Monday, July 19, 2010

కృష్ణుని శపథములు

శ్రీకృష్ణుణి కృధ్ధునిఁ జేసి ప్రాణముల మీదికిఁ దెచ్చుకున్న గంధర్వరాజు గయుడు. మణిపురంబనే రాజ్యము నేలుచు పరమేష్ఠి దర్శనాభిలాషియై విమానయానముఁ జేయు సమయము నొకమాఱు, ఆతని (తమ్మ) నిష్ఠ్యూతి కృష్ణుని అర్ఘ్యాంజలి జలములో పడుతుంది. కోప వివశుఁడై గోపనందనుడు గయ శిర:ఖండన మొనర్చెదనని శపథము చేస్తాడు. ఆ ఘోర వార్త తెలుసుకొని గయుడు భయకంపితుఁడై బ్రహ్మ రుద్రాదులను రక్షింపుమని నిరర్థకముగ వేడి, రక్షింపు నాథుడుఁ గనబడమి నారదుని ఆజ్ఞమేరకు అతఁడు అర్జునుని శరణు వేడడము తత్పరిణామములు. కృష్ణార్జున యుధ్ధమునకు రంగము సంసిధ్ధ పఱచిన ఘనత గయునిది. గయుడు శ్రీకృష్ణుని చక్రఘాతము నుండి ఎవ్విధి తప్పించుకొనెనో చిలకమర్తివారు నూఱేండ్లకుఁ బూర్వము ఇరవదిరెండేడ్ల చిఱుతఁబ్రాయమున రచిచిన గయోపాఖ్యానము చదివి తెలుసుకొనవలసినదే.

ఈ వ్యాసములో మూడు పద్యములు పొందుపఱచాను.

౧. కృష్ణార్జునయుధ్ధము

మొదటిది, కృష్ణార్జునయుధ్ధమను చిత్రరాజము లోనిది.
సుభద్రను వివాహ మాడు నిమిత్తము అర్జునుడు త్రిదిండి స్వామి వేషము వేయడం చిత్రములో మొదటి ఘట్టము. కథకులు దానికి ముందు పారిజాతాపహరణ కథను చూచాయగా (నంది తిమ్మన యొక్క ప్రసిధ్ధ నను భవదీయ దాసుని పద్యముతో సహా) లాఘవంగా చొప్పించారు. అర్జునుని స్వామి వేషమంటే చేమకూర వేంకటకవి కృత విజయవిలాసములోని తృతీయాశ్వాస ఘట్టమని అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చిత్రములో ప్రవేశపెట్టిన స్వామి పేరు సజిభీ ధఫపా శ్వేకి స్వామి, శిష్యుని వలె వచ్చిన అర్జునుని వేడుక చెలికాడు పార్థుని నామముల ఆది అక్షరాలతో కుదిర్చిన విచిత్రాభిధానమది. అర్జునుడు త్రిదిండి వేషమే వేయవలసిన అవసరమేది అని అనుమానిస్తే చేమకూర కవి సుభద్ర చెలికత్తెల ద్వారా ఇచ్చిన కారణ మిదిగో. వేఱు స్వాములైతే గుండు గీసుకొని రావసి వచ్చేది.

క. వాసవి త్రదిండి వేసము, వేసి గదా మేలు సేసే వెస, జన్నిదమే
వేసికొనవచ్చు నీసిగ, వేసికొనం గూడదండు వేసము వేయన్

గుండు చేసుకొని సుభద్రను ప్రేమలో పడవేయడం కిరీటికి సాధ్యమో కాదో మన మెఱుగము గానీ, కష్టతరమని ఆతడు తలఁబోసి యుండవచ్చు. ఈ విషయములో నేటి యువకులు అర్జునినితో తప్పక ఏకీభవిస్తారు.
కృష్ణార్జునుల యుధ్ధ సంభారాలు మొదలయినప్పటి నుండి వారి నడుమ నలిగిపోయింది సుభద్ర - చిలకమర్తి వారి నాటికలో ఆమె పాత్ర ఎన్నో గొప్ప పద్యాలు ప్రేరేపించింది. అందువల్ల చిత్రంలో ఆమెకు ప్రాముఖ్యత నివ్వడం సబబే.

సరే, ఇక కృష్ణుని శపథపు పద్యాల వైపు దృష్టి సారిస్తే...

సందర్భము సుపరిచితమే. ఉదయభానుని పూజకై వచ్చిన కృష్ణుని కోపావేశుని చేసిన గయుడు. ఆ సందర్భములో ఘంటసాల వెలువడిన శపథమిదిగో.


మ. ధరణీ గర్భము దూరుగాక వడి పాతాళంబునన్ జేరుగా
క రహస్యంబున దిగ్గజేంద్రముల వెన్కన్ దాగునే గాక ఆ

హరబ్రహ్మాదులె వాని రక్షణకుఁ దోడై వత్తురే గాక ము
ష్కర గంధర్వు శిరంబుఁ ద్రుంచెద మహోగ్రకౄర చక్రాకృతిన్

౨. గయోపాఖ్యానము

రెండవది గయోపాఖ్యానమను నాటకములో కృష్ణ శపథము. స్థూలముగా ఆ నాటక కథను పైన చెప్పుకున్నాము కదా. ఇక శ్రీకృష్ణుని శపథమిది.

చ. జలనిధు లింకుగాక, కులశైలము నేడును గ్రుంకుగాక యా
జ్వలనుఁడ వేఁడిమిన్ విడిచి చల్లదనంబు దాల్చుఁగాక, యీ
జలజ హితుండు పశ్చిమ దిశన్ జనియించెడుఁ గాక, యింక నా
ఖలు గయు నుత్తమాంగమును ఖండనచేసేదఁ జక్రధారలన్

ఒకటి మత్తేభము, రెండవది చంపకమాల. ఒకదానికొకటి తీసిపోదు. రెంటిలో కృష్ణుని కోపము, ఎవ్వరు అడ్డువచ్చినను ఇక గయుని కాపాడు వారు ఉండరని, వాని శిరస్సును చక్రమున కెర చేసెదనను కృష్ణుని కఠోర శపథము తెలుస్తుంది.

ఇట్టి కఠోర శపథమునకు గురైన వారెవరు భయపడరు? గాలి సడి విని కూడ కృష్ణు చక్రము సమీపిస్తోందేమో అని భ్రమకు లోనయ్యి భయపడేవాడు గయుడు. చివరకు అతనికి నారదుని సూచనలే ప్రాణాపాయ విమోచనములై రక్షించాయి.

పై పద్యాలు చదివి ఉత్సాహితుఁడనై నేను వ్రాసిన శ్రీ కృష్ణ శపథమిదిగో.

శా. ఓరోరీ గయ, ధూర్త దుష్కర్మ మయా, ఉన్మత్త గంధర్వ రా
యా, రక్షింపను బ్రహ్మరుద్ర గణమే ఆయత్తమై నిల్వ నీ
ప్రారబ్ధంబును తప్పఁజేయగలరే, పాతాళమున్ నాకమున్
భూరిక్ష్మాతలమున్నెటన్ జనిన నిన్ పోకార్తుఁ జక్రాఘతిన్

No comments:

Post a Comment