Saturday, November 28, 2009

రెండవ ఆర్య

ఆర్థికరంగంలో కాలం గడిపే వారికి డెరివేటివ్సు గురించి వేఱుగా చెప్పవలసిన అవసరంలేదు.మిగతా వారి కి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది , కాకపోతే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం వాటి గురించి చర్చించడం కాదు కాబట్టి కావలసినంత మేరకు చెప్పుకుని ముందుకు సాగుదాం. అసలు సరుకులకు ఉండవలసిన విపణులు ఉండనే ఉన్నాయి, వాటిని ఆధారంగా చేసుకొని సృజించబడే విపణులే డెరివేటివ్ విపణులు. వీటిలో అసలు సరుకులు కొనే సదుపాయం ఉండదు, కానీ వాటి ధరను కనిపెట్టి దాని బట్టి పత్ర క్రయవిక్రయము చేయడం జరుగుతుంది.

సరిగ్గా అలాంటివే డెరివేటివ్ సమీక్ష లంటే. ఇవి వ్రాయడానికి సినిమాచూసే అవసరం లేనే లేదు. పత్రికలు, అంతర్జాల గూళ్ళు కనిపెట్టుకు కూర్చుని వాటిలో ఇతరులు వ్రాసిన ఆణిముత్యాలను సేకరించి, ఆకళింపుచేసుకొని, కొంతసేపు బబ్బుని లేచి, మనమే గనక ఆ సినిమాకు బలై ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుంటూ వ్రాస్తే సరిపోతుంది. పలు కారణాల వల్ల కొన్ని సినిమాలు చూసే ధైర్యం మనకు కలగకపోవచ్చు, అలాంటప్పుడు వాటిమీద మనకు గల అభిప్రాయాల్ని స్వేఛ్ఛగా వ్రాసుకోగల స్వేఛ్ఛను డెరివేటివ్ సమీక్షలు ప్రసాదిస్తాయి. ఆర్థిక డెరివేటివ్సు లో లాగ ఇందులో కూడా ఓనర్షిప్పులేకుండానే షార్టుపొజిషన్ అనే ఒక వీలు కలిపించుకొని బండి లాగించేయచ్చు.

ఆ ప్రేరణతో వ్రాయబూనిన సమీక్షలలో మొదటిది - రెండవ ఆర్య సమీక్ష.

పత్రికలు, టీవీ వాహినుల పుణ్యమా అని ఆర్య అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అల్లు అర్జున్ అనబడే ప్లవంగముఖుని చిత్రమే. ఆ చిత్రం అంత గొప్పగా లేకపోయినా,కథానాయక దర్శకుల రాశి వాసికెక్కించాలని పైవాడు పూనుకోవడం వల్ల, నిర్మాతేతరులకు బాగానే డబ్బు కూడగట్టి పెట్టింది . అది అదనుగా చూసుకొని, ఇతర భాషలలో ప్రసిధ్ధి కెక్కిన ధారావాహిక చిత్రాలు తీసే పధ్ధతిలో, పులిని చూసి నక్క అన్న రీతిలో, వారిని చూసి మనతెలుగు ప్రేక్షకులకు వాతలు పెట్టేసాడు దర్శకుడు. తలలు పట్టుకుని జనం హాళ్ళనుంచి పరుగుల మీద బయటకు వస్తున్నారు.

అమ్మాయి పట్టించుకోకపోయినా , ముంబాయిలో భోజన డబ్బాలు సరఫరా చేసే వాడిలో ఉన్న దీక్షవంటిది పూని ఆ అమ్మాయి చుట్టూరా తిరుగుతూ తోకాడించే అబ్బాయిల ప్రేమ ఆర్యప్రేమ. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం లేదని బోధించే పధ్ధతిది. భగ్నప్రేమలో భగ్నాన్ని చూడని గుడ్డి ప్రేమ ఇది.

