Saturday, September 5, 2015

మంగాంబుధి హనుమంతా

పల్లవి - మంగాంబుధి హనుమంతా, నీ శరణ మంగవించితిమి హనుమంతా.
చరణం ౧ -
బాలార్క బింబము ఫలమని పట్టిన,
ఆలరిచేతల హనుమంతా.
తూలని బ్రహ్మాదులచే వరముల,
నోలి చేకొనిన హనుమంతా
చరణం ౨-
జలధి దాట నీ సత్త్వము కపులకు
నలరి తెలిపితివి హనుమంతా
ఇలయు నాకసము నేకముగా నటు
బలిమి పెరిగితివి భళిహనుమంతా
చరణం ౩ -
పాతాళములోపలి మైరావణు
నాతల జంపిన హనుమంతా
చేతుల మోడ్చుక శ్రీవేంకటపతి
నీతల గొలిచే హిత హనుమంతా


పై కీర్తనను పూర్తిగా వ్రాయడానికి నేను పారుపల్లి సత్యనారాయణగారి పాడిన యూట్యూబులో ఉన్న శ్రవ్యకాన్ని సహాయముగా తీసుకొన్నాను. అయితే, అందులో మూడవ చరణములేదు. అది సంగీతసుధలో దొరికింది.

ఫేసుబుక్కులో ఉదయ్ నన్ను తాత్పర్యము వివరించమని అడిగినప్పుడే నేను మొదటిసారి ఈ కీర్తనను వినడం. వినడానికి ఎంతగానో సొంపుగా ఉన్నది.

అన్నమయ్య కృతులలో సాధారణంగా కనిపించేది ప్రాసనియమం. చరణాలన్ని ప్రాసతో ఉండడం కూడా సులువుగా పదాలను అర్థముచేసుకోవడానికి దోహదము చేసింది.  ప్రాసను ఇంతకు పూర్వం గమనించని వారు ఒక్కసారి చరణాలు చూడండి. మొదటి చరణంలో బాలార్క, ఆలరి, తూలని, నోలి - మొదటి అక్షరం (వడి) దీర్ఘం అంటే గురువు, రెండవ అక్షరం (ప్రాస) లకారమై ఉన్నది.  అన్ని పాదాలకూ ఇటువంటి నడకే వర్తిస్తుంది.  రెండు చరణంలో ప్రతిపాదంలోనూ వడి లఘువు, ప్రాసాక్షరం లకారము. మూడవ చరణంలో ప్రతిపాదంలోనూ వడి గురువు, ప్రాసాక్షరం తకారమై ఉన్నది.

పల్లవి. మంగాంబుధి అంటే ఒక ప్రదేశం పేరు కావచ్చునని ఇతరు లన్నది నిజమేనని నాకు అనిపిస్తోంది. నీ శరణ మంగవించితిమి (శరణము, అంగవించితిమి) అంటే నీ శరణు కోరినాము అని అర్థము. అంగవించడమంటే యత్నించడం, సమీపించడ మని శబ్దకోశం చెపుతోంది.

మొదటి చరణం. బాల, అర్క, బింబము - అంటే ఉదయించే సూర్యుని బింబము. ఆలరి చేతల అంటే వట్టి చేతులతో. తూలని బ్రహ్మాదులంటే నిశ్చలులైన బ్రహ్మాదులని అర్థము. ఓలి చేకొనిన అంటే వరుసగా తీసుకొనిన..స్థూలంగా చూస్తే, ఉదయించే సూర్యుని వట్టి చేతుల పట్టబూనిన హనుమంతా, నిశ్చులైన బ్రహ్మాదులచే వరుసన వరముల నొందిన హనుమంతా, అని తాత్పర్యం.

రెండవ చరణం. సముద్రము దాటి సాటికపివీరులకు తన సత్తా్వన్ని చాటిచెప్పాడు హనుమంతుడు. ఆ సమయంలో భూమ్యాకాశాలు ఏకమైనట్టు అనిపించేలా శరీరపరిమాణాన్ని పెంచాడు హనుమంతుడు. ఇందులో అందఱికీ అర్థమయ్యే అలతి పదాలే అన్నీ. 

