Sunday, April 2, 2017

శంకరాభరణం సమస్య - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఎన్నో రోజుల తరువాత శంకరాభరణం బ్లాగు సందర్శించాను. కంది శంకరయ్యగారు ఛందోప్రక్రియలకు చేస్తున్న సేవ లనల్ప మనితరసాధ్యమూను.

ఆయన ఇచ్చిన క్రొత్త సమస్య రెండు రకాలుగా ఉన్నది,

౧. మొదటిది కందములో - నారద మునిసత్తమునకు నలువురు భార్యల్
౨. రెండవది ఉత్పలమాలలో - నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

రెంటికీ నా పూరణలు ఇవిగో

కం. నారాయణార్చనప్రియ
శారదగానప్రియ నుతసంచారనయా
చారప్రియ కలహప్రియ
నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

ఉ. ఆరయ నగ్నిసాక్షిగ మను వాడిన సాక్ష్యము లెవ్వి లేకనే
జేరిరి ప్రేయసీమణులు చెంతకు నోలి హితార్థలోకసం
చారిణి భక్తిరూపిణి విశారదరాగిణి భేదనాంగనల్
నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

ముందుగా పూరణకు నేనెంచుకున్న దారి. నారదమహాముని అంటే ఆజన్మబ్రహ్మచారి అనే విషయం విదితమే. దాని వల్ల మిగిలిన దారి, ఆయనకున్న లక్షణాలను పడతులుగా చెప్పడమే. అదే చేసాను.

మొదట కందపద్యం. నారాయణార్చనప్రియ - నారదుడు నారాయణార్చకుడు కదా.
శారదగానప్రియ - సరస్వతీదేవి ప్రసాదించిన గానకళకూడా నారదమహామునికి ఉన్నది.
నుత, సంచార, నయ, ఆచార, ప్రియ - అందిరిచే పొగడబడిన లోకసంచారమనే మంటి ఆచారమూ ఆయన సొత్తు
కలహప్రియ - నారదుల గూర్చి నేటి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గుణాన్ని గురించి వేఱే చెప్పనక్కరలేదు కదా.

ఇక ఉత్పలమాల.
ఆరయ - అంటే చూడగా (ఈ పదాన్ని పూరణల్లో పూరకంగా అంటే భావార్థాలపరంగా పెద్దతేడా తీసుకవచ్చేది కాకపోయినా గణాలు యతిప్రాసలు సరిపోవడానికి వాడే పదములాగ నేను తరచూ వాడుకుంటాను)
అగ్నిసాక్షిగా మనువు ఆడిన సాక్ష్యము లేవీ లేకనే
చేరిరి ప్రేయసీ మణులు ఆయన చెంతకు
ఓలి అంటి వరుసగా, ఈ పదము కూడా ఒక రకమైన పూరక పదమే కానీ ఇక్కడ వరుసగా పేర్లు చెపుతున్నాను కాబట్టి సరిపోతుంది.
హిత, అర్థ, లోక, సంచారిణి - లోక హితార్థము సంచారము చేయడం నారదమునికి అలవాటే
భక్తిరూపిణి - నారదుడంటేనే నారాయణుని మీద భక్తి
విశారదరాగిణి - పైన చెప్పునట్టు గానకళను ఈ విధంగా చెప్పాను
భేదన, అంగన - కలహప్రియలాగానే ఇదీనూ.

ఆ విధంగా రెండు పద్యాలలోనూ నలుగురు పడతులను ఇరికించి పూరణను గట్టెక్కించాను.
 

No comments:

Post a Comment