Thursday, October 4, 2012

సనాతన శతకము - ౨

సనాతన శతకములోని తరువాతి ఆఱు పద్యాలు ఇవిగో

శతకము

నేను వ్రాయ సంకల్పించిన సనాతన శతకము పుష్కరిణిలో ప్రచురితమవుతున్నది.

మొదటి ఆఱు పద్యాలు ఇవిగో.


Friday, April 20, 2012

ఉ. నెత్తిన సేబుపండు బడి నెట్టన న్యూటను బుఱ్ఱగోఁకి బొ
ప్పెత్తిన మాడు మాటఁ దలపెట్టక భూతలమెట్లు గుంజెఁ బం
డిత్తెర గంచుఁ బ్రశ్నిడె సహేతుకకౌతుకమొప్పుటన్ కథన్
నెత్తిన రుద్దువారలకు నీదు గురుత్వ మపోహ భాస్కరా

http://hinduawaken.wordpress.com/2012/04/16/bhaskaracharyas-law-of-gravity-vs-newtons-law-of-gravity/

Saturday, February 4, 2012

ద్రావిడభాషావర్గము

జన్యు శాస్త్రము మున్ముంద రన్యులు మన
సంస్కృతికి ముడివేసి రసంగతంబ
ని తెలుపునని తెలియని జ్ఞాని తెలిపె మన
కా యసంబధ్ధత నెపుడో యతులితముగ.

చదవండి.


==
తెలుగుపలుకుబడుల తీరుతెన్నులు - పీఠిక.

కవిసమ్రట్ విశ్వనాథసత్యనారాయణగారు వ్రాసినది.

కాల్డ్ వెల్ అనునొక పాశ్చాత్య బిషప్పు ద్రావిడ భాషా కుటుంబము, ఆ భాషల పోలికలు, వాని వ్యాకరణముల సంబంధములు" అన్న విషయమును గురించి యొక గ్రంథమును వ్రాసెను. ఏషియా మైనర్ అన్న దేశములో కొన్ని శాసనములు కనిపించుట, ఆ బిషప్పు ఆ శాసనములలోని భాషను ఆంధ్ర ద్రావిడ కర్ణాటక మలయాళ భాషల శబ్దజాలమును పోల్చిచూచి వాని వానికి మిక్కిలి సంబంధమున్నది, సంస్కృత భాషతో సంబంధము లేదు, ఇవి ద్రావిడ భాషలు సంస్కృత భాషనుండి పుట్టినవి కావు - మొదలైన విషయములు పోలికలు చూపించి గ్రంథమును వ్రాసెను.

ఈ సందర్భములో నప్పుడు మనదేశమును ఆంగ్లేయులు పరిపాలించుచుండిరి. వారిది "మానవులలో భేదమును కల్పించి పరిపాలించుము" అన్న సిద్ధాంతము. వంగదేశమును చీల్చుటతో వందేమాతర మన్న యుద్యమము బయలుదేరినది. దక్షిణాదిలో ద్రావిడ భాషలకు సంబంధము లేదన్న పెద్ద ఉద్యమమును ఆంగ్లేయ రాచరికమువారు లేవదీసిరి. మన దేశీయులకు తెలియలేదు గానీ ఇది దేశమును విభాగించు దృష్టితో చేయబడినది. అది యట్లుండగా ఈ ద్రావిడ సిద్ధాంతము మన విశ్వవిద్యాలయములు తొలుదొల్త గ్రహించి ఆచరణలో పెట్టి దానికి రూపకల్పన చేసినవి. ఈ యరువది యేండ్లుగానో మరికొంచెము తక్కవ కాలముగానో యీ సిద్ధాంతము మనదేశములో పాదుకొనిపోయినది.

కాల్డవెల్ అన్న బిషప్పు తన గ్రంథములో తనదే పరమ విశ్వసనీయమైన సిద్ధాంతమని వ్రాయలేదట. పండితులు విచారించి చూడవలయునని యాయన వ్రాసెనట. మన వాండ్రు దానిని సంపూర్ణముగా గ్రహించి నెత్తిన పెట్టుకొని యిన్ని యేండ్లుగా పాటించుచున్నారు.

ద్రావిడ శబ్దము సంస్కృతమా, తెలుగా. అరవ సోదరులు కొందఱు తమభాష వేదములకంటె ప్రాచీనమని చెప్పుదురు. రాక్షసులందఱు ద్రావిడులని, తక్కని వారార్యులని ఈ యార్యు లుత్తర దేశము నుండి వచ్చినారని ఆ యుత్తరదేశమునందున్న యార్యులే భూమి యొక్క దక్షిణాగ్రము నందుండి వచ్చినారని బహుసిద్ధాంతములు కలవు. ఉదాహరణలు చూపుచున్నారు. ఎంతసేపు చెప్పినను అవియే యుదాహరణలు.