మూడవ చరణం. పాతాళాధిపతియైన మైరావణుని చంపినవాడు హనుమంతుడు.  శ్రీవేంకటపతిని అధికంగా (ఈతల) కొలిచేవాడు హనుమంతుడు.

ఇదీ తాత్పర్యం.

Saturday, May 30, 2015

సవ్యసాచి సారథి

ప్రక్కననిల్తు నాయుధము పట్టను పోరను నీ రథంబు పై
నెక్కి రణాంగణంబుఁ జరియింతు ధనంజయ యుద్ధభూమియం
దక్కరవచ్చుపల్కులటు దక్క సహాయము జేయజాల నే
నెక్కుడు యన్న వెన్నని విధేయుడ పాకగృహంబునందునన్

సతీమణి వంటింట్లోకి సవ్యసాచిలా ప్రవేశించి నప్పుడు నా పాత్ర ఇదే. ప్రక్కన నిల్చి సలహా లీయడమే.

Monday, May 25, 2015

గాలిబ్ అనువాదాలు

గన్నవరపు నరసింహమూర్తిగారు, వున్నావ నాగేశ్వరరావుగారు ఫేస్బుక్కులో గాలిబ్ కవితలను పెట్టి వారి అనువాదాలు ప్రచురించారు.

అది చూసి నేను నరసింహమూర్తిగారితో ద్విపదలో వ్రాయుటలో సౌలభ్య ముండునని సూచించాను. దానిక ప్రతిగా వారు నన్నే ఆ కార్యము మీద వేసుకోమన్నారు.

అది నిన్నటి మాట. ఈ రాత్రికి కానీ తీరికదొరకలేదు. కూచున్న కాసేపులో ద్విపదలోనే మూడు కవితలకూ అనువాదాలు తయారైనాయి.

మొదటిది మాత్రము ఒకటిన్నర ద్విపద తయారయి తగ్గనని మొరాయించింది. ఒక పాదాన్ని మొత్తం పూరకంగా వ్రాయాలంటే నాకు మన సొప్పలేదు. అందుకే, ఒక సంస్కృతనాటిక యొక్క అనువాదములో ఎత్తుగీతులు లేని సీసపద్యాలతో వ్రాసిన చిలకమర్తివారినే ప్రేరణగా ఎంచుకొని తప్పులేదనుకొని, దాన్ని యథాతథంగా ప్రచురించడానికి ధైర్యం చేసాను.

ఇవిగో చూడండి.

हम ने मोहबतों के नशे में आ कर उसे खुदा बना डाला ,
होश तब आया जब उसने कहा की खुदा किसी एक का नहीं होता
ద్వి. ప్రేమ మైకంబులో ప్రియురాలి నొక్క
దేవత నా నిల్పఁ దిగిపోయె మత్తు
దైవ మొక్కని సొత్తు తాను కా దనఁగ

మఱొక విధంగా

ద్వి. ప్రేమమైకంబులో ప్రియురాలి నొక్క
దేవతామూర్తిగా దెలిపి పూజింప
దిగిపోయెఁ నా మత్తు దిగ్గున జూడ
దైవ మొక్కని సొత్తు తాను కా దనఁగ


हाथों के लकीरों पे मत जाऐ ग़ालिब ,
नसीब उनके भी होते हैं जिनके हाथ नहीं होते
ద్వి. హస్తరేఖల నరయ నొసటిరాత
హస్తవికలు నెట్లు నమరింప జేతు

ये बुरे वख्त , ज़रा अदब से पेश आ
क्योंकि वख्त नहीं लगता,वख्त बदलने मे
ద్వి. దుర్దశ ఘటియింప త్రోయకు నన్ను
క్షణమాత్రమున్ మారు కాలమ్ము తీరు

సమస్యలూ సమాధానాలు

ఈ మధ్యకాలంలో ఫేస్బుక్కులో దొరికిన సమస్యలకు, శంకరాభరణము బ్లాగులో తగిలిన ప్రశ్నలకూ పూరణలు వ్రాసాను. అన్నిటినీ కలిపి ఒకటపాలో ఉంచుదా మనిపించి చేస్తున్న పని ఇది.

