Tuesday, August 29, 2017

బుద్ధలేని వాడె బుద్ధు డనగ

ఈ వారం ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య - బుద్ధలేని వాడె బుద్ధు డనగ.

దీనిని మందుగా గొతమబుద్ధునికి జ్ఞానోదయం కాకముందు ఆయన అనుభవించిన సుఖాలను ఒకప్రక్క, వాటిని విడిచిన వెళ్లిన వైనం మఱొక ప్రక్క వ్రాద్దామని ఆలోచిస్తూ  - అప్పటికే రాజ్యలక్ష్మితో మొదలుపెడదామా, లేక వంశపారంపర్యముగా వచ్చిన సంపదతో మొదలుపెడదామా అని సతమతమవుతున్న నాకు అంగుళిమాలుని పేరు గురుతువచ్చింది. నెమ్మదిగా వ్రేలు తరిగి మాలచేసేవానికి వేలిచ్చి ముందుకు తీసుకపోయి జ్ఞానబోధచేసిన బుద్ధుడే మనసులో మెదిలాడు.

అలా ఈ పద్యం పుట్టింది. అదీ సంగతి.

సీ. గణ్యులు వినుతించు పుణ్యపథము వీడి పెడత్రోవలఁ వెడలి పెచ్చరిల్లి
రహదారుల నిలచి యహరహ మధికమౌ హింసకు పాల్పడి యీసడించి
తెరువరులను బట్టి పరలోకమున కంపి వ్రేలొక గుఱుతుగా మాలఁ జేర్చి
నరకమార్గముల వినాశకుం డంగుళిమాలుడై బ్రతుకు నమ్మారకుండు

ఆ.వె. మారకుండ వదల కూరకుండని స్వార్థ 
బుద్ధిలేనివాడె బుద్ధుడనగ
జెలగె వసుధలోన చేరబిల్చి ఖలుజ
న్మంబునటుల సార్థకంబుజేసె

అహరహము - అంటే ఎల్లప్పుడూ
తెరువరి - అంటే ప్రయాణికుడు. చిన్నయసూరి వ్రాసిన పంచతంత్రకథ తొల్లియొక తెరువరి అనే వాక్యంతోనే ప్రారంభమవుతుందని లీలగా జ్ఞాపకం
మారకుండు - అంటే హింసకుపాల్పడేవాడు

మఱియొక్క విషయమూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను వ్రాసే పద్యాలకు ప్రేరణగా, ఆలోచనలకు ఊతగా నిలిచినవాటిలో ధనికొండవారి సమస్యలది సింహభాగమే. అందువల్ల ఈ పద్యాన్ని ఆయనకే గౌరవంగా అంకితమిస్తున్నాను. ఆయన స్వీకరిస్తారని ఆశిస్తాను. 

2 comments:

  1. అత్యద్భుత పూరణ. బుద్ధుని ఔన్నత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. మీ పద్యాన్ని అంకితం ఇస్తున్నందుకు మహదానందం. మహాప్రసాదం గా స్వీకరింపక వదులుకుంటానా !

    ReplyDelete
    Replies
    1. మహదానందం రవిప్రసాద్ గారు

      Delete