ఈ బుద్ధిప్రబలి ఆంధ్రవిశ్వవిద్యాలయములో కొంతకాలము వ్యాకరణమే తీసివేసినారు. మరల నిప్పుడు పెట్టినారట. ఇది యొక పెద్దగోడు. ఒక గ్రంథము యొక్కపీఠికలో చెప్పుటకు వీలులేదు. ఈ ద్రావిడ భాషలనిపించుకొన్న భాషలలో పలు శబ్దములకు పోలికలు గల శబ్దములు గలవు. సర్వమానవుల ముఖావయవము లొక్కటియే లక్షణములు కలవి. కొన్ని సవ్వడులే మానవుల నోటి వెంటవచ్చును. సామ్యమెందుల కుండదు. ఈ ద్రావిడ భాషాశాస్త్రములో కొన్ని సిద్ధాంతములు కలవు. ఈ సిద్ధాంతములు క్రొత్తగా చెప్పబడినట్లుండును గాని నిజమునకు మనకున్న వ్యాకరణముల లోనివే. అర్థపరిణామములు, వర్ణవ్యత్యయ, వర్ణాగమ, వర్ణలోపములు కలవు. ఈ ప్రకారము కాలము మీద బహుప్రాంతముల యందు వాడబడు భాష నిస్సంశయముగా మారును. ఈ యథార్థమైన విషయమును వదిలిపెట్టి దక్షిణదేశమున గల అయిదారు భాషలను గ్రహించి యిది యొక గుంపు అనుట నిజము కాకపోవచ్చును.

ఇంగ్లీషులో గ్రూప్ అన్నమాట కలదు. ఇది గుంపు నుండి వచ్చినది. ర కారమునకు బదులు సున్న యున్నది. తలకట్టు పెట్టినచో ర యగును. కనుక ఇంగ్లీషు తెలుగునుండి పుట్టినది. తెలుగులో ఈను అంటే కనుట, ఉదాహరణకు గేదె ఈనినది. ఇంగ్లీషులో ఈన్ అను శబ్దమున్నది. దానికిని ఇదే యర్థము. తెలుగులో ఇరుకు అన్నమాట యున్నది. ఇంగ్లీషులో ఇర్క్ సమ్ అన్నమాట యున్నది. తెలుగులో చలి యన్నమాట యున్నది. ఇంగ్లీషులో చిల్ అన్నమాటు యున్నది. ఈ లెక్కప్రకారము ఇంగ్లీషు భాష తెలుగులో నుండి పుట్టినదని పరిశోధన చేయవచ్చును. కాని ఒక్కటే అనుమానము, మనము ఇంగ్లండును పాలించలేదు. కనుక వారు ఒప్పుకోరు.

ఈ సిద్ధాంతముల ననుసరించి తెలుగులో పరమ విపరీతవాదులు బయలుదేరిరి. సంస్కృతమునకు తెలుగునకు సంబంధములేదనుచున్నారు. సంస్కృతమును ద్వేషించుట నేడు దేశములో కొందఱి జీవలక్షణమైపోయినది. జీవిత లక్షణము గూడ నైపోయినది.

Friday, January 20, 2012

మక్ఖికిమక్ఖి - ఈగ పరిచయచిత్రం

సీ. బుద్ధిగడ్డిమెసవి శ్రద్ధసన్నగిలిన చవటడు బడికేగె చదువకుండ
వ్రాతపరీక్షల వానిపటిమ గన్న గుండుసున్నలె దేలు మెండుకొనుచు
గట్టెక్కు మార్గమ్ము గట్టిగా వెదకి నకలుకొట్టజూచె కుడికెలకువాని
వడివడిగ నకలువ్రాయుచునుండగ కంటబడెను వానికంతలోన

ఆ. ఈగ ప్రక్కవాని కాగితమున చచ్చి,
వేగ చవటకూడ ఈగబట్టి
తన జవాబుపత్రమునను మక్ఖికిమక్ఖి
యన్నమాటపుట్ట నతుకవెట్టె

(మెసవి - తిని, మెండుకొను - ఎక్కువై, కెలకు - ప్రక్క)

అదీ కథ.
మక్ఖికిమక్ఖి అనే హిందీపదబంధ మలా పుట్టిందని మా ఆచార్యులు చెప్పగా విన్నాను. ఈగ చిత్రానికి సంబంధించిన చవిచూపుదృశ్యకం (ట్రెయిలర్) నేడు నా కంటబడింది. వెంటనే చిన్ననాటికథ జ్ఞాపకం వచ్చేసింది.

ఎందుకో తెలియాలంటే, మీ రీ రెండు పరిచయచిత్రాలూ చూడవలసిందే.

ఈగ చవి


The girl with the dragon tattoo



ఏమంటారు,
మక్ఖికిమక్ఖియేనా?