Thursday, April 21, 2011

పరిహాసమా?

ఆదిదంపతులకు మోదంబు కలిగింప
పాదపూజజేయు పారవశ్యు
మందగమను నాగమనమును గని నగు
చందమామ గన నసహ్యమయ్యె

Wednesday, April 20, 2011

ఐక్య రాజ్య సమితి

భూమినాక్రమించి పోరుకు తెగియించు
దిష్టి కళ్ళ పొరుగు దేశములను
చెనకి గెలువవలెను స్నేహముతో గాదు
జవహరు డిది తెలియ జాల కైక్య
రాజ్య సమితి కడకు రయ్యంచు బోయెను
నోటి దనుక వచ్చి దాటిబోయె
చేతికంద వచ్చి చేజాఱి బోయె కా
శ్మీరు పురవరంబు దూరమాయె
నైక్య రాజ్య సమితి కధికార మీయగా
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె

Tuesday, April 19, 2011

సమితింజయు డసదృశ పవనగతిన్

పుంజిగొని ముందుకుంజని
భంజితులై జనె నసురుల బలగంబులు ప్రా
భంజను రౌద్రాటొప ప్ర
భంజనమున జిక్కి సాలభంజికల బలెన్
అంత,
అంజన సూనుని రాబి
ల్చెన్ జాంబవతు పురిగొని సుషేణుడు సౌమి
త్రిన్ జీవితు జేయగ మృత
సంజీవని వేగ దెచ్చు సాయము జేయన్
అపుడు,
వెన్ జూడక సాగెన్ సమి
తింజయు డసదృశ పవనగతిన్ పెకలిచె న
ద్రిన్ జడియింప నసురులన్
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్

Sunday, April 17, 2011

అసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

ఎదురుచూపుల ఆత్రము కూడా సహ్యము కానిదే..

గాత్రము రాగతాళముల,గాన విశేషమహత్తునన్ ,బృహ
న్మైత్రి ఘటిల్లు చెన్నపురమందు వసంత సభాస్థలుల్ మహ
చ్చైత్ర శోభలన్ గన, నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
శ్రోత్ర రసాయనాగమము చూడ్కుల వత్తులు నిల్వరించుటల్

Thursday, April 14, 2011

మగని మోసగించు మగువ సాధ్వి

రిత్త నెయ్యమూని ప్రేమ మభినయించి
మగని మోసగించు మగువ సాధ్వి
యౌనె తత్ప్రవర్త నానువర్తనుడైన
నరుని సత్పురుషుడనంగ జనునె

Tuesday, April 12, 2011

శ్రీ రామ నవమి

సత్యవాక్పరిపాలనన్, మనుజాళి హృత్కమలంబులన్
నిత్యనిర్మల కాంతిరేఖల నింపు సద్విలసత్కృపన్,
భృత్యుకోటి రహింపగన్ సదభీష్ట సిధ్ధులొసంగుటన్,
స్తుత్యమాన సమానులెవ్వరు సూర్యవంశ నృపోత్తమా

శ్రీ రామ నవమి మహోత్సవమున మీకు సకలశుభములు కలుగు గాక

Saturday, April 9, 2011

నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు

నరుడు: హే భగవన్, ధన్యుణ్ణి. నీ పాదసన్నిధికి చేరు వఱకు భూలోకమున నిశ్చింతగ కాలము గడుపు రహస్యమును తెలియజేయుము తండ్రీ

(దేవ దేవా చరణ సన్నిధి నను జేర్చు, వరకు పాపపంకిల భువి వాసమెట్లు)

భగవంతుడు: ఓ వ్యాయామశాల స్థాపించవోయ్ నరుడా, కావలసినంత ధనమబ్బి, చీకూ చింతా లేని బ్రతుకు నీ స్వంతమగును.

(సరవి స్థాపింప వ్యాయామశాల యొకటి, ఒదవు సౌఖ్యముల్ ధనము నీకు ధరయందు )

నరుడు: (ప్రశ్నార్థక ముఖంతో అవాక్కై) ????

భగవంతుడు: (నరుడి తెల్లముఖాన్ని తేట తెల్లము చేయడానికి తేటగీతిలో)
కలియుగ నరులు భోజ్యపూజ్యు లుదర పరి
పోషకులు స్థూల కాయత్వ మొంది కుందు
చుండ పల్ జిమ్ము లుద్భవించు మనుజాళి
నిద్ర బధ్ధకము లొసంగు నీకు సిరులు

నరుడు మర్మము తెలుసుకుని వేగిరమే జిమ్మోనరుడయ్యెను.

(జిమ్ము: gym)

Monday, April 4, 2011

ఖరనామ సంవత్సర శుభాకాంక్షలు

అడలుగొలుపు బరువు మోయునపుడు పిల్ల
వాడు నిందజెందగ తిట్ట వలసి నపుడు,
క్రొత్తవత్సర దీవెనల్ గూర్చు నపుడు,
ఖరము తెలుగుల కుపయోగకరము గనుము

ఖరనామ వత్సరము మీలో నవ్వులు నింపాలని ఆశిస్తూ, శుభాకాంక్షలు.

Friday, April 1, 2011

రాతికి నాతిపైన ననురాగము పుట్టుట నైజమే గదా

దూతగ బంపె భూసురుని దోకొనిపోవ ప్రియోక్తలేఖనం
బే తడవాటు నోపని మృగేక్షణ చేకొనరార మాధవా
భీతిలియున్నగోమలిని వేగ విదర్భ యనంగ నమ్మురా
రాతికి నాతిపైన ననురాగము పుట్టుట నైజమే గదా