సమస్య - మాయని యనినంత మాయ మాయమ్మౌగా
దీనికి ఏడు పూరణలు

కం. తోయజనేత్రుం డవనీ
నాయకు డనఘు డమితసుగుణాకరు డిహసం
ధాయకు గని తారకరా
మా యని యనినంత మాయ మాయమ్మౌగా

కం. మాయ మన తండ్రిని వలచి
పాయని ప్రేమ ప్రకటించి పతిగ గొలువ న
మ్మా యని పిలువం సరిగా
మా యని యనినంత మాయ మా యమ్మౌగా

కం. మాయా మోహావేశన
భూయిష్టంబగు జగతిని పురహరు నరనా
రాయణ సఖు భవహరసో
మా యని యనినంత మాయ మాయమ్మౌగా

కం. బోయడు పులుగుపయి శరము
వేయగ నజు మాయగప్పె విప్రుని ఛందో
గేయము నుబికె నిషాదుని
మా యని యనినంత మాయ మాయమ్మౌగా

కం. మాయోపాయంబులను స
హాయత్వంబుగ నిడుకొని అల్లరిపనులన్
జేయు పిశాచులతో హను
మా యని యనినంత మాయ మాయమ్మౌగా

కం. బోయగ బ్రతుకుచు నఘముల
హేయపు మాయల నణగుచు నినకుల చంద్రున్
బ్రాయికముగ దలచుచు రా
మా యని యనినంత మాయ మాయమ్మౌగా

కం. బోయగ బ్రతు కీడ్చుచు గడు
రోయుచు మాయల నణగుచు రూపఱుచున్ భ
ద్రాయితమూర్తిని రఘురా
మా యని యనినంత మాయ మాయమ్మౌగా

సమస్య - నన్నయ్యకు సముడనేను నా గ్రామమునన్
దీనికి ఐదు పూరణలు

కం. చెన్నుగ నంకోపరులను
విన్నాణముతోడ నడిపి వింతలు జేయన్
భిన్నానుశాసనుండన్
నన్నయ్యకు సముడనేను నా గ్రామమునన్

దుశ్శాసనుని, అన్నయ్య - కలిపి దుశ్శాసను నన్నయ్య. ఇత్వసంధి అనుకుంటాను. ఇది పెద్దలకు సమ్మతము కాదని అనుకుంటా.
కం. దున్నల బోలిన నూర్గుర
పిన్న సహోదరుల బడసి పెద్దన్నయితిన్
మన్ననలన్ దుశ్శాసను
నన్నయ్యకు సముడ నేను నా గ్రామమునన్

౨. జగనన్నయ్య - జగన్, అన్నయ్య లేక జగనన్న, అయ్య. ఏ విధంగా విడగొట్టినా సమ్మతమే.
ఉన్నవి పలు వ్యాపారము
లన్నిట లాభముల బడసి ఆర్జించితి నే
మిన్నుల నంటుగృహము జగ
నన్నయ్యకు సముడ నేను నా గ్రామమునన్

కం. ఖిన్నుల నాపన్నులను ప్ర
సన్నుల జేయు రఘురామచంద్రుని భక్తిన్
బున్నెము లార్జింపన్ గా
నన్నయ్యకు సముడనేను నా గ్రామమునన్

కం. అన్న లిరువురికి భేదము
లున్నవి గుణగణము లరయ నోడింతును పె
ద్దన్న నతిసులభముగ చి
న్నన్నయ్యకు సముడనేను నా గ్రామమునన్

