Sunday, June 26, 2011

నగుమోము గనలేని నా జాలి

తే. త్యాగరాయకృతాభేరి రాగకీర్త
నమును మును పల్వురాలాపనముల వింటి
తొల్లి విన్నవన్ని కుఱుచదోచె నేడు
భానుమతి ప్రతిభాపాటవంబు ముందు


Friday, June 24, 2011

అలవైకుంఠపురంబులో (శ్రవ్యకము)

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోదియగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియనఁ గుయ్యాలించి సంరంభి యై

సిరికిం జెప్పడు శంఖచక్ర యుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁ డభ్రకపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాద ప్రోధ్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై


Friday, May 27, 2011

గొంతెమ్మ కోర్కెలు

ఉ. సత్పురుషుండు కావలె, కుశాగ్రమతిన్ చెలువొందు విజ్ఞుడే
తత్పరిపక్వ భాతి సహితామిత భూతి గడించి, పొందు మ
చ్చిత్పరిపూర్ణ ప్రేమము విచిత్ర చమత్కృత కృత్య పూర్ణుడై,
మత్పతియై తరించు నరమాన్యుడు క్ష్మాసురుడై జనించుచో

తాత్పర్యము. నాకు మంచి స్వభావము గల మగవాడు కావలెను. పదునైన బుధ్ధిబలము గలిగి, యట్టి పరపక్వ విజ్ఙతకు తోడుగా అమితములౌ సంపదలు గడించిన వాడైయుండవలెను. చతుర సరసుడై యుండిన వాడు, ఇతరుల గౌరవమునందిన వాడు, బ్రాహ్మణుడై పుట్టిన యెడల, నా యొక్క ప్రేమకు పాత్రుడై, నా పతియై తరియించు గాక.

తే. భరతఖండంబు పరదేశవాంఛ వీడి
శీతలావరణంబుల జీరలాడి
ఘర్మకణధారలోడ్చక కష్టమూని
పచ్చపత్రము గెలిచిన వాడె వలయు


తా. భారతదేశమును వీడి శీతల ప్రదేశాలలో తన గృహము నేర్పఱచుకొని చెమట లోడ్చు టక్కరలేని కష్టముల భరించి పచ్చపత్రము (గ్రీన్కార్డు) సాధించినవాడు కావలెను.

కం. సత్యవచో తేజమునన్
సత్య హరిశ్చంద్రుని సరిసామ్యతవలయున్
నిత్య నెల జవ్వని వనుచు
ప్రత్యహమున్నను పొగడు నిబధ్ధత నందున్

తా. అనుదినము నా అందచందములను పొగడుటలో సత్యహరశ్చంద్రుని పోలిన సత్యవ్రతుడు కావలెను.

సీ. దాక్షిణ్య నాయకత్వంబున కృష్ణుడె
కావలయు నెఱసఖ్యత నెఱపుచు
నా యొక తోడనె, పాయక నాతోడు
నిలువంగ వలె నయోనిజ నిజసఖుని
వలె తలిదండ్రుల పల్కుల వమ్ముజే
సిన గాని నా యానతిని వలదన
క, నరసింహుని పోలికన్నుండియును నాత్మ
గేహమున బిడాలదేహు మాడ్కి

ఆ. నణిగి మణిగి యుండి యడుగులకు మడుగు
లొత్త వలయు నది మహత్తర మను
భావమున, నల కలజనావనుడెదురైన
వరుని జేతు వేచి వత్సరంబు.

తా. కృష్ణుని పోలిన సరసుడు, పల్కాంతలను సమముగా చూచుకొను నేర్పరితనము కలవాడయ్యు నా యెడనే ప్రేమకలిగిన వాడై యుండవలెను. సీతను వీడని రాముని వలె యుండి, తలిదండ్రుల నైన యెదిరించవచ్చుగాని నా యాన మీఱరాదు. పరజనులకు నరసింహుని వలె అగుపించవలె గాని, నా ముంగిట పిల్లివలె వ్యవహరించ వలెను. అట్టి గొప్పవా డెదురైనచో వానిని యొక సంవత్సరము వేచి చూడుమని, ఆవల పెండ్లయాడుదును.

అదండీ సంగతి.

పెళ్ళి కుమార్తెలకు నచ్చు వరు డెటువంటి వాడై యుండవలెనో కనుగొనుటకు నేటి అంతర్జాల పెళ్ళిపేరమ్మగూళ్ళు చూచిన తెలియును. అధిక సందర్భములలో పెళ్ళి కాని వారికి కళ్ళు తిరగడము, పెళ్ళైనవారికి కడుపుబ్బ నవ్వు రావడము తథ్యము. మీ కొఱకై ఒక మచ్చుతునక ఇదిగో...

(సందీప్ గారి టపా నుండి తీసుకున్నది)

(From a telugumatrimony profile:)
I want to look for a person who is really
- more than caring, affectionate, honest, disciplined, respectful
- who value for people and a responsible person.
- Not the least to mention should be settled abroad,
- have work permit
- fair and handsome
- may be willing to wait for an year so that we can get some time to discuss things
- Should be jovial, fun-loving
- love travelling, straight forward, friendly, traditional, trendy
- a perfect "man"
- belonging to VV - VAIDIKI family only.
- Note: I dont prefer to have an age gap of >3 years.

Thanks

Thursday, April 21, 2011

పరిహాసమా?

ఆదిదంపతులకు మోదంబు కలిగింప
పాదపూజజేయు పారవశ్యు
మందగమను నాగమనమును గని నగు
చందమామ గన నసహ్యమయ్యె

Wednesday, April 20, 2011

ఐక్య రాజ్య సమితి

భూమినాక్రమించి పోరుకు తెగియించు
దిష్టి కళ్ళ పొరుగు దేశములను
చెనకి గెలువవలెను స్నేహముతో గాదు
జవహరు డిది తెలియ జాల కైక్య
రాజ్య సమితి కడకు రయ్యంచు బోయెను
నోటి దనుక వచ్చి దాటిబోయె
చేతికంద వచ్చి చేజాఱి బోయె కా
శ్మీరు పురవరంబు దూరమాయె
నైక్య రాజ్య సమితి కధికార మీయగా
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె

Tuesday, April 19, 2011

సమితింజయు డసదృశ పవనగతిన్

పుంజిగొని ముందుకుంజని
భంజితులై జనె నసురుల బలగంబులు ప్రా
భంజను రౌద్రాటొప ప్ర
భంజనమున జిక్కి సాలభంజికల బలెన్
అంత,
అంజన సూనుని రాబి
ల్చెన్ జాంబవతు పురిగొని సుషేణుడు సౌమి
త్రిన్ జీవితు జేయగ మృత
సంజీవని వేగ దెచ్చు సాయము జేయన్
అపుడు,
వెన్ జూడక సాగెన్ సమి
తింజయు డసదృశ పవనగతిన్ పెకలిచె న
ద్రిన్ జడియింప నసురులన్
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్

Sunday, April 17, 2011

అసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

ఎదురుచూపుల ఆత్రము కూడా సహ్యము కానిదే..

గాత్రము రాగతాళముల,గాన విశేషమహత్తునన్ ,బృహ
న్మైత్రి ఘటిల్లు చెన్నపురమందు వసంత సభాస్థలుల్ మహ
చ్చైత్ర శోభలన్ గన, నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
శ్రోత్ర రసాయనాగమము చూడ్కుల వత్తులు నిల్వరించుటల్