Friday, July 16, 2010

లవకుశ పద్యాలు

లవకుశ పద్యాలు అంటే లవకుశులు పాడినవి కావుఁగాని లవకుశ పేరుఁగల సచ్చిత్రరాజ నిక్షిప్త పద్యాలని నా భావన. నేను విన్నవీ, వింటూన్నవీ, నా మనస్సును హత్తుకున్నవీ ఈ పద్యరత్నాలు. పైగా, ఘంటసాల గారి అసదృశగాత్ర సుధారసాన్విత పద్యాధారస్వాదన నిరుపమాన భాగ్యమే కదా.

మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయో
ధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సం
స్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్
భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా

(అన్వయము = వంశము)

తా. వశిష్ఠుడు రాముణ్ణి సంహాసనారూఢునిఁ జేసి పల్కిన వాక్కులివి. "నవరత్న ప్రభాజితమైన ఈ కిరీటము పూర్వము సూర్వవంశీయ రాజులు ధరించి రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించారు. ఈ ఘనమైన కిరీటము నీవు ధరింపఁదగినది. ధరించి ఇధ్ధరను మోదముతో ప్రజామోదగా పాలింపవయ్యా రఘువంశీయుడా"

ఉ. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సు
త్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీ
తా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగా
నీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా

(సుత్రాముడు = ఇంద్రుడు, హవ్యవాహనుడు = అగ్ని)

రఘువంశ కీర్తిప్రతిష్ఠలకు కళంకముఁ దెచ్చు నపవాదు ప్రజలలో వ్యాప్తము కాకమున్నె రాజ్యపరిత్యజమో, కళత్రపరిత్యాగమో చేయవలనని సంకల్పించియున్నవాడు శ్రీరాముడు. పట్టముఁ గట్టించుకొనుటకు తమ్ములెవ్వరూ ముందుకు రారయ్యె, భార్యావియోగమే మార్గమయ్యె. సీతను భగీరథీ నదతీరము వద్ద విడిచిరమ్మని లక్ష్మణుఁ నాజ్ఞాపించెను. ఆ క్షణమున లక్ష్మణుని ఆక్రోశమే ఈ పద్యము

ఉ. ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె తల్లి దు
శ్చింతులు దైత్యుచేఁబడిన సీతనుఁ గ్రమ్మఱ ఏలుచున్నవా
డెంత విమోహి రాముఁడని ఎగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందఁజెంది నిను కానలలోపల డించి రమ్మనెన్

గర్భవతియైన సీతను, ఏమఱచియున్న అబలను అడవుల పాలుఁజేయు దుస్సహ కార్యము రామప్రియానుజుని పైబడినది. అడవిలో కీడు శంకించుచూ కారణమడిగిన సీతకు లక్ష్మణుని బదులు పద్యమిది. "ఇలాంటి ఘోరకృత్యము తలపెట్టి నిమిత్తము నీకు చెప్పకుండా ఉండగలనా? దురాలోచనా పరులైన రాక్షసుల వద్ద యుండిన సీతను తిరిగి స్వీకరించిని మోహితుడు రాముడను దుష్టనిందను విని, అపవాదు కలుగునని, అయోధ్యాధిపతి నిన్ను అడవులలో దించి రమ్మనెను"

చ. ప్రతిదినమేనుఁ దొల్దొలుత పాదములంటి నమస్కరించి నీ
అతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమే
గతియెడమాయె నింకెపుడుఁ గాంతు భవత్పదపద్మముల్ నమ
శ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీ

తా. "అనుదినము నీ పాదములకు దండము పెట్టుకుని నీ ఆశీస్సుల తీసుకొని వెడలు వాడను, ఇక అట్టి భాగ్యము నాకు దూరమవుతున్నది కావున, చివరి సారి శతనమస్కారములు స్వీకరించుమమ్మా, సీతమ్మా" అని బాధపడు లక్ష్మణుడు.
ఒక్క మాటు కిష్కింధకాండ గుర్తుతెచ్చుకోండి. ఆకాశము నుండి పూర్వము ఒక స్త్రీ పడవేసిన నగల మూటను రామసౌమిత్రుల వద్దకు తీసుకువస్తారు వానరులు. ఆ అబల సీతయై యుండవచ్చునని ఊహించిన రాముని మనస్సులో పెల్లుబికిన బాధవల్ల కన్నులు చెమర్చినాయి. నగలని చూడలేక, ప్రక్కనే ఉన్న లక్ష్మయ్య చేతఁబెట్టి గుర్తించమన్నాడు.
నగలను పరికించి చూచి,
నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురేత్వభి జానామి నిత్యమ్ పాదాభివందనాత్
అని బదులు చెప్పాడు ఆ సౌశీల్య గుణగరిష్ఠుడు. పై పద్యం వింటూంటే ఈ శ్లోకం గుర్తుకు రాదూ?