ఇక కథవిషయానికొస్తే, చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అబ్బాయికి అబ్బాయంటే ఆర్యప్రేమ, ఆ అబ్బాయిలిద్దరికీ అమ్మాయి మీద ప్రేమ, ఆ అమ్మాయి నాన్నకి డబ్బుమీద ప్రేమ, మరో అమ్మాయికి అబ్బాయిమీద ఆర్యప్రేమ ఉన్న అబ్బాయి మీద ఆర్యప్రేమ. ఇన్ని ప్రేమల్లో ఎవరి ప్రేమ సఫలం అవుతుందనేది కథకి అయువు పట్టు, ప్రేక్షకుల సహనానికి గొడ్డలిపెట్టు. మొదటి సగం అంతగా బాగుండక పోయినా, రెండవ సగం (పూర్తిగా చూడగలిగితే) చూసిన తరువాత ఫర్వాలేదనిపిస్తుంది. రెండవ సగం పూర్తిగా చూడలేక హాల్లోంచి పరుగెడితే ఇక చెప్పేదేముంది. ఈ రెండవ రకం వాళ్ళే ఎక్కువ మంది ఉండడంతో చిత్రానికి చెడ్డ పేరొస్తోందని నా నమ్మకం.

హోరు సంగీతపు పాటల జోరు, శ్వేతాజిన భామల అందాల ఒలకబోత,కొత్తరకం డాన్సులు, స్టైలు రాదరు దాను సబ్స్టెన్సు ఉంటే చిత్రాలు ఢంకా భజాయిస్తాయని నమ్మే వాళ్ళకి, మొదటిసారి ఓ వెలుగు వెలిగింది కదా అదే పేరుతో ఇంకో చిత్రం తీసేసి ప్రేక్షకుల కు కథమేత వేయకుండా పితికేద్దామని చూసే దర్శకులకు ఈ చిత్రం కనువిప్పు కలిగిస్తుందని నాకు అనిపిస్తోంది.

నా మాట విని ఈ చిత్రం ఆడుతున్న హాలు దరిదాపులకి కూడా వెళ్ళకండి. రెండు నెలలో ఎలాగూ టీవీలో ఉచితంగా వచ్చేస్తుంది, అప్పుడు టీవీ కట్టేసుకోవచ్చు.

3 comments:

  1. మీరు ఇలా మీ మనోభావాలను వ్రాస్తే మొహమాటపడకుండా, కొంత మంది మనోభావాలు దెబ్బతింటాయేమో అలోచించుకోండి.
    కోట్లు పెట్టి తీసిన నిర్మాత భవిషత్తుని దృష్టి లో పెట్టుకొని, కొన్ని లక్షల మందినో, కనీసం కొన్ని వేలమందో, ముడు గంటల నరకం ప్రత్యక్షం గా, ఆ తర్వాత దానినుండి కోలుకోవటానికి కొన్ని రోజుల భాద అనుభవించటాన్ని మీలాంటి వారు ప్రోత్సహించాలన్న వారి మనోభావాలను మీరు గౌఱవించకపోవటం మాత్రం ఏమీ బాగోలేదు :) wait for those comments

    వీలయితే word verification తీసేయండి.

    ReplyDelete
  2. "ఆర్యప్రేమ" బాగుంది కొత్త పదాన్ని కనిపెట్టారు అందుకోండి వీరతాళ్ళు.
    సినిమా చూసిన నా ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఎంటంటే మోరల్ వాల్యుసూ అదీ అంటూ ఏడవకుండా "సరదాగా" చూడగలిగితే ఈ సినిమా బాగుంది క్షమించాలి చాలాబాగుంది అని. అంటే ఉత్తమప్రేక్షకుడిలా చూడాలన్నమాట. అన్నట్టు నేనుత్తముడ్ని కాదు.

    ReplyDelete
  3. burra takkuva raatalu meerunu....

    ReplyDelete