము తీర్చిన అవతారమ మేమిటో చూస్తే, వరాహావతార మని తెలుస్తుంది. ఏవైఁనా అనుమానం మిగిలి ఉంటే ఎత్తుగీతిలో మొదటి పాదము అది కూడా తీరుస్తుంది.

ఇందులో మొదటి మూడు - కాలము మూడిందనే అర్థముతో, రెండవ మూడు సంధి వల్ల వచ్చినది. కష్టము + ఊడు, కష్టమూడు.

౨. పరశురామావతారము. క్షత్రియులు, ఆరుట లో అరు ఉన్నది. ఇక్కడ ఆరు అంటే ఓడిపోవడం లేక చనిపోవడం.  వంగిన వంశములు అంగలార్చు -రెండవ ఆరు చివరన వస్తుంది. అంగలార్చు అంటే బాధపడడం.

౩. రామావతారంలో రావణుణ్ణి సంహరించడానికి పట్టింది పదునాలుగు + ఏడులు అంటే సంవత్సరాలు. మొదటి ఏడు అక్కడ. రావణుఁడు మరణించడంతో ఆయన రాణులు ఎడవడం - అక్కడ రెండవ ఏడు. పై పాదాలలో పదాలలలాగే రెండూ సంఖ్యా పరంగా రాలేదు.

౪. ఇక చివరి పాదము, (పాపాపు) చీకటిని పారద్రోలడానికి - సమయింప దివినుండి..ఇందులో పది ఉన్నది. కలిని వీడుకొలుపన్, తిలకుఁడు - కలిసి వీడుకొలుపఁ దిలకుఁడు అయ్యింది.  మఱియొక పది వచ్చింది. రెండూ మళ్లీ సంఖ్యాపరంగా రాలేదు.

ఇక మిగిలినది ఎత్తుగీతి. దావి భావము సులభగ్రాహ్యమే.

అదండీ సంగతి.

శంకరాభరణం సమస్య - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఎన్నో రోజుల తరువాత శంకరాభరణం బ్లాగు సందర్శించాను. కంది శంకరయ్యగారు ఛందోప్రక్రియలకు చేస్తున్న సేవ లనల్ప మనితరసాధ్యమూను.

ఆయన ఇచ్చిన క్రొత్త సమస్య రెండు రకాలుగా ఉన్నది,

౧. మొదటిది కందములో - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్
౨. రెండవది ఉత్పలమాలలో - నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

రెంటికీ నా పూరణలు ఇవిగో

కం. నారాయణార్చనప్రియ
శారదగానప్రియ నుతసంచారనయా
చారప్రియ కలహప్రియ
నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఉ. ఆరయ నగ్నిసాక్షిగ మను వాడిన సాక్ష్యము లెవ్వి లేకనే
జేరిరి ప్రేయసీమణులు చెంతకు నోలి హితార్థలోకసం
చారిణి భక్తిరూపిణి విశారదరాగిణి భేదనాంగనల్
నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

ముందుగా పూరణకు నేనెంచుకున్న దారి. నారదమహాముని అంటే ఆజన్మబ్రహ్మచారి అనే విషయం విదితమే. దాని వల్ల మిగిలిన దారి, ఆయనకున్న లక్షణాలను పడతులుగా చెప్పడమే. అదే చేసాను.

మొదట కందపద్యం. నారాయణార్చనప్రియ - నారదుడు నారాయణార్చకుడు కదా.
శారదగానప్రియ - సరస్వతీదేవి ప్రసాదించిన గానకళకూడా నారదమహామునికి ఉన్నది.
నుత, సంచార, నయ, ఆచార, ప్రియ - అందిరిచే పొగడబడిన లోకసంచారమనే మంటి ఆచారమూ ఆయన సొత్తు
కలహప్రియ - నారదుల గూర్చి నేటి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గుణాన్ని గురించి వేఱే చెప్పనక్కరలేదు కదా.

ఇక ఉత్పలమాల.
ఆరయ - అంటే చూడగా (ఈ పదాన్ని పూరణల్లో పూరకంగా అంటే భావార్థాలపరంగా పెద్దతేడా తీసుకవచ్చేది కాకపోయినా గణాలు యతిప్రాసలు సరిపోవడానికి వాడే పదములాగ నేను తరచూ వాడుకుంటాను)
అగ్నిసాక్షిగా మనువు ఆడిన సాక్ష్యము లేవీ లేకనే
చేరిరి ప్రేయసీ మణులు ఆయన చెంతకు
ఓలి అంటి వరుసగా, ఈ పదము కూడా ఒక రకమైన పూరక పదమే కానీ ఇక్కడ వరుసగా పేర్లు చెపుతున్నాను కాబట్టి సరిపోతుంది.
హిత, అర్థ, లోక, సంచారిణి - లోక హితార్థము సంచారము చేయడం నారదమునికి అలవాటే
భక్తిరూపిణి - నారదుడంటేనే నారాయణుని మీద భక్తి
విశారదరాగిణి - పైన చెప్పునట్టు గానకళను ఈ విధంగా చెప్పాను
భేదన, అంగన - కలహప్రియలాగానే ఇదీనూ.