సమస్య - కోర్కె తీఱిన భక్తుడు గొల్లు మనియె
తే. ఒంటికంటి యంధత్వంబు నొక్క డడిగె
బ్రక్కవానికి రెండురె ట్లెక్కు డడిగి
రెండు గనుల కోల్పోయెను రిత్త వరముఁ
గోర్కె తీఱిన భక్తుడు గొల్లు మనియె

సమస్య - మారుతి యేతెంచె సీత మాయం బయ్యెన్
కం. ధారుణి కూతును తమ లం
కా రాణిగ జూచెదమను కలలను, గను నా
పౌరుల దహించి వైచుచు,
మారుతియే తెంచె సీత మాయం బయ్యెన్

న్యస్తాక్షరి,  గ్రీష్మఋతువును గూర్చి ఆటవేలది. వడగాలి పాదాంతాక్షరాలుగా ఉండాలి.
ఆ. మాడుచున్న మాడుమంటల దిగద్రావ
చేత సురటి తలకు జెట్టునీడ
వేసవి జనులకును వెఱ్ఱు లెత్తింపగా
చల్ల గావలయును చల్లగాలి

సమస్య - గురువుల విలువౌను సున్న కువలయ మందున్ 
రెండు పూరణలు
 
కం. అరయగఁ నాలుగు మాత్రలఁ
దొరకొను గణముల కుదురుగ దొరకును కందం
బిరవుగ, నందు నల గణపు

గురువుల విలువౌను సున్న కువలయ మందున్


కం. సరసిజ మన్నను సరవిఁ బి
సరుహ మనిన నొగి కుముదము జలజము లన్నన్
సరళం బగు లెక్కింపన్
గురువుల విలువౌను సున్న కువలయ మందున్

కువలయ మంటే పద్మము, మిగతా పదాల అర్థమూ అదే




Sunday, May 24, 2015

థాయ్మామిడి, బంగినపల్లి పోరు

కం. స్వాదు ఫలంబులఁ బరిఁ వ
స్తాదుల పోలికఁ నిలుప రసనములు బోరం
వేదిక లైనవి మధురం
బౌ దెలుగుదనంబు నెగ్గె బంగినపలులన్

సింగపూరులో థాయ్ మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. బంగినపల్లులు కాస్త తక్కువే అయినా, పట్టువిడని విక్రమార్కులైన ఆంధ్రులకు అవీ లభ్యమే.

ఈ రెండు రకాల మామిడులు, రూపులో కాస్త వేఱుగా ఉంటాయి. థాయ్మామిడి పొడవుగా నాజూకుగా, మేను బిగువుగా ఉండి, నోరూరించే లాగ ఉంటుంది. బంగినపల్లి గురించి చెప్పేదేముంది, బొద్దుగా, గుండ్రంగా, ముద్దుగా ఉంటుంది. రెంటికీ కండ బాగానే ఉంటుంది.

థాయ్మామిడిలో రసాలవలే పీచు ఎక్కుడుగా ఉంటుంది.

ఈ రెండు రకాల మామిళ్లూ నా నాలికనే న్యాయనిర్ణేతగా చేసుకొని, బరిలోకి వస్తాదులవలే దిగినాయి. ఆరేడేళ్ల క్రింద మొదలయిన పోరు ఇంకా సాగుతూనే ఉన్నది. ప్రతి ఏడూ నా నాలుక రెండు రకాల మామిళ్ల రుచి దెబ్బలు తింటూనే ఉన్నది.

తీపిలో థాయ్మామిడిని, తింటూంటే నోటిని కప్పివేసే సువాసనలో బంగినపల్లిని వేఱువేఱుగా చూస్తే గెలిచేవి ఏవీ నా కంటబడలేదు.

కానీ రెంటినీ పోల్చాలంటేనే కాస్తు చిక్కు.

చివరకు నాలుక తెలుగుదైపోయింది. బంగినపల్లి తెలుగుదనంతో పోరాటాన్ని ప్రతి ఏడూ కొద్దిపాటి అంకెలతో గెలిచేస్తూనే ఉన్నది.

