------
- మనువసుప్రకాశిక. విమర్శాగ్రేసరులు కాశీభట్ల బ్రహ్మయ్యగారి పుస్తకము. విమర్శ ప్రతివిమర్శ పరంపరగా నాలుగుదీర్ఘవ్యాసాలు వెలువడ్డాయని, అందులో ఈ పుస్తకము రెండవదిని పీఠిక చదివితే తెలిసింది. విమర్శ వ్రాయడము నేర్వాలంటే కాశీభట్లవారి వ్యాసము చదివితీరవలసిందే.
౨. తిరుమల తిరుపతి దేవస్థానము వారి పుస్తకవిక్రయశాలలో
- చిలకమర్తిగారి అవిమారక మను నాటకము, భారతకథామంజరి, కృపాంభోనిధి యను భగవత్ స్తుతిశతకము, మూలముతో కూడిన భల్లటశతకము. సన్న పుస్తకాలు, నాలుగు కలిపి రెండువందల పుటలు మించవేమో.
- సప్తపది అను వైదికవివాహసంస్కారమును విశదీకరించు కరదీపిక, రఘునాథాచార్యకృతము.
- అన్నమయ్యపదసౌరభము, ప్రథమ, ద్వితీయ, చతుర్థభాగాలు. నేదునూరి కృష్ణమూర్తిగారు తా కూర్చిన అన్నమయ్యకీర్తనలు స్వరతాత్పర్యసహితములుగా ప్రకటించినారు. తృతీయభాగము దొరుకలేదు.
- వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా ఆయన కుమారుడు పూర్తిచేసిన పూలవిందు అనబడే పుస్తకము.
(ఇవి కాక షట్శతసంకీర్తన వైజయంతి అను శ్రవ్యకమాల యొకటి. ౬౦౦ల కృతులు వినడానికి సయమం పడుతుంది, విన్నంత మేరకు ఉద్దండులైన గాయికాగాయకుల గాత్రాలే వినబడ్డాయి )
౩. వావిళ్ళ వారి వద్దకొన్నవి
- శ్రీజయదేవకృత గీతగోవిందకావ్యము. ఆంధ్రటీకాతాత్పర్యసహితము. ఇరువదినాలుగు అష్టపదులు కల కావ్యము.
- శ్రీకాళిదాసకృత కుమారసంభవము. ఆంధ్రటీకాతాత్పర్యసహితము. చక్కటి అచ్చుతో చూడముచ్చటగా నున్న పుస్తకము.
ఇవి కాక చిన్న, బుల్లి పాతపుస్తకాలు పదిదాక దొరికాయి. ఒక్కొకటి పదిరూపాయలకు మించని వెల.
౧. నన్నిచోడుని వస్తుకవిత - తుమ్మలపల్లిరామలింగేశ్వరరావుగా
౨. అక్కనమాదన్నల చరిత్ర - వేదుల వేంకటరాయశాస్త్రి గారు వ్రాసి ప్రచురించినది. రెండవసారి చదువవలెననిపించు రీతిగా తీర్చిదిద్దబడినది. ౧౯౫౧లో తెలుగుభాషాసమితివారి బహుమతి పొందిన పుస్తకము.
౩. నీలాసుందరీపరిణయము. కూచిమంచి తిమ్మకవిప్రణీతము.
౪. రాజయోగసారము. తరిగొండవెంకమాంబకృత ద్విపదకావ్యము.
౫. ధనాభిరామము. నూతనకవిబిరుదాంకిత సూరనకవికృతకావ్యము.
౬. రామరాజీయము. గుస్తావ్ ఓపర్టను వానిచే కూర్పబడినది. వెంకయ్యగారు రచించినది. కవివివరాలు తెలియడంలేదు.
౭. ధర్మనిర్ణయం. తుమ్మలపల్లిరామలింగేశ్వరావుగారి నవల
౮. మనోహరి అను సాంఘికనవల, రచయిత బరంపురం ప్లీడరుగారని గుర్తున్నది, పేరు స్ఫురించుటలేదు. పుస్తకము భాగ్యనగరంలో వదిలి వచ్చాను.
౯. రేచుక్క పగటిచుక్కకథ
౧౦. మైరావణ చరితము
చవరి రెండు ఇరవైపుటలు మించని పుస్తికలు. అక్కథ లాంధ్రదేశములో బహూళప్రచారములో ఉండడమూ, పలుప్రతులు తప్పులతడకలై ఉండడమూ చూసి, వావిళ్ళవారు సంస్కరించిన ప్రతులు ప్రకటించారు. చదవదగ్గ పుస్తకాలు.
ఇవికాక, ఆంధ్రభారతం అరణ్యపర్వం (వావిళ్ళవారిది) దారిప్రక్కన దొరికితే కొన్నాను. సింగపూరులో ఒక ప్రతి ఎలాగూ ఉన్నది, అందువల్ల భాగ్యనగరములోని వదిలి వచ్చాను.