Saturday, January 4, 2014

గడచిన వారం - ౪ జనవరి ౨౦౧౪

అలోక్ నాథ్ ట్విట్టరులో కొద్దిరోజుల పాటు ఎవరికీ అంతుచిక్కని రీతిలో ప్రసిద్ధి గాంచాడు.

తే. క్షణకాలపు పేరెన్నిక నిడి మరుగు
పెట్టు మాయల లోకము ట్విట్ట  రదియ
భారతీయుల పాలిటి పసిడిగిరి య
లోక నాథు డటు లెగసె పైకి మెరయ

మరొక ప్రక్క మౌనమోహనుడిగా వినుతికెక్కిన మన ప్రధాని విలేఖరుల సమావేశాన్ని ఎర్పరిచారు.

తే. నోరులేని వాడు తుదకు నోరు తెరిచి
మంచిచెడులు వివరించి మాటలాడె
నిపుడు మెచ్చువా రెవరు లేని ప్రభువైతి
గాని వచ్చుకాలము మెచ్చుగాదె యనెను

Friday, January 3, 2014

చ. అనువుగ ప్రక్కటింటి నగ నప్పుగదెచ్చి యలంకరించె పె
ద్దన తలమానికంబగు నిదర్శనమేర్పడ తెన్గుయోషితన్
మణిమయ రత్నభూషణము నవ్విధి మేన ధరించి పెద్దనా
ర్యుని చలువన్ గడుంగడు మెఱుంగులుబొంది తెనుంగుజాణ తా
నె నగకు వన్నెతెచ్చి తని నిక్కులుపోవ గ్రహించి కన్నడిం
చెనొ పొరుగింతి పండితవిశిష్టులు కన్నడసేయ కుందెనో

దీని వెనుక కథ తెలియాలంటే, నిరుపహతి స్థలమంటూ కామేశ్వరరావుగారు వేసిన ఈ టపా చదువవలసిందే.