పిట్టిపోరూ పిట్టపోరూ పిల్లి దీర్చినట్టు, ఈ మామిళ్ల పోరు నా నాలుక తీర్చుతోంది.


హనుమజ్జయంతి పద్యము - సీసపద్యము వ్రాస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు

హనుమజ్జయంతి సందర్భంగా, వైశాఖబహుళదశమి నాడు (మే ౨౦౧౫) పద్య మొకటి అల్లుదామని ఉదయాన్నే మొదలు పెట్టాను.

వ్రాసిన పద్యమిది.

సీ. చంటి పాపడ వయ్యు మింటి పం డనుకొని
సెగల గోళంబు పై కెగసినావు
బాలుండవై పలువేలుపుల కృపకు
బాత్రమై విద్యల బడసినావు
పెరిగి సుగ్రీవుని ప్రియసఖుడవు నయి
శ్రీరాము సఖ్యతఁ జేర్చినావు
సరవి నయోనిజ జాడ తెలియ రిపుం
గెలువ జలనిధి లంఘించినావు

తే. వృద్ధరూపము గ్రుద్ధుని భీముని బల
మల్పమని తెలిపి గరువ మడచినావు
రామభక్తికి రూపమై భూమిజనుల
నిండు హృదయములం జిరంజీవి వీవు

పద్యం చదువుతూంటే, మధ్యలో  అక్కడక్కడా నడక నట్టుపడినట్టు అనిపిస్తుంది. భావము సులువుగానే తెలిసినా నడక కాస్త సడలితే సీసపద్యములోని అందం మందగిస్తుంది.

అదే విషయం చెప్పి ఛంద స్సనబడే ఫేస్బుక్కు సమూహములో,  ఎత్తుగీతిలోని పాదాలను ఎవఱైనా కాస్త మార్పుతో నడకను సవరింపగలరేమో చూద్దామని అదే ప్రశ్న వేసాను.

దానికి ప్రతిగా ధనికొండ రవిప్రసాద్ గారు చక్కటి మార్పును సూచించినారు.  పైన ఎఱుపు రం గద్దిన నాలుగవ పాదానికి వారు సూచించిన మార్పు లివిగో.

సరవి సీతాసాధ్వి జాడ కన్ గొని రిపున్ గెల్వ సంద్రమ్ము లంఘించినావు అంటే బాగుంటుంది.అలాగే "మల్పమని తెల్పి గర్వ మడంచినావు. వృద్ధ రూపాన ఇలా వాడితే బాగుండి నడక సాఫీ గా ఉంటుంది.సీసము , గీతి, మొదలైన వాతిలో భగణము, నలము అనే చతుర్మాత్రా గనాలు ఇంద్రగణాలే అయినప్పటికీ సాధ్యమైనంతగా పంచమాత్రలైన ఇంద్రగణాలు వాడితే ఈ పద్యాలు అందంగా ఉంటాయి.

రవిప్రసాద్ గారు సూచించిన మార్పుతో, సరవి సీతాసాధ్వి అంటూ నడక చాలా సులువుగా సాగిపోయింది.

అసలు, ఆ పాదము ఎలా తయారయ్యిందో చూస్తే సీసపద్యము వ్రాసే టప్పుడు తీసుకోవలసిన ఒక జాగ్రత్త సుస్పష్టమవుతుంది.  మొదటి మూడు పాదాలూ, ఏదో ఒక విధంగా,  చేత వ్రాసే సాధనమేదీ లేకుండా మనసులోనే పాడుకుంటూ వ్రాసినవి. సీసపద్యాన్ని వ్రాసుకుంటూ పాడితే, గణాలను కిట్టించినట్టు కాకుండా, చదువరులకు గతుకులు తెలియకుండా నడక సాగుతుంది. ఎందుకంటే, పాడుకుంటూ వ్రాస్తే మనకే ఆ గతుకులు ముందుగా తెలిసేది.  వెంటనే వాటిని సవరించడానికి ప్రత్యామ్నాయపదాలు వెతుకుకోవచ్చు.

నాలుగవపాదం, ఆ మాట కొస్తే, ఎత్తుగీతి మొత్తం, నేను కార్యాలయంలో కూర్చుని, పనిలో పడి, ఒక ప్రక్క ఆ పనులు చూస్తూ, మఱొక ప్రక్క వీలు దొరికినప్పుడు, చరములో చిన్న పదాలు చేర్చుకుంటూ వ్రాసినది. దాంతో, గణాలు కిట్టించడమే పనిగా మారింది కానీ, పాడుకొని పద్య మెంత చక్కగా సాగుతోందా అని చూసుకొనే వీలు కలుగలేదు. 

పద్యం పూర్తియిన పిమ్మట, మొత్త మొకసారి చదివితే, గతుకులు తెలిసాయి.  అలాంటప్పుడు పాదాన్ని మొత్తం తిరగవ్రాయాలి తప్ప చిన్న చిన్న మార్పులు పనికిరావు. రవిప్రసాద్ గారు చేసింది అదే పని.

తుది మాటగా, గీతపద్యాలు వ్రాసే వారు తప్పక గుర్తుంచుకోవలసినది, పై అనుభవంతో బోధపడిన విషయ మేమిటంటే..

పద్యాలు పాడుకుంటూ వ్రాయాలి 

వ్యాసుఁడు

ఈ రోజు ఫేస్బుక్కులో ధనికొండ రవిప్రసాద్ గారు పూరించమని ఒక సమస్య నుంచారు.

వ్యాసుని వ్యాసు డందు రది భావ్యము గాదని నాకు దోచెడిన్.

దీనిని నేను పూరించిన విధానం పంచుకుందామని ఈ టపా వ్రాస్తున్నాను.

ముందుగా వ్యాసుని గూర్చి చదువుదామని ఆంధ్రభారతి నిఘంటువు తెరిచి చూస్తే ప్రస్తుత మహాయుగానికి ముందు ౨౭ మహాయుగాలలో, స్వయంభువు డాదిగా ఇరువది యేడుగురు వ్యాసులు వెలసి యున్నారని తెలిసింది.

ఆ విషయం పూరణకు నాంది పలికింది.

అబ్బా ఎంత కష్టమైన సమస్యరా  అని ఇంట్లో అందఱితో చెప్పాను. అమ్మ వెంటనే, కాశీపట్టణాన్ని శపించినవాడు వ్యాసుఁడు కదా, అది వాడి ఏదైనా పూరణ సాధించవచ్చునేమో చూడమంది. ముందుగా, కోపము లేని వ్యాసుడని లోకులు అనుకుంటారు కానీ అది నిజము కాదనే అర్థముతో పూరించవచ్చునేమో అని ఆలోచింపసాగాను.

కాసేపట్లో గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు ఇవ్వాలి. మా అమ్మాయిని వెంటవేసుకొని నడిచాను. బుఱ్ఱలో నడుస్తున్నంత సేపూ సమస్యా పూరణమును గురించే ఆలోచన.

గ్రంథాలయంలో మా అమ్మాయిని తనపుస్తకాలవద్ద వదిలి, తీరికగా కూర్చుని చరము (మొబైన ఫోను) వాడుతూ పూరణ ప్రారంభించాను. గ్రాసము మొదటి పదము, దానికి తోడుగా భిక్షకుడని చేర్చాలి. గ్రాస తో వచ్చేది కాబట్టి, ఉత్పలమాల కాబట్టీ, ఆ పదం పైన జగణము (IUI) కావాలి. నిఘంటువులో భిక్షకునికి వేఱు పదాలేవేవి ఉన్నాయో వెతకగా, సంస్కృతపదమైన వినీపకుడు తగిలింది. ఇంకే, గ్రాస వినీపకుడు వచ్చేసింది. దానికి ఎదురుదెబ్బ తగిలించాలి కాబట్టి, సంధికలిసి దీర్ఘము రావాలి కాబట్టి, అపజయ పదాన్ని పట్టుకున్నాను. ఆ తరువాత మిగతావి తేలికగానే పూరించాను.

