Tuesday, November 24, 2009

స్వర సంగమము

నవంబరు ఇరవై ఒకటవ తారీఖు, అంటే క్రితం శనివారం నాటి సాయంత్రం నాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచ్చేరి లో కూర్చునే మహద్భాగ్యం కలిగింది.అజయ చక్రవర్తిగారి తో సహా వచ్చి స్వరసంగమమనే పేరుతో, హిందుస్తానీ కర్ణాటకమనే విభేదాలు కొత్తగా మనము సృజించినవేనని ప్రాచీన పుస్తకాలలో లేవని చాటుతూ, భారతీయమను శైలిని - సింగపూరు ఎస్ప్లనేడు వేదిక నలంకరించి - పాడిన బాలమురళీకృష్ణ గారి ని వేళ్ళలెక్క అడుగుల దూరంలో కూర్చుని వినగలిగే భాగ్యమే భాగ్యము, అది నా సొంతమయ్యింది.

అసలు ఈ కార్యక్రమము క్రితం ఏడాది జరుగవలసిందే. టికెట్లు గట్రా అమ్మేసి, సర్వసన్నధ్ధాలు పూర్తి చేసుకున్న తరువాత అజయ చక్రవర్తి గారికి అనారోగ్యం కలగడం వల్ల చివరి నిముషంలో కచ్చేరిని నిలిపివేయవలసి వచ్చింది. సరిగ్గా ఏడాది తిరగ కుండానే కార్యక్రమ నిర్వాహకులు నిలిపివేయబడ్డ కాచ్చేరిని తిరగతెచ్చి ఉస్సూరన్న ఎందరో సంగీతప్రియుల ప్రాణాలకు హాయి కలిగించారు.

కచ్చేరిని మహతి రాగములోని గురుస్తుతి తో మొదలు పెట్టారు. మహతి రాగము కనిపెట్టింది బాలమురళీగారే. షడ్జమము, గాంధారము, పంచమము, నిషాదమను నాలుగు స్వరాలే గల రాగంలో వారు పాడిని గురుస్తు తి గొప్పగా ఉంది. తరువాత హంసధ్వనిలో అజయ చక్రవర్తి హిందీ కృతిని పాడుతూ, చివరలో దాన్ని వాతాపిగణపతింభజే తో కలిపి పాడి, కార్యక్రమానికి స్వరసంగమమనే పేరు సార్థకం చేసారు. తరువాత సామజవరగమన, అటుపై మృదంగము, తబ్లాల హోరాహోరీ జుగల్బంది, అది ముగియగానే బాలమురళీ వారి తిల్లానా, చివరగా బాల మురళీకృత గురుమంగళము - వెరసి రెండున్నర గంటల కర్ణపేయమైన సంగీతానుభవము, సభాసదుల పరవశము.

బాలమురళీకృష్ణ గారి ప్రియశిష్యుడు, పుత్త్రసమానుడైన అజయ చక్రవర్తి వంగ రాష్ట్రస్థుడైనప్పటికీ కర్ణాటక సంగీత సరళిని చక్కగా ఆకళింపు చేసుకొని పాడడము, తన ప్రియశిష్యులను అదే బాటలో నడిపించడము చూసి ముచ్చటేసింది. ఆయన శిష్యుడు కూడా అమోఘగాన కౌశల్యము ప్రదర్శించి సభని ఆకట్టుకున్నాడు.

No comments:

Post a Comment