Saturday, September 5, 2015

మంగాంబుధి హనుమంతా

పల్లవి - మంగాంబుధి హనుమంతా, నీ శరణ మంగవించితిమి హనుమంతా.
చరణం ౧ -
బాలార్క బింబము ఫలమని పట్టిన,
ఆలరిచేతల హనుమంతా.
తూలని బ్రహ్మాదులచే వరముల,
నోలి చేకొనిన హనుమంతా
చరణం ౨-
జలధి దాట నీ సత్త్వము కపులకు
నలరి తెలిపితివి హనుమంతా
ఇలయు నాకసము నేకముగా నటు
బలిమి పెరిగితివి భళిహనుమంతా
చరణం ౩ -
పాతాళములోపలి మైరావణు
నాతల జంపిన హనుమంతా
చేతుల మోడ్చుక శ్రీవేంకటపతి
నీతల గొలిచే హిత హనుమంతా


పై కీర్తనను పూర్తిగా వ్రాయడానికి నేను పారుపల్లి సత్యనారాయణగారి పాడిన యూట్యూబులో ఉన్న శ్రవ్యకాన్ని సహాయముగా తీసుకొన్నాను. అయితే, అందులో మూడవ చరణములేదు. అది సంగీతసుధలో దొరికింది.

ఫేసుబుక్కులో ఉదయ్ నన్ను తాత్పర్యము వివరించమని అడిగినప్పుడే నేను మొదటిసారి ఈ కీర్తనను వినడం. వినడానికి ఎంతగానో సొంపుగా ఉన్నది.

అన్నమయ్య కృతులలో సాధారణంగా కనిపించేది ప్రాసనియమం. చరణాలన్ని ప్రాసతో ఉండడం కూడా సులువుగా పదాలను అర్థముచేసుకోవడానికి దోహదము చేసింది.  ప్రాసను ఇంతకు పూర్వం గమనించని వారు ఒక్కసారి చరణాలు చూడండి. మొదటి చరణంలో బాలార్క, ఆలరి, తూలని, నోలి - మొదటి అక్షరం (వడి) దీర్ఘం అంటే గురువు, రెండవ అక్షరం (ప్రాస) లకారమై ఉన్నది.  అన్ని పాదాలకూ ఇటువంటి నడకే వర్తిస్తుంది.  రెండు చరణంలో ప్రతిపాదంలోనూ వడి లఘువు, ప్రాసాక్షరం లకారము. మూడవ చరణంలో ప్రతిపాదంలోనూ వడి గురువు, ప్రాసాక్షరం తకారమై ఉన్నది.

పల్లవి. మంగాంబుధి అంటే ఒక ప్రదేశం పేరు కావచ్చునని ఇతరు లన్నది నిజమేనని నాకు అనిపిస్తోంది. నీ శరణ మంగవించితిమి (శరణము, అంగవించితిమి) అంటే నీ శరణు కోరినాము అని అర్థము. అంగవించడమంటే యత్నించడం, సమీపించడ మని శబ్దకోశం చెపుతోంది.

మొదటి చరణం. బాల, అర్క, బింబము - అంటే ఉదయించే సూర్యుని బింబము. ఆలరి చేతల అంటే వట్టి చేతులతో. తూలని బ్రహ్మాదులంటే నిశ్చలులైన బ్రహ్మాదులని అర్థము. ఓలి చేకొనిన అంటే వరుసగా తీసుకొనిన..స్థూలంగా చూస్తే, ఉదయించే సూర్యుని వట్టి చేతుల పట్టబూనిన హనుమంతా, నిశ్చులైన బ్రహ్మాదులచే వరుసన వరముల నొందిన హనుమంతా, అని తాత్పర్యం.

రెండవ చరణం. సముద్రము దాటి సాటికపివీరులకు తన సత్తా్వన్ని చాటిచెప్పాడు హనుమంతుడు. ఆ సమయంలో భూమ్యాకాశాలు ఏకమైనట్టు అనిపించేలా శరీరపరిమాణాన్ని పెంచాడు హనుమంతుడు. ఇందులో అందఱికీ అర్థమయ్యే అలతి పదాలే అన్నీ. 

మూడవ చరణం. పాతాళాధిపతియైన మైరావణుని చంపినవాడు హనుమంతుడు.  శ్రీవేంకటపతిని అధికంగా (ఈతల) కొలిచేవాడు హనుమంతుడు.

ఇదీ తాత్పర్యం.

No comments:

Post a Comment