Friday, September 18, 2009

కందత్రికము

శ్రీమదాంధ్రభాగవత ప్రధమ స్కంధములోని ఈ మూడు కందాలు చూడండి - ఒకదాన్ని పోలి ఇంకోటి భలే ఉన్నాయి కదూ.

మొదటిది శౌనకాది మునులు నితాంత కురుణోపేతుడైన సూతుణ్ణి పురాణపంక్తు లితిహాస శ్రేణులు ధర్మశాస్త్రముల సూక్ష్మాలని తెలుపమని ప్రస్తుతించడము

మన్నాఁడవు చిరకాలము,
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి,
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్

రెండవది, శ్రీకృష్ణ పరమాత్ముడు కురుయుధ్ధానంతరము తన ప్రియపురంబైన ద్వారకానగరానికి చేరినంతనే జనులు భగవత్పాదాబ్జములను బ్రహ్మపూజ్యములుగా భావించి పూజించిన పిదప పలికిన పలుకులు

ఉన్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్
మన్నారము ధనికులమై
కన్నారము తావ కాంఘ్రికమలములు హరీ

మూడవది తీర్థయాత్రలకు వెళ్ళి మైత్రేయాదులను కలిసి కర్మయోగ సూక్ష్మాలు తెలుసుకొని, హస్తినకు తిరిగి వచ్చిన విదురుణ్ణి ధర్మరాజు కుశలప్రశ్నలు వేస్తున్న సందర్భము.

మన్నారా, ద్వారకలో
నున్నారా యదువు లంబుజోదరు కరుణన్
గన్నారా లోకులచే
విన్నారా మీరు వారి విధమెట్టిదియో

No comments:

Post a Comment