Sunday, September 3, 2017

పింగళిసూరన కళాపూర్ణోదయం - చిత్రకవిత్వం

ఫేస్బుక్కులో రసధుని సమూహములో రూపనగూడి సుగుణగారి టపా ఇది.  అందఱూ చదివి ఆనందింతురు గాక.

--

ఈ పద్యము పింగళి సూరన గారి కళాపూర్ణోదయము లోనిది. పద్యము,శ్లోకముల అర్థములను అడిగినవెంటనే వివరించి పంపిన గురువుగారు శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారికి హృదయపూర్వక నమస్కారములు, మరియు ధన్యవాదములు.
తా వినువారికి సరవిగ/
భావనతో నానునతి విభా వసుతేజా/
దేవర గౌరవ మహిమన/
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

ఈ పద్యమును తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది!
శాధీనకు మా గిరి మత/
వికనసి లవమాన మహిమ వర గౌరవ దే/
జాతే సువ భావి తినను/
నాతో నవభాగ విరస కిరివానువితా
(కళాపూర్ణోదయం ,పింగళి సూరన)
తెలుగు సాహిత్య మందలి చతుర్విధ కవితలలో చిత్ర కవిత్వ మొకటి. ఈ రచన కవికి
భాషపై,శబ్దములపై గల అధికారమును,అందలి నిష్ణాతృత్వమును వ్యక్తపరుచును.
ఈ పద్ధతిలో కావ్యములు కూడా వచ్చినవి. ఇది ఒక రసానుభూతిని కల్గించు కవిత. మన
కవుల ప్రతిభకు ఈ పద్యము ఒక నిదర్శనమై నిలుస్తుంది.
తెలుగుటీక :--: అతివిభావి సుతేజా!- మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల,
అధీశా- రాజా!; దేవర గౌరవ మహిమన =ఏలినవారి మహిమాతిశయముచేతనే;
మావలసిన కవిత= మా ప్రియమైన కవిత్వము; తాన్ =అది, వినువారికి =శ్రోతలకు;
శ్రోతలకు ; సరవిగన్--తగురీతిని ; భావనతోన్--తలచినంతనే ;
మాకున్ మరగిమాకు స్వాధీనమై ; ఆనున్--భాసిల్లును;
భావము: ఆశ్రయ దాతలైన తమ మహిమాతి శయముచేతనే శ్రోతల కానందమును గూర్చు యీ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది;
సంస్కృతము:- పదవిభాగము;
శాధి , ఇనకుమ్ ,అగిరి ,మత ,వికనసి ,లవమాన ,మహిమ
వరగౌరవదే ,జాతే , సువిభౌ , ఇతి , నను ,నా ,అతః , నవభాః , గవి,రస, కిరి,వా వినుతా,
టీక :- ఇన- రాజా! ; ఆగిరి- పర్వతములున్నంతకాలము, కుం =భూమిని;
; శాధి--పాలింపుము ; మత = సర్వమత సమ్మతుడా!; వికనసి= మిక్కిలి కీర్తిచే విరాజిల్లు
చున్నవాడవు ; లవమాన--లవునివలె మానవంతుడవగు ; నను-- ఓ రాజా!;
నహిమ వర గౌరవదే--గొప్పతనముచే మిక్కిలి గౌరవమునిచ్చు; సువిభౌ =నీ వంటి ప్రభువు; ఇతి= ఈ రీతి; జాయతే= కలిగియుండగా ; నా =మనుజుడు (పండితుడు)
అతః--ఇట్టిగౌరవము వలన ;నవభాః--క్రొత్త వికాసము గలవాడై ;
రసకిరి--నవరసములను వెదజల్లు ; గవి- భాషయందు ; అను వితావా =నుతియింప కుందురా?
భావము:-ఓరాజా! ధరలో గిరులున్నంత కాలమీ ఇల(భూమి)నేలుము. శ్రీరామ కుమారుడగు లవుని వంటి యభిమానధనుడా! గౌరవాదరము జూపు నీవంటి ప్రభువు
రాజైయుండగా పండిత కవులు రస వంతములగు కవితలతో నిన్ను
స్తుతింప కుందురా?

No comments:

Post a Comment