ఇంత జరిగినా, పరుషమైన వాక్యము నొక్కటైనా పలికిందా మన సీతమ్మ తల్లి? లేదే. అడవి క్రొత్తకాదు, పదమూడేళ్ళ పాటు వసించిన తలమే, కానీ ఈ మాటు ప్రాణేశ్వరు డండగా లేక అల్లల్లాడిపోయింది. అయినా, కల్లోలితి మానసియైనా, లక్ష్మణునితో తమ వారందఱి క్షేమము లడగగలిగిందంటే -
తల్లి భూదేవి సహనసౌశీల్యమంతా అబ్బింది కదా అని అబ్బురపడవలసిందే.
ఒంటరియై, భీతచేతస్కురాలై, అలసి మూర్ఛిల్లిన సీతను చూచి భూమాత తట్టుకొనలేక పోయింది. రాముని మీద, ఆయోధ్యా పురవాసులపైన నిప్పులు చెండినది.

ఉ. రాజట రాజధర్మమట రాముడు గర్భిణియైన భార్య రు
ద్రాజ సురాసురల్ బొగడ అగ్ని పరీక్షకు నిల్చినట్టి వి
భ్రాజితఁ బుణ్యశీల నొక బాలిశు మాటకు వీడినా డయో
ధ్యాజననాథు డెంత కఠినాత్ముడొ నేను క్షమింపఁ జాల నా
రాజును రాజ్యమున్ ప్రజల, రండు ప్రతిక్రియఁ జేయ రుద్రులై

(బాలిశుడు: మూర్ఖుడు)

అయోధ్యా పురి ఆ కోపావేశానికి తట్టుకోలేక పోయింది. ఆ కష్టసమయంలో వారి కెవరు దిక్కు? సీతమ్మ తల్లి కాక మరెవ్వరు?

అదృష్ట వశాన వాల్మీకి ఆశ్రమఛాయలకు చేరుతుంది జానకి. అత్యంతాదరణానురక్తులతో ఆశ్రమవాసులు ఆమెకు స్వాగతము పలుకుతారు. అయోనిజ దురదృష్టానికి చింత కలిగినా, ఆమెకు ఆతిధ్యమిచ్చే భాగ్యము తమదైనందుకు ఆశ్రమవాసుల ఆనందానికి అవధులు లేవు. వాల్మీకి స్వాగత వచనా లివి.

చ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీ
సదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్
ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ
పదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో

9 comments:

  1. లవకుశ లోని అన్ని పాటలు, పద్యాలు మాకు చిన్నప్పటి నుండీ కంఠస్థమే. అవి వింటూంటే/ చదువుతూంటే ఇప్పటికీ కళ్ళు చమరుస్తాయి. మంచి పద్యాలతో శుభోదయం చెప్పారు, మీకు ధన్యవాదాలు...

    ReplyDelete
  2. శ్రీపతి గారు,
    నిజమే. "ఏ మహనీయ సాధ్వి" పద్యము, వెనువెంటనే "ఏ నిముషానికి ఏమి జరుగునో" పాట విని కంటతడి పెట్టని వారు ఉండరు.
    పైన ఉదహరించిన పద్యాలే కాక మరిన్ని మీకు కంఠస్థమైతే, ఇక్కడి వ్యాఖ్యలలోనైనా లేక మీ గూట్లోని వ్యాసములలోనైనా పొందుపఱచండి.

    ReplyDelete
  3. ధన్యవాదములు, దయ ఉంచి సుత్రాములు,బాలిశు అను పదములకు అర్థము తెలుపగలరు.....!

    ReplyDelete
  4. కొండారెడ్డి గారు,
    సుత్రాముడు, పాకారి, నాకేశు, పృతనాషాట్టు - ఇవన్నీ ఇంద్రునికి పేర్లు. తీరిక సమయంలో శబ్దరత్నాకరము తిరగేస్తూ ఉంటే ఇంకా చాల దొరుకుతాయి

    బాలిశుడు అంటే మూర్ఖుడు.

    ReplyDelete
  5. గిరిగారూ,
    ధన్యంబైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు - టైపాటు జరిగింది చూడండి.
    ధన్యంబైన సూర్యాన్వయోభ్వవ రాజన్యులు - అని పడింది.

    ఇంతకూ ఈ పద్యాలెవరు రాశారో చెప్పలేదు మీరు.. తెలిస్తే ఆ సంగతీ చెప్పండి.

    ReplyDelete
  6. అలాగే సంస్థవనీయంబగు అని పడింది. సంస్తవనీయంబగు అని వుండాల్సింది.

    ReplyDelete
  7. లవకుశ సినిమా పద్యాలు సదాశివబ్రహ్మం అనే కవిగారు రాశారని చిన్నప్పుడు మాయింటో ఉన్న LP రికార్డుమీద ఉండేది.

    ReplyDelete
  8. రానరె గారు తప్పులు సవరించాను. కొత్తపాళీ గారు చెప్పినట్టు పద్యాలు వ్రాసింది సదాశివబ్రహ్మం గారే

    ReplyDelete
  9. గిరివర! సంతసంబయెను.గీతము లద్భుత రీతినుండుటన్
    సురుచిరమైన భావమును చూచి పఠింపను వీలు గొల్పుటన్;
    ధరణిజ దుఃఖతీక్షణత ధాత్రి జనావళి తన్మయాత్ములై
    కరుణ రసార్ద్ర చిత్తులయు గాంచగ వీలును గొల్పినారిటన్!
    అభినందనలు.

    ReplyDelete