క్రితంవారం భాగ్యనగరానికి వచ్చినప్పుడు బాలాజీభవనములో క్రొత్తగా తెరిచిన పుస్తకశాలను దర్శించాను. దివాకర్లవేంకటావధానిగారి భారతావతరణమనే చిఱుపుస్తకాన్ని కొన్నాను.
నన్నయ్యగారికి భారతాన్ని ఆంధ్రీకరించాలనే ప్రేరణ ఎలాగు కలిగిందో చెప్పే ౨౫పుటల బుల్లిపొత్తమది.
విశేషమేమిటంటే ఇందులో నన్నయభట్టుగారు, నారాయణభట్టుగారు, క్షేమేంద్రుడు, వేములవాడ భీమన మొదలగువారు ఒక్కసభలో చేరియున్న సందర్భాన్ని వేంకటావధానిగారు సృష్టించారు.
పుస్తకం ఆసాంతం చదువలేదు కానీ మొదటి పద్యాలు తమాషాగా తోచినాయి.
ఉదా. రూపకములో నన్నయ్యగారు చెప్పినది
రాజకళావిభూషణుఁడు రాజమనోహరు నన్యరాజతే
జోజయశాలి శౌర్యుని విశుధ్ధయశశ్శరదిందుచంద్రికా
రాజిత సర్వలోక నపరాజితభూరిభుజాకృపాణ ధా
రాజల శాంతశాత్రవపరాగుని, రాజరాజనరేంద్రుఁ బ్రోచుతన్
వేములవాడభీమన చెప్పినది
శ్రీమదుమామహేశు లతిచిత్రవిలాసులు దారు మున్ వియో
గామిత చింతనొండొరులకై సగమౌటలు నిచ్చఁ దెల్పు కాం
క్షా మహిమంబుచే చెరిసగంబుగ నొక్క యొడల్ ధరించు స
త్ర్పేమపు దంపతుల్ సదయదృష్టుల రాజరాజనరేంద్రుఁబ్రోచుతన్
కథలో వేములవాడభీమన చెప్పినది ఆరవ పద్యము - నిజానికి అది చదివేదాకా వేంకటావధానిగారు ప్రసిధ్ధమైన పద్యాలను తీసుకొని ఇంచుక మార్చినట్టు స్ఫురించలేదు. సౌలభ్యంకోసం ఆయా మార్పులను రంగద్ది చూపాను.
ఇక మీకొక చిన్న ప్రశ్న. శ్రీమదుమామహేశుల పద్యము ఏ కావ్యములోనిది, కవి ఎవఱు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment