Monday, August 5, 2019

కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

రాజ్యాంగాధికరణము ౩౭౦ రద్దు చేసిన మోదీ ప్రభుత్వం. దానిపై కంది శంకరయ్య గారి సమస్య

కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్

నా పూరణ -

కం. కల్లల సమయం బుడిగెను
తెల్లముగా ప్రజకుఁ నేడు దెలిసెను దేశం
బెల్లను కలయుట కించుక
కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ 

కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి

శంకరాభరణం బ్లాగులో నేడు కందిశంకరయ్యగారు ఇచ్చిన సమస్య

కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి


నా పూరణ

రామలక్ష్మణు లెందఱొ రక్కసులను
నేలకున్ దెచ్చి పదపడి నేలపట్టి  
కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి
బ్రహ్మహత్యకున్ వాటిల్లు పాపమునకు

Saturday, August 3, 2019

కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

కంది శంకరయ్యగారు నేడు ఇచ్చిన సమస్య

కలము విడిచి మేటి కవిగ వెలిఁగె


నా పూరణ

బాధకు నిలయమని భవబంధమ్ములన్
విడిచి యరిగె తానె వేమయోగి
తెలిపె జగతికెల్ల తేటతెల్లముగ స
కలము విడిచి మేటి కవిగ వెలిఁగె

Saturday, July 27, 2019

తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్య

తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

నా పూరణ

తొమ్మండ్రుండిరి యన్నలు
దమ్ములు నొక నింట నొకడు తగిలెను యమపా
శమ్మున పరివారమ్మున
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

తొమ్మండుగరన్నదమ్ములు, అందులో ఒక్కడు యమపాశానికి తగులుకొన్నాడు. మిగిలినది ఎనమండుగురన్నదమ్ములు. ఇద్దరు తలిదండ్రులతో కలగలిపి పరివారంలో ఉన్నది పదిమంది. అదీ అర్థం.

Friday, July 26, 2019

తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్య ఇది

తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్


నా పూరణ

కం. తప్పుడు త్రోవలఁ బోవుచు 
తప్పొప్పులు తెలియక కలఁతపడెడి వారే
తిప్పల బడయని విధముగ
తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

కంది శంకరయ్య గారు ఇచ్చిన సమస్య ఇది. దానికి నా పూరణ

వేసవి యందున వేడికి
గాసిలపడి దీర్ప త్వరితగతి దాహంబున్
బోసిన మజ్జిగ నురుగుల
మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

Saturday, December 2, 2017

కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

ధనికొండవారు నేడు ఇచ్చిన సమస్య ఇది

కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

ఇది తేటిగీతి పదాము. దాని వలన కాలు పదాన్ని అంత్యప్రత్యయంగా (ప్రిఫిక్స్) మార్చి వ్రాయలనుకుంటే కాలు ముందుగా వచ్చే పదము (లేక పదభాగము) ఇంద్రగణము III లేక UI అయి ఉండాలి. దాని వల్ల లోకాలు వంటి ప్రయోగాలు చెల్లవు.

నేను వాడిన రెండు రకాల ప్రయోగాలు ఇవిగో.

తే.గీ. ఆడుపెండ్లివారికి కష్టమబ్బి మరల
యెదుటి మగపెండ్లి వారల కెక్కతాళు
లంపు నవకాశమిచ్చు కట్నంపు పంప
కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

- కట్నాన్ని తొలగించాలని మొదటిది

తే.గీ. పన్ను సేకరింప వెసలబాటులేని
చెడుపదార్థము వెనుకకు చేర్చలేని
ఖలుల జేబులు నింపు నక్రమపు టమ్మ
కాలు తొలగిన గలుగు సౌఖ్యములు మనకు

- అక్రమపుటమ్మకాలు తొలగించాలని రెండవది.