మధ్యలో, వ్యాసమహాముని భారత రచనను మదిలో ఉంటుకొని, అఖండవాక్ప్రవాహ అనే విశేషణాన్ని కూడ సిద్ధం చేసుకొని పెట్టాను. కానీ చివరకు అది వాడనే లేదు.

భూసురు, భానుతేజ సురపూజిత దివ్యపరాశరాత్మజున్ - ఈ పాదము మొత్తమూ గ్రంథాలయానికి నడుస్తున్నప్పుడే మనోఫలకముపై వ్రాసేసుకున్నాను.

దాంతో మూడు పాదాలు తయారైనాయి. అఖండవాక్ప్రవాహ విశేషణాన్ని వాడి మఱొక పాదము తయారు చేవవచ్చు, ప్రాసాక్షరయుక్తమైన పదం దొరకడం కొంచెం కష్టమవడం వల్ల, కాస్త శ్రమతో కూడిన పని.  చెప్పదలచుకొన్నది కూడా ఇమడడం కష్టమవుతుంది, ఎందుకంటే అఖండవాక్ప్రవాహము పాదము చివరలోనే అతుకుతుంది. అంటే పాదాంతము వఱకూ ప్రస్తుతమహాయుగవ్యాసుని గూర్చియే చెప్పాలి. అదే చేస్తే నాలుగు పాదాలు పూర్తయి, ఐదవ పాదము నాశ్రయింపవలసి రావచ్చు.

ఆలోచించి ఆ మార్గాన్ని విడిచి పెట్టి, సమస్యలో ఇచ్చిన పాదాన్ని మూడవది చేసి, సులువైన తెలుగులో నాలుగవ పాదాన్ని చకచకా పూరించేసాను. వ్యాసునిలో యకారము వడి అక్షరానికి, స్వయంభువులో రెండవ అక్షరానికి యతి కుదిరి పాదరచనా సౌలభ్యం చేకూరింది.

అలా పూరణ పూర్తయ్యింది. పూర్తి పద్యమిదిగో.

ఉ. గ్రాస వినీపకాపజయ కష్టవిజృంభిత శాపశస్త్రుడౌ
భూసురుఁ భానుతేజు సురపూజిత దివ్యపరాశరాత్మజున్
వ్యాసుని వ్యాసు డందు రది భావ్యము గాదని నాకు దోచెడిన్
వ్యాసులు పల్వు రుండగ స్వయంభువు వెంట మహాయుగంబులన్

అదండీ సంగతి.

Thursday, May 21, 2015

నేపాల భూకంపము

నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో నేపాల్ భూకంపాన్ని గూర్చి సీసపద్యము వ్రాయాలి, మానససరోవర ప్రసక్తి ఉండాలి కానీ వేఱొక అర్థముతో ఉండాలి. దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యమిది.

సీ. సకలలోకాధిపప్రకటదేవాళి మా
నససరోవరము లనలము లగుట
నా హిమవత్పర్వతాగ్ర మాగ్రహ మంది
క్రింది నేలలఁ నణగించె నేమొ
భూమాత లోకాన పొంగిన కుటిలత్వ
రీతులకు జలదరించె నేమొ
ప్రకృతమ్మపై దాడి వికృతమ్ముగ సలుపు
వికటులఁజూచి కంపించె నేమొ

తే. రాక్షసత్వము ప్రబలి, అరాచకమ్ము
లోక మంతట గెలిచి, ప్రలోభ మెగయ
నేమి శాపమో తగిలె నా భూమి జనులఁ
గాలరాచె నేపాళ భూకంప మిటుల