Sunday, March 28, 2010

మల్లాది సోదరుల కచేరి

సింగపూరు లలితకళా క్షేత్రము సిఫాసు (SIFAS) నిర్వహించిన ఈ ఏటి యాభై కచేరీలలో ఎస్ప్లనేడు వేదికపై జరిగినవి ఐదు. ఈ ఐదు కచేరిలకీ ఉద్దండులైన విద్వాంసులని ఆహ్వానించారు - వాటిల్లో నేను వెళ్ళి చూసినవి మూడు. క్రితం వారం కద్రి గోపాలనాథ్ గారి సీమసన్నాయి (saxophone) వాయిద్యము, మొన్న శశాంక్ సుబ్రహ్మణ్యము మరియు తేజేంద్ర నారాయణ మజుమ్దార్ల జుగల్బందీ , నిన్న మల్లాది సోదరుల గాత్ర కచేరి. నేటి ఉదయము (చైత్రశుధ్ధ త్రయోదశి) సిఫాసు వేదిక వద్ద కర్ణాటకసంగీత త్రైమూర్త్యపూజకై మల్లాది సోదరులు ఉచిత కచేరి జరిపారు. నన్ను ఎక్కువగా ప్రభావితం చేసినది మల్లాది సోదరుల కచేరిలే అనడంలో సందేహము లేదు, వారి గాత్ర పటిమ, వాక్స్పష్టత, హావభావ ప్రకటన నన్ను ముగ్ధుణ్ణి చేసాయి. వారికి భక్తితో నేను అర్పించిన ఉత్పలమాల ఇదిగో

నే డిట కొచ్చి గాత్రమును నిస్వనచాపము జేయ కీర్తనల్

వాడి శరమ్ములై దనరె ప్రాతనొకానొక దండకంబునన్

వాడి శరమ్ములన్ దనర వైచిన దాశరథుల్ తలంపులన్

గూడిరి కూడి పాడగనె కూరిమికంఠ సరస్వతీసుతుల్

వారు నిన్న సాయంత్రము పాడిన భైరవి కృతి - తనయుని బ్రోవ - నా చెవులలో ఇంకా మ్రోగుతూనే ఉంది.

No comments:

Post a Comment