ఆ విధంగా రెండు పద్యాలలోనూ నలుగురు పడతులను ఇరికించి పూరణను గట్టెక్కించాను.
 

దత్తపది - తమన్నా, త్రిష, సమంతా, కాజల్

చరచర్చలకు నెలవు వాట్సాప్ లో ఒకానొక రోజు అవధాని గారికి ఎవఱో ఇచ్చిన దత్తపది నా కంటబడింది. ఏ అవధానమో, అవధాని గారెవరో తెలియదు.

ఎలాగూ ప్రతివారమూ సమస్యలను పూరిస్తున్న అలవాటు ప్రకారము, ఇదీ తీసుకొని ఈ విధంగా పూరించాను.

తే. నేడు చూత మన్నా!  మహనీయుఁ గృష్ణు
మైత్రి షట్ రిపువుల రూపుమాపు చెలిమి
రోస మంతా సడలగ శత్రువులు చెడఁగ
పోరు కా జలజాక్షుని పొత్తు వలయుఁ

గీతపద్యాలలో నాకు తేటిగీతి పద్యాలు వ్రాయడం చాల సులువనిపిస్తుంది.

దుర్యోధనుని వ్యథ

నేడు ముఖపుస్తకపు ఛందోసమూహములో ధనికొండ రవిప్రాసద్ గారు ఇచ్చిన వర్ణనాంశము, దుర్యోధనుని వ్యథ.

ఒకవేళ కర్ణుఁడు ఏ కారణము చేతనో పరాయి పక్షమైన పాండవులను చేరినట్లు దుర్యోధనునికి తెలిసనట్లైతే ఆతడి మనోగత మేవిధముగా ఉంటుందో చిత్రీకరించాలి. స్వేచ్ఛా ఛందము.


అంశాన్ని గూర్చి ఆలోచించగానే మొట్టమొదట తట్టినది, ద్రౌపదీ వృత్తాంతము. ద్రౌపది నల్లనిదైనా ఎంతో అందమైనదని జగద్విదితమే. ఆమె మేనిరంగు కారణంగానే కృష్ణ అనే పేరును కూడా పడసినది. మొదటి పాదము కూర్పగానే, తళుక్కమని ఒక ఆలోచన మెదిలింది.

కృష్ణ శబ్దముతో నలువురి పే ర్లున్నాయి మహాభారతంలో. కృష్ణ అంటే ద్రౌపది అనే చెప్పుకున్నాం. కృష్ణభగవానుడు ఉండనే ఉన్నాడు. శరీరఛాయ వలన ఆర్జునుడు కూడా కృష్ణుడే. ఇక మహాభారత సూత్రధారి వంటివాడు వ్యాసుఁడు, ఆయన పేరు కృష్ణద్వైపాయనుఁడు. ఆయన పేరులోనూ కృష్ణ శబ్దము ఉన్నది.  వీరిలో మువ్వురు పాండవపక్షాన ఉన్నవారే. వేదవ్యాసుఁడు ధర్మము వైపు ఉన్నవా డనుకోవడంలో ఎటువంటి సందేహానికి తావులేదు.

ఇదీ నేపధ్యం. ఇక పూరణ చూడండి.

సీ. అక్కటా వగలాడి కా కృష్ణ కారవ వరుఁడైన సుఖమంచు భ్రమసినాడొ
అంగదేశము చాల కా కృష్ణు మాయలం బడి లోభనమ్ముల సడలినాడొ
అలనాటి ఆడంగి యా కృష్ణు పాశుపతాస్త్రపు కథలకు నడలినాడొ
అడవులం జీవించు నా కృష్ణు నెచ్చటో కలసి నా కెదురేగ కదలినాడొ
 

తే. కృష్ణ శబ్దమ్ములోనున్న కితవ మేమొ
నలుపు చీకట్లు వ్యాపించెఁ నాల్గు దిశలఁ
కర్ణు డావల బోయనే కష్ట మొదవెఁ
గృష్ణ వర్ణాభిధానలు కీడు సలుప


కితవము అంటే చెడ్డది
అభిధానము అంటే పేరు
ఒదవు అంటే కలుగు.

అదండీ సంగతి.